రెండవభాగం తరువాయి: ఆ తర్వాత హిరణ్యకుడు తన కలుగులోకి దూరింది. అంతవరకు అక్కడే కూర్చొని చూసిన లఘుపతనకం జరిగినదానికంతా ఆశ్చర్యపడి, హిరణ్యకుడి కలుగు దగ్గర వాలి ఇట్లా అన్నది: “ఓ, హిరణ్యకా! నువ్వు చాలా మెచ్చుకోదగినవాడివయ్యా! నేను నీతో స్నేహం చేద్దామని వచ్చాను. నాతో మైత్రి నెఱపి, నా కోరికను నెరవేర్చు" అని.
అప్పుడు హిరణ్యకుడు కలుగు నుండి బయటికి రాకుండానే, "ఎవరివి, నువ్వు?” అని అడిగింది, అనుమానంగా. జవాబుగా కాకి అన్నది "నేను కాకిని. నా పేరు లఘుపతనకం" అని. అనగానే హిరణ్యకుడు విని, “బాగుంది, బాగుంది! ఇక నీతోనా, స్నేహం చేయాల్సింది?ఏది ఎవ్వరితో చేయచ్చో చూసుకొని, తెలివిగలవాడు వాళ్లతో అది చేయాలి తప్ప, కానిపనులు చేయకూడదు. నేను తినబడేదాన్ని. నువ్వేమో తినేదానివి. మనిద్దరికీ ఇక స్నేహం ఎలా కుదురుతుందనుకున్నావు? నీతో స్నేహం నాకు ఆపదలు తెచ్చిపెడుతుంది. చాలాకాలం క్రితం జింక ఒకటి, ఒక నక్కను నమ్మి, దాని మోసకారి మాటలకు లొంగి, త్రాళ్లలో చిక్కుకొన్నది. దాని భాగ్యంకొద్దీ చివరికి అది ఒక కాకి చేత రక్షింపబడింది" అన్నది.
“నాకు ఆ సంగతి ఇంకొంచెం వివరంగా చెప్పు" అని లఘుపతనకం అడిగింది. అప్పుడు హిరణ్యకుడు తన బొరియలోంచే జింక - కాకి కథని ఇట్లా చెప్పసాగింది:
"మగధ దేశంలో మందారవతి అనే అడవి ఒకటి ఉండేది -
ఆ అడవిలో చాలానాళ్లుగా ఒక జింక, కాకి చాలా స్నేహంగా, కలసి మెలసి జీవిస్తుండేవి. చక్కని పచ్చికను మేస్తూ బాగా బలిసిన ఆ జింక ఇష్టం వచ్చినట్లు అడవిలో విహరిస్తుంటే చూసి, ఒక నక్క "ఆహా! ఈ జింక ఎంతగా బలిసి ఉన్నదో గదా! దీని మాంసం తినాలని నాకు కోరిక కల్గుతున్నది. ఆ మాంసం లభించే మార్గం ఏమిటో? సరే, దీనికి నాపై నమ్మకం కలిగేటట్లు చేస్తాను" అనుకుని, నేరుగా ఆ జింక దగ్గరకి పోయి "స్నేహితుడా! కులాసానా?” అన్నది.
“నువ్వెవరివి?” అని జింక అడగ్గానే, అది, "నేనొక నక్కను. నా పేరు సుబుద్ధి. నా బంధువులందరూ నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లారు. అప్పటినుండి నేను ఇక్కడ చచ్చినవాడితో సమానంగా బ్రతుకు ఈడుస్తున్నాను. ఇన్నాళ్లకు నువ్వు నాకు దేవుడి మాదిరి దర్శనం ఇచ్చావు. నిన్ను చూడగానే నా బంధువులందరూ తిరిగివచ్చినంత సంతోషం కలిగింది. “మంచివాళ్లని దర్శిస్తే అన్ని దోషాలూ పోతాయి, అన్ని శుభాలూ కల్గుతాయి" అని పెద్దలు చెబుతూంటారు. దానికి ఇదే నిదర్శనం. నీతో స్నేహం చేయాలని నాకు చాలా కోరికగా ఉన్నది. నా ఆశను నెరవేర్చు" అన్నది. అప్పుడు జింక ఆ మాటలు విని, దాన్ని నమ్మింది. “సరే, అలాగే కానియ్యి" అని, సాయంత్రం అవ్వగానే అది ఆ నక్కను వెంటబెట్టుకొని పోయి, తాను నివసించే చోటుకు చేరుకున్నది.
అక్కడ మందార చెట్టు మీద కూర్చున్న కాకి, తన స్నేహితుడైన జింకతోబాటు వచ్చిన నక్కను చూసి"ఇదెవ్వరు?” అని అడిగింది. “ఇది, `సుబుద్ధి' అని, చాలా మంచి నక్క. నాతో స్నేహం చెయ్యాలని వచ్చింది" అన్నది జింక.
ఆ మాటలు విని, కాకి "కొత్తగా వచ్చిన వాళ్లను నమ్మవచ్చా? ఇప్పుడు నువ్వు చేసిన పని మంచిది కాదు. జాతి - నీతి తెలుసుకోకుండా ఎవ్వరికైనా సరే, ఆశ్రయం ఇవ్వకూడదు. గతంలో 'జరద్గవం' అనే గ్రద్ద ఒకటి, ఒక పిల్లికి ఇట్లాగే ఆశ్రయం ఇచ్చి, అందుకుగాను, తన ప్రాణాలే పోగొట్టుకున్నది. ఆ కథను వివరంగా చెబుతాను విను -
"భాగీరధీ(గంగా) నది ఒడ్డున పెద్ద జువ్విచెట్టు ఒకటి ఉండేది. దాని తొర్రలో `జరద్గవం' అనే ముసలి గ్రద్ద ఒకటి నివసించేది. ముసలిదేకాక, అది గ్రుడ్డిది కూడాను. ఆ చెట్టుని ఆశ్రయించుకొని ఉండే పక్షులన్నీ తాము ఏపూటకాపూట తెచ్చుకునే ఆహారాన్ని కొంచెం కొంచెంగా దానికికూడా పెట్టేవి. అలా అది వాటిపై ఆధారపడి తన జీవనాన్ని కొనసాగించేది.
చెట్టుమీద ఉండే పక్షిపిల్లల్ని తినేందుకని,ఒక రోజున దీర్ఘకర్ణం అనే పిల్లి ఒకటి నిశ్శబ్దంగా వచ్చింది - ఆ చెట్టు దగ్గరికి. అయినా దాని రాకను చూసిన పక్షిపిల్లలు భయపడి, కీచుకీచుమని అరవటం మొదలుపెట్టాయి. ఆ కలకల శబ్దాన్ని విన్న జరద్గవానికి 'ఇతరులు ఎవ్వరో వస్తున్నార'ని అర్థమయింది. “ఎవరక్కడ?” అని అది భీకరంగా అరిచింది.
హఠాత్తుగా గద్దను చూసిన పిల్లి భయపడి - “అయ్యో! చచ్చానే! ఇంత దగ్గరికి వచ్చేశానే? వెనక్కి తిరిగి పారిపోయేందుకు వీలుగాకూడా లేదు. తప్పించుకొని పోయేందుకు వేరే దారి కనబడటం లేదే, ఏం చేయాలి?! కష్టం వచ్చి మీదపడింది. ఇప్పుడు వెనుకంజ వేయలేం. జరిగేదేదో జరగక మానదు. రోట్లో తల పెట్టి రోకలిపోట్లకు బాధపడేదెందుకు? ఇదీ మంచిదే, ఇప్పుడు నేను మంచితనాన్ని ప్రదర్శించి దీన్ని నమ్మిస్తాను" అనుకున్నది. అలా అనుకొని, అది గ్రద్దకు ఎదురుగా నిలబడి"అయ్యా, నమస్కారం" అన్నది. “ఎవరునువ్వు?” అని అడిగింది గ్రద్ద, గంభీరంగా.
"నేను పిల్లిని. నన్ను 'దీర్ఘకర్ణం' అంటారు" అని పిల్లి జవాబివ్వగానే గ్రద్ద, "వెంటనే దూరంగా పో - వెళ్లకపోయావంటే నీ ప్రాణాలు నిలువవు. చూడు, నాదెబ్బ!” అని కోపంగా అరిచింది. వెంటనే తెలివైన ఆ పిల్లి "అయ్యా! ముందు నా మాట వినండి. నేను చంపదగినదాన్నో, కానో విచారించండి. ఆపైన మీకు తోచినట్లు చేయండి. ప్రవర్తనలోని మంచిచెడులను చూసి వీడు పూజనీయుడు', 'వీడు చంపదగినవాడు' అని నిర్ణయించాలిగాని, కేవలం జాతినిచూసి నిర్ణయించటం సరికాదుకదా?” అన్నది.
అప్పుడు ఆ గ్రద్ద "నువ్వు వచ్చిన పని ఏమిటి?” అని అడిగింది. గండం తప్పిందని సంతోషించిన ఆ పిల్లి ఇలా జవాబిచ్చింది - “నేను ఇక్కడ గంగలో రోజూ స్నానం చేస్తూ, మాంసభోజనం విడిచి, బ్రహ్మచారినై, చాంద్రాయణవ్రతం చేస్తున్నాను." (-ఆ వ్రతంలో చంద్రుడి కళలను అనుసరించి భోజనం చేస్తారు: కృష్ణపక్షంలో రోజుకొక్క ముద్ద భోజనాన్ని తగ్గించి, అమావాస్యనాటికి పూర్తి ఉపవాసం ఉంటారు. ఆపైన శుక్లపక్షంలో మళ్లీ రోజుకొక్క ముద్ద చొప్పున భోజనాన్ని పెంచుతారు. )
"మీరు బహుమంచివాళ్లని, ధర్మం బాగా తెలిసిన వాళ్లని ఇక్కడి పక్షులు అప్పుడప్పుడు మెచ్చుకుంటూండగా విని, చాలా రోజులనుండి నేను మిమ్మల్ని దర్శించాలని కుతూహలపడుతూ ఉన్నాను. నా ఆ కోరిక ఇన్నాళ్లకు ఫలించింది. మీరు విద్యచేత, వయసుచేతకూడా పెద్దలు, గౌరవనీయులు. కాబట్టి మీనుండి నీతి-సదాచారాలకు సంబంధించిన ధర్మసూత్రాలను వినాలనికూడా నాకు కోరిక ఉండింది. అయితే ధర్మం తెలిసిన మీరే, ఇంటిని వెతుక్కుంటూ వచ్చినవారిని చంపనెంచారు. గృహస్థు పాటించవలసిన ధర్మమా, ఇది? ఇంటికి వచ్చిన శత్రువుకైనా ఆతిథ్యం ఇవ్వాలని చెబుతారే! ధనం లేనట్లైతే మంచిమాటలతోనైనా సత్కరించాలి. ఇంటికి వచ్చిన అథితి `ఉస్సురుమంటూ పోకూడదు. అలా పోవటం వల్ల గృహస్థుకు చాలా పాపం చుట్టుకుంటుంది.”
అది విని, గ్రద్ద "పిల్లులకు మాంసం అంటే చాలా ఇష్టం. ఇక్కడేమో పక్షి పిల్లలున్నాయి. అందుకనే, నేను అట్లా అన్నాను" అన్నది.
వెంటనే పిల్లి చేతులతో రెండు చెవులూ మూసుకొని, “ కృష్ణ! కృష్ణ! ఎంత పాపం చేసుకొని ఈ పిల్లి జన్మనెత్తానో? అది చాలక ఇంకా ఈ పాపం కూడా మూటగట్టుకోవాలా? ఎంతటి మాట వినాల్సి వచ్చింది! ధర్మ శాస్త్రాలు విని, కోరికలు లేనివాడినై, ఇప్పుడు చాంద్రాయణ వ్రతం చేస్తున్న నేను, ఇంతటి పాపం చేస్తానా? ఒకదానికొకటి వ్యతిరేకమైన ధర్మశాస్త్రాలుకూడా "అహింసా పరమోధర్మ:” అని ఒక్క గొంతుతో ఘోషిస్తున్నాయి. ఎలాంటి హింసనూ చేయక, అన్ని ప్రాణులపట్లా దయతో వ్యవహరించే వాడికి స్వర్గం చేతిలోనే ఉంటుంది. భూతదయ ఉన్నవాడే అన్ని ధర్మాలనూ పాటించినవాడు. అది లేనివాడు ధర్మకార్యాలు చేసినా, చేయనట్లే అవుతుంది. చివరికి పోయేనాడు తాను చేసిన ధర్మమే తనకు సహాయంగా వెంట వస్తుంది తప్ప, ఈ ప్రపంచంలో వేరేది ఏదీ వెంటరాదు. తెలీక చెడిపోయిన కాలాన్ని పోనివ్వు- తెలిసిన తర్వాత ఇంకా చెడతానా? అడవిలో తనంతట తాను మొలచిన ఏ ఆకుకూరలతోనైనా, కాయగూరలతోనైనా ఆకలి తీర్చుకొని, పొద్దు గడపవచ్చు- ఈ పాడు పొట్టకోసం ఇంత పాపం చెయ్యటానికి ఎవ్వడు పూనుకుంటాడు? అయ్యో! ఎంత మాట అన్నారు, మీరు?” అన్నది.
అప్పుడు గ్రద్ద దాని మాటలు నిజమనుకొని, “కోపం చేయకు. కొత్తగా ఎవరైనా రాగానే వాళ్ల స్వభావం ఎట్లాంటిదో ఎలా తెలుస్తుంది? నీ గురించి తెలియక నేనన్న మాటలకు నొచ్చుకోకు. గతంలో అన్న మాటల్ని పోనివ్వు. నువ్వు నీ ఇష్టం కొద్దీ రావచ్చు, పోవచ్చు, మా దగ్గర ఆగవచ్చు. నీకేమీ అడ్డంకి లేదు" అని చెప్పింది.
ఆ తర్వాత పిల్లి గుడ్డి గద్దకు చాలా దగ్గరైంది. కొన్నాళ్లకు అది ఆ గద్దతోబాటు దాని తొర్రలోనే నివసించటం కూడా మొదలుపెట్టింది.
ఇట్లా కొన్ని రోజులు గడచిన తర్వాత, ఆ దొంగ పిల్లి ప్రతిరోజూ అర్థరాత్రివేళ చప్పుడు చేయకుండా చెట్టెక్కి, పక్షిపిల్లల గొంతు కొరికి పట్టుకొని తెచ్చి, వాటిని ఆ తొర్రలో పెట్టుకుని తినటం మొదలు పెట్టింది. చెప్పాపెట్టకుండా మాయమౌతున్న పిల్లల్ని తలచుకొని అక్కడి పక్షులన్నీ చాలా దు:ఖపడి, అక్కడా ఇక్కడా వెదకటం మొదలుపెట్టాయి. ఆ సంగతి తెలుసుకున్న పిల్లికాస్తా తొర్రను వదిలి పారిపోయింది. కానీ పిల్లల్ని వెదుక్కుంటూ వచ్చిన పిట్టలకు, చెట్టు తొర్రలోనే తమ పిల్లల ఎముకలు కనబడ్డాయి.
“ఈ గ్రద్దే మన పిల్లలందర్నీ తినేసింది" అని నిశ్చయించుకుని, ఆ పిట్టలన్నీ గ్రద్దను తమ గోళ్లతో రక్కి, ముక్కులతో పొడిచి-పొడిచి చంపేశాయి! -అందుకనే, `కొత్తగా వచ్చిన వాడిని నమ్మకూడదు' అన్నాను,'" అన్నది కాకి - జింకతో. అప్పుడు నక్క కోపంగా ఇలా అన్నది-
(..తరువాయి వచ్చే మాసం)