పులులు చాలా ప్రమాదకరమైనవి. ప్రమాదకరమైన వాటితో ఆడుకునేవాళ్లను అజ్ఞానులే అనాలి. అయితే తెలివిలేకగానీ, అహంకారంతోటిగానీ వాళ్ళు ప్రమాదాలకు ప్రాణం పోస్తే, ఆ మంటల్లో చిక్కుకుని, సామాన్యులూ కష్టాలపాలౌతుంటారు.

నలుగురు బ్రాహ్మణులు ఒకప్పుడు భారతదేశమంతా తిరిగి, రకరకాల విద్యలు నేర్చుకున్నారట. ఎంతో విజ్ఞానాన్ని మూటగట్టుకున్నారు వాళ్ళు. తమకున్న నేర్పునూ, తాము నేర్చిన విద్యల మహత్తునూ తోటి మిత్రులకు చూపాలని ఎదురుచూస్తున్నారంతా.

ఆ నలుగురూ ఒక అడవిలో కలిశారు. వాళ్లలో ఒకడికి అక్కడ ఒక ఎముక దొరికింది. అది ఒక పులి తుంటి ఎముక. దాన్ని సంపాదించిన బ్రాహ్మణుడు అన్నాడు - "చూడండి - ఇది ఏ జంతువైనా కావొచ్చు. దీని ఎముక ఒక్కటి ఉంటే చాలు - నా శక్తితో నేను దీని అస్థిపంజరాన్ని సంపూర్ణంగా నిర్మించగలను." అలా అని, వాడు ఆ ఎముక మీద తన ఉత్తరీయాన్ని కప్పి, ఏదో మంత్రం పఠించాడు. వెంటనే ఎముక స్థానంలో పులి అస్థిపంజరం తయారైంది.

రెండవ బ్రాహ్మణుడు అన్నాడు - " నేను దానికి మాంసం, రక్తం, చర్మం ఇవ్వగలను" అని. అతని మంత్ర ప్రభావం వల్ల అస్థిపంజరానికి మాంసమూ, రక్తమూ, చర్మమూ లభించాయి. ఇప్పుడు వాళ్లముందు ప్రాణంలేని పులి ఒకటి పడి ఉన్నది - చారలతోటీ, మీసాలతోటీ.

మూడో బ్రాహ్మణుడు అన్నాడు - "నేను ఏం చేయగలనో తెలుసా, మీకు? దానికి ప్రాణం పోయటం ఎలాగో నాకు తెలుసు!" అని.

నాలుగోవాడికి మిగతా ముగ్గురికి ఉన్నంత విజ్ఞానం లేదు. "ఆగాగు! దానికి ప్రాణం పొయ్యకు! నీ శక్తి యుక్తులమీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది." అన్నాడు వాడు కంగారుగా.

"ఏదైనా చేసేందుకు శక్తి ఉండీ ఆ పని చెయ్యకపోతే ఏం లాభం? నా మంత్ర శక్తిని పరీక్షించే అవకాశం నాకు ఇప్పటివరకూ రాలేదు. నేనిప్పుడు దీనికి ప్రాణం పోసి తీరతాను. చూస్తూండు, ఊరికే" అన్నాడు మూడోవాడు.

"నువ్వంత గట్టిగా పట్టు పడితే, సరే. కానీ కొంచెం సేపు ఆగు. నన్ను ముందు ఈ చెట్టు ఎక్కనీ" అని, నాలుగోవాడు దగ్గర్లో ఉన్న చెట్టును ఎగబ్రాకాడు.

అప్పుడు మూడోవాడు తన మంత్ర మహిమతో పులికి ప్రాణం పోశాడు. ప్రాణం రాగానే దానికి విపరీతమైన ఆకలివేసి, తినేందుకు ఏది దొరుకుతుందా' అని చుట్టూ చూసింది. భయంతో ముడుచుకొని కూర్చున్న ముగ్గురు బ్రాహ్మణుల్నీ చూడగానే అది గర్జిస్తూ వాళ్ళమీదికి దూకింది. పారిపోవటానికి కూడా కాళ్ళు రాక, ఆ ముగ్గురూ అట్లా పులికి ఆహారం అయిపోయారు.

తన మిత్రులు ముగ్గురూ పులికి ఆహారమౌతుంటే చూస్తూ, రాయిలా కదలక-మెదలక కూర్చోవటం మినహా నాలుగోవాడు మరేమీ చేయలేకపోయాడు. పులి భోజనం ముగించుకొని సంతృప్తిగా అడవిలోకి వెళ్లిపోయిన తర్వాత చాలాసేపటికి, వాడు క్రిందికి దిగి, వణికే కాళ్లతో ఇంటివైపుకు పరుగు తీశాడు.

పులులకు ప్రాణం పోశాక, ఇంక ఎవరూ ఏమీ చెయ్యలేరు - అవి తమ భోజనం ముగించుకొని, తృప్తిగా తమ దారిన తాము వెళ్ళిపోయేంతవరకూ. ఆపైన మిగిలిన వాళ్ళు తమకు మిగిలిన దారుల్ని- అప్పుడు- వెతుక్కుంటారు. మన రాష్ట్రంలోంచి అల్లర్లపులి తొందరగా వెళ్ళిపోతుందనీ, మనందరికీ ఏదైనా చక్కని దారి సత్వరం దొరుకుతుందనీ ఆశిద్దాం.

ఈ మాసపు కొత్తపల్లి పత్రికలో బాల కథారచయితలిద్దరు తమ కథలకు చిత్రాలు కూడా గీశారు. వారికి మనందరి ఆశీస్సులు.

                                            శుభాకాంక్షలతో,

కొత్తపల్లి బృందం.