ఒక ఇంట్లో రెండు టోపీలు ఉండేవి.
ఒక రోజున మొదటి టోపీ కళ్లజోడు పెట్టుకున్నది.
ఆ కళ్లజోడు చాలా అందంగా, కొత్తగా, ఆధునిక శైలికి తగినట్లు ఉంది- తళతళలాడుతూ. దాన్ని పెట్టుకున్న మొదటిటోపీ చాలా గర్వంగా మురిసిపోయింది.
అది చూసిన రెండో టోపీ కుంచించుకు పోయింది; తన వెనుకబాటుతనం గుర్తొచ్చి, సిగ్గుతో ముడుచుకు పోయింది.
రెండూ పోతున్నై, రోడ్డు వెంబడి.
అంతలో వాటిమీదికి ఓ లారీ వచ్చింది. రెండూ గందరగోళ పడ్డాయి. ప్రాణాలు అరచేత పట్టుకొని, చెరోవైపూ పరుగెత్తాయి.
మరుక్షణంలో లారీ చక్రాలు వాటిని రెండింటినీ చప్టా చేసేశాయి. కుడి చక్రం క్రింద మొదటిదీ, ఎడమ చక్రం క్రింద రెండోదీ పడ్డాయి. రెండూ అణగిపోయాయి, నేలమట్టమైపోయాయి.
మొదటిదాని కొత్త కళ్లజోడు ముక్కలు ముక్కలైపోయింది.
తర్వాత రెండూ లేచి, దుమ్ము దులుపుకొని, బయలుదేరాయి, కుంటుకుంటూ.
అప్పుడు రెండోది, మొదటిదాన్ని అడిగింది- " నాకేమో కళ్లజోడు లేదు; అందుకని నాకంటూ లారీ ఎలాగూ కనబడదు. కానీ, మరి నీకేమైంది? అంత చక్కని కళ్లజోడు పెట్టుకున్నావే? నువ్వు లారీని చూసుకోలేదెందుకు? అని.
అప్పుడు మొదటిది అన్నది- "అయ్యో! నేను మంచి కళ్లజోడును పెట్టుకున్న మాట వాస్తవమే. కానీ దాని వెనక కళ్లుంటేనే గద, నాకు మాత్రం కనబడేది!?" అని!
చూసేందుకు కళ్లజోడు ఉంటే సరిపోదు- వాటి వెనక కళ్ళుండాలి!