రామాపురంలో నివసించే రంగయ్య, అతని కొడుకు రాజులకు ఉన్నది ఒక్కటే ఆస్తి: ఒక ముసలి గుర్రం. ఆ ఊరి చివరన సున్నపు రాతి కొండ ఒకటి ఉండేది. వీళ్లిద్దరూ సున్నపురాళ్లను ఆ గుర్రం మీద వేసుకొని ఊళ్లలో అమ్ముకొనే వాళ్ళు.
ఒక సంవత్సరం వానల్లేక, గొప్ప కరువు వచ్చింది. ఊళ్లల్లో అన్నం దొరకటమే కష్టం అయిపోయింది- ఇక సున్నం ఎవరు కొంటారు? ఎలాగూ ఆ ప్రాంతంలో అంతటా సున్నపు కొండలు ఉన్నై, కనుక ఇద్దరూ వేరే ఊరికి వలసపోతే తప్ప ఇక వీలు అవ్వదనిపించింది- తండ్రీ కొడుకులకు. "ఈ ఊరు వదిలి వేరే ఊరికి పోతే, అక్కడా సున్నం అమ్ముకొని బ్రతకొచ్చు గదా" అని, వాళ్లిద్దరూ గుర్రంతో సహా వేరే ఊరికి బయలుదేరారు.
రామాపురం దాటాక కొంత సేపటికి క్రిష్ణాపురం వచ్చింది. ఆ ఊరుగుండా వెళ్తుండగా, వీధిలో నిలబడ్డ పెద్దమనుషులు కొందరు "అరే! ఇదేం వింత? గుర్రాన్ని పట్టుకొని ఇద్దరు మనుషులు నడుచుకొని పోతున్నారు! బొత్తిగా తెలివి లేని వాళ్లల్లే ఉన్నారు. ఎవరో ఒకరు గుర్రం పైన ఎక్కి హాయిగా కూర్చొని పోవచ్చు గద!" అన్నారు, వీళ్ళకు వినబడేటట్లు.
వాళ్ళమాటలు విని సిగ్గుపడ్డ రంగయ్య, ఊరు దాటగానే కొడుకును గుర్రంమీద కూర్చోమని, తను ప్రక్కన నడవసాగాడు. అలా ఇద్దరూ క్రిష్ణాపురం నుండి గోవిందాపురం చేరుకున్నారు.
గోవిందాపురపు వీధుల్లో జనాలంతా వీళ్లను వింతగా చూశారు. వాళ్లలో కొందరు అక్కడక్కడా గుర్రాన్ని ఆపి, రాజుతో "ఏమిరా! దుక్కలాగున్నావు. నువ్వు గుర్రం మీద రాజాలా కూర్చొని, పాపం, ముసలాయన్ను నడిపిస్తున్నావే? ఈ కాలపు కుర్రవాళ్ళకు కొంచెమైనా బుద్ధి ఉండట్లేదు. పెద్దలంటే ఏమాత్రం గౌరవం లేదు!" అన్నారు.
వెంటనే రాజు గుర్రంపైనుండి క్రిందికి దూకి, తండ్రిని గుర్రంపైన కూర్చోబెట్టి, తను వెంట నడవటం మొదలుపెట్టాడు. మెల్లగా వాళ్లు నారాయణపురం చేరుకున్నారు.
నారాయణపురపు వీధుల్లో తిరుగుతున్న జనాలు కొందరు వీళ్ల దగ్గరకు వచ్చి, రంగయ్యను పలకరించి, 'ఎక్కడినుండి వస్తున్నారు- ఎక్కడికి వెళ్తున్నారు' వగైరా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆపైన వాళ్ళు రంగయ్యతో "పెద్దాయనా, ఏమీ అనుకోకు. చూసేందుకు పెద్దవాడివిలాగా ఉన్నావు. పిల్లవాడిని నడవమని, నువ్వు గుర్రమెక్కి కూర్చుంటావా? కాలం మారిందయ్యా, అందుకే ఇట్లా కరువు కాటకాలు వస్తున్నాయి!" అన్నారు.
ఊరుదాటగానే రంగయ్య గుర్రం దిగి, రాజును గుర్రమెక్కమన్నాడు. రాజు ససేమిరా ఒప్పుకోలేదు. 'గోవిందాపురంవాళ్ళు ఏమన్నారో వినలేదా?' అన్నాడు. "మరి నారాయణపురం వాళ్ళు నన్నేమంటున్నారో చూడు' అని మొత్తుకున్నాడు రంగయ్య. ఇద్దరూ కలిసి ఆలోచించుకొని, 'ఎలాగో ఒకలా ఇద్దరూ గుర్రంమీద ఎక్కి పోవటమే మేలు' అని నిశ్చయించుకున్నారు. అలా ఇద్దరూ ఒకే జీనులో ఇరుక్కుని కూర్చుని, గుర్రమెక్కి ముందుకు సాగారు.
వాళ్లు మాధవపురం చేరుకునేసరికి, అక్కడ వీధిలో నిలబడ్డ జనాలు కొందరు వాళ్ల దగ్గరికి వచ్చి, "మీకు ఏం పొయ్యేకాలమయ్యా!? ఇద్దరూ ఒకే గుర్రం మీదెక్కి కూర్చొని పోతున్నారు? ఈ ముసలిగుర్రం ఏం పాపం చేసుకున్నది? అదీ మీలాంటి ప్రాణమే కదా? మూగజీవాలమీద కొంచెమైనా దయ చూపాలయ్యా! దిగండయ్యా, దిగండి!" అన్నారు. వెంటనే ఇద్దరూ గుర్రందిగి, ఊరవతల ఉన్న ఓ మర్రిచెట్టు క్రింద కూర్చొని, 'ఇక మన ప్రయాణం ఎలాగ?' అని ఆలోచనలో పడ్డారు. ఎంతకీ వాళ్ల సమస్య తెగలేదు.
అలా వాళ్లు తర్జన భర్జన పడుతున్న సమయంలో ఓ సాధువు అటుగా వచ్చాడు. రంగయ్యకు ఆయన్ని చూడగానే ప్రాణం లేచివచ్చినట్లైంది. వెళ్ళి ఆయనకు నమస్కరించి, తమ సమస్యను వివరించి, "అయ్యా! ఇక మేం ప్రయాణం చేయలేం. మీరెట్లా చెబితే అట్లా చేస్తాం. మీరే మాకు సాయం చేయాలి, కేశవాపురం వరకు చేరుకునే మార్గం చూపాలి" అని ప్రాధేయపడ్డాడు.
సాధువు వెంటనే తన వద్ద ఉన్న కాషాయం తువాల్లోంచి నాలుగు గుడ్డముక్కల్ని చించి, వాటిని మంత్రించి, వాళ్ల చేతుల్లో చెరి రెండూ పెట్టాడు- "ఈ గుడ్డముక్కల్లో చాలా మహత్తు ఉన్నది. అందుకని మీరు వీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి" అన్నాడు.
"సరే, చెప్పండి స్వామీ!" అన్నాడు రంగయ్య భక్తిగా. "బాగా వినండి. మీరు ఎవ్వరితోనైనా మాట్లాడదల్చుకున్నప్పుడు మాత్రం ఈ ముక్కలు మీ చేతుల్లో ఉండాలి. అలాకాక, మీరు ప్రయాణంలో ఉన్నా, వేరే ఏదైనా పనిలో ఉన్నా ఈ ముక్కల్ని మీ చెవుల్లో పెట్టుకోవాలి. మరువకండి! జాగ్రత్తగా ఉపయోగించుకోండి!" అన్నాడు సాధువు వెళ్లిపోతూ.
తండ్రీకొడుకులు ప్రయాణానికి సిద్ధమై, సాధువు తమకిచ్చిన బట్టముక్కల్ని భక్తిగా కళ్లకద్దుకొని, చెవులలో పెట్టుకున్నారు. ఆపైన వాళ్ల ప్రయాణానికి ఏ ఆటంకమూ ఎదురుకాలేదు. ఇద్దరూ కేశవాపురం చేరుకొని, అక్కడే స్థిరపడ్డారు. స్వామి చెప్పిన విధంగానే ఆచరిస్తూ, వాళ్లు ఆ బట్టముక్కల్ని భద్రంగా దాచుకుని, జాగ్రత్తగా వాడుకుంటూ వచ్చారు. ఆయన మహత్తువల్ల, వాళ్ల వ్యాపారం కూడా బాగా సాగింది.
కొన్ని సంవత్సరాలకు, అకస్మాత్తుగా వాళ్లకు మళ్ళీ స్వామీజీ దర్శనమిచ్చాడు! రంగయ్య, రాజు ఆయనను సాదరంగా ఆహ్వానించి, కూర్చోబెట్టి, "స్వామీ , మీరు మంత్రించి ఇచ్చిన ఈ బట్టముక్కల ఫలితమే, ఇదంతా." అని నమస్కరించారు.
ఆ మాటలకు సాధువు పగలబడి నవ్వాడు. "మంత్రమా, మామిడి కాయా!? పనీ-పాటా లేని జనాలు- ఊరి వీధుల్లో నిలబడి, ఊరక వినే మీబోటి వాళ్లతో- నోటికొచ్చినవి అంటుంటారు. లోకులు కాకులు! అలాంటి కాకుల మాట వింటే ఏ పనీ జరగదు. మీరు వాళ్ల మాటలు వినకూడదనే, ఈ గుడ్డముక్కల్ని చింపి, మీకిచ్చి, చెవిలో పెట్టుకొమ్మన్నాను. ఆశ్చర్యమేమీలేదు, మీ స్వంత బుద్ధి పనిచేసింది, మీకు మేలు జరిగింది!" అన్నాడు సాధువు నవ్వుతూ.