ఒక ఊళ్ళో పనిచేసే పరంధాముడు పేరుకి పోలీసేగాని, నిజానికి పాపం, మరీ అమాయకుడు. అతని చిలిపి చేష్ఠలు ఊరంతటికీ హాస్యాన్ని పంచేవి. అయినా అతనివల్ల అందరికీ మేలు జరిగేది తప్ప, ఎవ్వరికీ అపాయం వాటిల్లేది కాదు.
ఆ ఊరిని ఆనుకొని ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలోకి, ఎటునుండి వచ్చిందో, ఒక పులి వచ్చి చేరింది. ఎదురొచ్చినవాళ్లనల్లా అది దొరకబుచ్చుకోవటం మొదలుపెట్టింది. దాంతో ప్రజలు ప్రభుత్వం వారిని ఆశ్రయించారు. ప్రభుత్వంవారు ఆ పులిని పట్టుకొనే బాధ్యతను గంగారాం - మంగారాం అనే ఇద్దరు ఫారెస్టు పోలీసులకు అప్పగించారు.
ఈ ఫారెస్టు పోలీసులకు పరంధాముడంటే గిట్టేది కాదు. అయినా ఆ ఊరి ఇన్స్పెక్టరుగారు వాళ్ళకు తోడుగా పరంధాముణ్నే ఇచ్చి పంపాడు. కాదనలేక అతన్ని వెంట రానిచ్చిన ఆ ఇద్దరు ఫారెస్టువాళ్ళూ, ఏదో ఒక లాగ పరంధాముడిని పులికి ఆహారంగా వెయ్యాలని నిశ్చయించుకుని, అడవిదారి పట్టారు.
వాళ్ళు అడవిలో జాగ్రత్తగా నడుస్తూ పోతుంటే సరిగ్గా ఎదురుగుండా కనబడింది పులి. అది రోడ్డును ఆనుకొనే పడుకొని నిద్ర పోతున్నది. దాన్ని చూసిన గంగారాం - మంగారాం ఇద్దరూ కుమ్మక్కై, దాని మీదకు ఓ బండ రాయిని విసిరి, తాము గబుక్కున వెనక్కి తిరిగి ఓపొదలో దూరారు.
హఠాత్తుగా నిద్రలేచిన పులికి ఎదురుగా వస్తూ కనబడ్డాడు, పోలీసు పరంధాముడు! అది గబుక్కున లేచి, గాండ్రిస్తూ పరంధాముడి వెంట పడింది. దిక్కుతోచని పరంధాముడు అరుస్తూ, తన కాళ్ళు తీసుకెళ్ళిన వైపుకు పరుగెత్తటం మొదలెట్టాడు. పులి వదలకుండా అతన్ని వెంబడించింది.
ప్రాణం మీద తీపితో పరంధాముడు తనకు అడ్డు వచ్చిన ఓ ముళ్ళ చెట్టును పట్టుకొని పైకి ఎగ బ్రాకాడు. పులి తనుకూడా ఎక్కేందుకని ఆ చెట్టు కాండాన్ని పట్టుకొని గీరటం మొదలెట్టింది. అంతలో ఓ చిత్రం జరిగింది! పరంధాముడు పెట్టుకున్న టోపీ జారి సూటిగా క్రింద నిల్చున్న పులి తలమీద పడింది. ఆ పడటం, అది పోయి, దాని కళ్ళను కప్పేసింది! కళ్ళు కనబడని పులి గాభరా పడి, టోపీ బారినుండి తప్పించుకోవటం కోసం పరుగు లంకించుకున్నది. ఐతే దాని చెవుల్లోఇరుక్కున్న ఆ టోపీ దాన్ని వదలకుండా వెంటబడింది! టోపీని వదిలించుకోవటంకోసం ఆ పులి పోయి, ఓ దట్టమైన పొదలోకి దూరింది.
ఈలోగా పొదలోంచి బయటికి వచ్చిన గంగారాం - మంగారాంలు చుట్టూ చూస్తే, వాళ్ళకు దగ్గరగా పొదల్లో టోపీ ఒకటి కదులుతూ కనబడ్డది. తాము 'పులికి ఆహారంగా వేసినా ఈ పరంధాముడు చావలేదే!' అని వాళ్లకు చాలా కోపంవచ్చింది. వెంటనే ఇద్దరూ కనుసైగలు చేసుకొని, మెల్లగా పోయి, తమ చేతిలోని దుడ్డుకర్రలతో ఆ టోపీశాల్తీని బడబడా బాదేశారు. ఆ దెబ్బకు టోపీలో ఇరుక్కున్న పులి ఠపీలుమని చచ్చింది!
అయితే దీన్ని గమనించని గంగారాం - మంగారాంలు ఊర్లోకి పోయి, పులి పరంధాముడిని తినేసిందని నమ్మబలికారు. పరంధాముడంటే ప్రేమగల ఊరిజనాలు వారిని వెంటబెట్టుకొని, మళ్ళీ ఆ తావుకు చేరుకున్నారు. అయితే ఆలోగా చెట్టుదిగిన పరంధాముడు వెనక్కి వస్తూ, టోపీ పెట్టుకున్న పులిని చూసి, వంగి తనటోపీని తాను తీసుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి చేరుకున్న ఊరి జనాలు 'పులిని చంపిన పరంధాముడికీ జై!' అని నినాదాలు చేశారు.
అంతేగాక, పరంధాముడిని పులికి పట్టించిన గంగారాం - మంగారాంలకు చక్కగా నాలుగు అంటించారు కూడాను!