కొత్తపల్లి అని ఒక ఊరు ఉండేది. ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో పచ్చని కొండల మధ్య ఓ గురుకుల పాఠశాల. ప్రతి సంవత్సరం ఆ బడికి సెలవులు ఇచ్చినప్పుడు, అదే స్థలంలో పిల్లల క్యాంపు జరిగేది. బళ్ళో చదివే పిల్లలేకాక, ఆ పిల్లల ఊళ్లలోంచి కూడా చాలా మంది పిల్లలు వచ్చి, క్యాంపుల్లో పాల్గొనేవాళ్ళు.

ఆ బళ్ళో‌ ఏడో తరగతి చదువుతున్నాడు సాంబశివుడు. డప్పు వాయించటం నేర్చుకోవాలని వాడికి చాలా కోరికగా ఉండేది. అయితే డప్పు నేర్చుకోవాలంటే చాలా సాధన చేయాలి. అంత అవకాశం, అంత సమయం తనకు ఎప్పుడు దొరుకుతుందా, అని వాడు ఎదురుచూస్తూ ఉండేవాడెప్పుడూ.

'ఈసారి క్యాంపులో డప్పు నేర్పిస్తారట' అని సాంబశివుడూ, వాడి మిత్రులు నలుగురూ చాలా ముందుగానే క్యాంపు చిట్టాలో తమ పేర్లు రాయించుకున్నారు. క్యాంపు మొదలవ్వగానే వీళ్లు ఐదుగురూ డప్పు గ్రూపులో కుదురుకున్నారు. డప్పు బాగా శబ్దం చేస్తుంది గనక, డప్పు మాస్టారు వాళ్లను దూరంగా ఉన్న వంకలోకి తీసుకెళ్లారు. కొంచెం సేపు వాళ్ల దగ్గర ఉండి ఒక చాటు నేర్పి, సాధన చేస్తూండమని, వేరే గ్రూపు దగ్గరకు వెళ్ళాడాయన.

ఈ అల్లరి పిల్లల బృందం కొద్దిసేపు డప్పు సాధన చేశారు గానీ, దూరంగా విన వస్తున్న శబ్దాల వల్ల వాళ్ళ లయ దెబ్బతింటున్నది - ఇంకొంచెం దూరం వెళ్తే తప్ప వీలయ్యేట్లు లేదనుకున్నారు ఐదుగురూ. సాంబశివుడి సారధ్యంలో అందరూ కొండపైకెక్కటం మొదలుపెట్టారు. అడవి రాను రాను దట్టంగా అవుతున్నదిగాని, వాళ్ళకు కూర్చునేందుకు అనువైన స్థలం దొరక్క, వాళ్ళు ఇంకా ఇంకా పైకెక్కి- ఇంకో కొండ, మరో కొండ- అట్లా వెళ్ళీ, వెళ్లీ- చివరికి ఓ చదునైన స్థలం చేరుకున్నారు.

ఆసరికి అందరికీ బాగా దాహం అవుతున్నది. "దగ్గర్లో ఎక్కడైనా నీళ్ళ చెలిమ ఉందేమో వెతకాలి..” చూడగా అది దగ్గర్లోనే కనబడింది! అక్కడ ఒక పక్కగా పెద్ద పెద్ద రాళ్ళు ఓ క్రమ పద్ధతిలో పేర్చి ఉన్నై. వీళ్ళు ఆ రాళ్ళను పీకి చూస్తే, లోపల్నించి చల్లటి గాలి వెలువడింది తేమగా. ఐదుగురు పిల్లలూ ఉత్సాహంగా ఆ రాళ్ళను పీకి పక్కన పడేసి, లోపలికి దూరారు. చూస్తే అద్భుతం!-ఆ గుహ లోపల ఒక పెద్ద కొలను ఉన్నది! పైనుండి సన్నగా పడుతున్న సూర్యకాంతికి ఆ కొలనులో నీళ్లు స్వచ్ఛంగా మెరుస్తున్నాయి! ఇక ఆగలేకపోయారు పిల్లలు. అందరూ డప్పుల్ని ఒక మూలగా పెట్టి, కొలనులోకి దూకి ఈత కొడుతూ ఆటలాడటం మొదలుపెట్టారు.

కొంత సేపు ఈత కొట్టిన తరువాత వాళ్ళలో ఒకడు కొలనులోంచి బయటికి వచ్చి గుహను పరిశీలిస్తూ ఇంకా లోపలి వెళ్లాడు. లోపల వాడికో పెట్టె కనిపించింది. వాడు పిలవగానే మిగిలిన పిల్లలంతా వచ్చి చూశారు దాన్ని. అది కొత్తగా, పెద్దగా, బరువుగా ఉన్నది. ఐదుగురూ కలిసి ధైర్యంగా దాన్ని తెరిచి చూశారు- చూస్తే దానిలో నిగనిగలాడుతున్న బంగారు నగలు! వాళ్ళంతా ఇక ఒళ్ళు మరిచిపోయారు. ఇది నాకంటే ఇది నాకని గట్టిగా వాదులాడుకుంటూ, అరుచుకుంటూ, వాళ్ళు అవి అక్కడికెలా వచ్చాయనే ఆలోచించలేదు.

అంతలో - లోపలికి ఎట్లా వచ్చారో, ఏమో - ఉన్నట్లుండి ముగ్గురు ఆజానుబాహులు వచ్చి, వాళ్ళమీద పడి, క్షణాల్లో ఐదుగురి కాళ్ళూ చేతులూ కట్టి పడేశారు! ఆపైన వాళ్ళు పిల్లల్ని బెదిరిస్తూ- "ఎవర్రా మీరు? ఇక్కడికెందుకు వచ్చారు?" అని అడిగారు. సాంబశివుడు ధైర్యంగా "మేమేం తీసుకోలేదు - కావాలంటే చూసుకోండి! మేం కొండ ఎక్కుకుంటూంటే దాహం వేసింది. నీళ్లకోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని వదిలెయ్యండి. మేం ఒట్టి పిల్లలం. మిమ్మల్ని ఏం చేయగలం?" అన్నాడు. వాళ్ళలో ఒకడు- "ఒరే! వీళ్లని వదిలితే ఇక మన గుహ సంగతి అందరికీ తెలిసిపోతుంది. వీళ్ళని వదలకండి. వీళ్ల పని ఎలా పట్టాలో‌ రేప్పొద్దున మన నాయకుడు వచ్చి చెబుతాడు. అంతవరకూ వీళ్ళ కట్లు విప్పకపోతే సరి. పదండి, మనకూ సమయం అవుతున్నది" అన్నాడు. ఆపైన వాళ్లంతా 'ప్రొద్దునే వచ్చి మీ పని పడతాం' అని పిల్లల్ని మరోసారి బెదిరించి, పిల్లలు చేసిన కంత గుండా బయటికి వెళ్ళిపోయారు.

ఇక, డప్పు పిల్లలు కనబడటం లేదన్న సంగతి సాయంత్రానికి గానీ క్యాంపులో టీచర్లకు తెలీలేదు. వెంటనే వాళ్ళు కంగారుగా అన్ని వైపులా వెతకటం మొదలు పెట్టారు. చీకటి పడుతుండే సరికి వాళ్ళు పూర్తిగా భయపడిపోయారు. పోలీసులకు, ఫారెస్టువాళ్ళకు కబురు పంపారు. అందరూ టార్చిలైట్లు వేసుకొని పిల్లల పేర్లు అరుస్తూ అన్నిదిక్కులా తిరగటం మొదలు పెట్టారు. అయినా పిల్లలు అన్ని కొండలు దాటి వెళ్తారని వాళ్ళకెలా తెలుస్తుంది? ఎవ్వరూ పిల్లలున్న గుహ చాయలకు కూడా రాలేదు.

దొంగలు అట్లా వెళ్ళగానే పిల్లలు మెల్లగా ఒకరికొకరు దగ్గరగా జరిగారు. అంతకు ముందు క్యాంపుల్లో వాళ్ళు రకరకాల ముడులు వేయటం, కటిక ముడులను విప్పటం- ఇవన్నీ‌ బాగా నేర్చుకుని ఉన్నారు! మెల్లగా ఒకరి చేతి కట్లు ఒకరు విడిపించుకున్నారు అంతా. ఆపైన కాలి కట్లు వదిలించుకోటానికి ఎక్కువ సమయం‌పట్టలేదు. అందరూ నవ్వుకొని, వెళ్ళిపోయేందుకు తాము చేసిన కంత వైపుకు పరుగెత్తారు. అయితే దొంగలు ఏమంత తెలివిలేనివాళ్ళా? వాళ్ళు ఆ కంతను ఎంత పెద్ద బండరాతితో మూసేశారంటే, వీళ్ళు ఎంత నెట్టినా ఆ రాయి వీసమంతకూడా కదలలేదు!

ఇక పిల్లలందరూ భయపడిపోయారు. గుహలో ఎంత లోపలికి పోయి చూసినా వాళ్లకు వేరే దారి కనబడలేదు. అందరూ నీరుగారిపోయారు. అంతలో చీకటి పడింది! గుహలో చీకటి అలుముకున్నది! అక్కడ, క్యాంపులో అందరూ సాంబశివుడి గ్యాంగు గురించే అన్ని వైపులా వెతుకుతున్నారు. పోలీసులు వచ్చారుగానీ, 'అంత చీకట్లో అడివిలోకి ఎట్లా వెళ్ళాలి?' అని ఊరకుండిపోయారు.

రాత్రి తొమ్మిదిగంటల సమయంలో క్యాంపులో ఉన్న పిల్లవాడు ఒకడికి దూరంగా ఎక్కడినుండో చిన్నగా డప్పు శబ్దం వినబడింది. ఎవరో ఆగకుండా డప్పు కొడుతున్నారు- 'ఎవరై ఉంటారు? ఈ సమయంలో ఎవరు డప్పు సాధన చేస్తున్నారు?' అని వాడు తన గ్రూపులోవాళ్లను లేపాడు. వాళ్ళూ శ్రద్ధగా విని, 'అవున్రా, నిజమే! ఎక్కడినుండో డప్పు వస్తోంది!' అని వాళ్ల టీచర్లను లేపారు. అట్లా టీచర్లు, పిల్లలు, పోలీసులు అందరూ లేచారు. డప్పు టీచరు దీక్షగా ఆ శబ్దం విని, అది సాంబశివుడి దరువే అని తేల్చాడు - ఇంకేముంది, అందరూ బయలుదేరి, శబ్దం వస్తున్న దిశగా అడవిలోకి పోయారు.

అందరూ గుహ దగ్గరికి చేరుకునే సరికి తెల్లవార వస్తున్నది. ఇప్పుడు అందరికీ పిల్లలు గుహలో ఉన్నారన్న సంగతి తెలిసిపోయింది. అందరూ కలిసి బండరాతిని పక్కకు జరిపి, పిల్లల్ని దగ్గరకు తీసుకున్నారు. అప్పుడు సాంబశివుడు పోలీసులకు దొంగల గురించి చెప్పి, 'మీరు నిశ్శబ్దంగా ఇక్కడే మాటు వేస్తే అందరినీ పట్టుకోవచ్చు' అని చెప్పాడు. పోలీసులు పిల్లల్నందరినీ క్యాంపుకు పంపించి, అక్కడే మాటు వేసి దొంగల్నందరినీ పట్టుకున్నారు. వాళ్ళు మామూలు దొంగలు కారు! అంతర్జాతీయ ముఠావారు! అంత పెద్ద దొంగల్ని పట్టించి ఇచ్చిన పిల్లల్ని పోలీసులు అందరూ అభినందించారు. తన సమయస్ఫూర్తితో రాత్రంతా డప్పువాయించి, దొంగల్ని పట్టించి, తోటివారిని కాపాడిన సాంబశివుడి ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని అందరూ కొనియాడారు.