దక్షిణ దేశంలో ప్రచారంలో ఉన్న రామాయణ గాధ ఇది.
లక్ష్మణుడు యుద్ధంలో గాయపడి, మూర్చపోయి పడి ఉన్నాడు. వానర సైన్యంలోనే ఉన్న 'సుషేణుడు' అనే వైద్యుడు ఆయన్ని పరిశీలించాడు. “లక్ష్మణుడు స్పృహలోకి రావాలంటే, సూర్యోదయం లోగా 'సంజీవని' అనే ఔషధిని తేవాలి" అన్నాడు.
కానీ సంజీవని అన్ని చోట్లా పెరగదు. కేవలం హిమాలయాల్లోనే దొరుకుతుంది. అంత దూరం నుండి లంకకు ఆ మూలికను తేవాలి. -అదీ సూర్యోదయంలోగా! అసంభవమైన ఈ పనిని ఇంకెవరు చేయగలరు, పవన పుత్రుడు హనుమంతుడు తప్ప?!
హనుమంతుడు బయలుదేరి వెళ్లాడు. చాలా వేగంగా ఎగురుతూ కైలాస పర్వతం చేరుకున్నాడు. అక్కడ కనబడింది- సంజీవనీ పర్వతం. ఆ కొండ నిండుగా దట్టమైన అడవి ఉంది. లెక్కలేనన్ని మొక్కలు, మూలికలు ఉన్నాయి. “వీటిలో ఏది, సంజీవని?” హనుమంతుడికి అర్థం కాలేదు. ఆ మొక్కను ముందుగా ఏనాడూ చూసి ఉండలేదు, మరి! కానీ సమయం తక్కువ ఉన్నది. నాలుగే గంటల్లో లంకను చేరుకోవలసి ఉన్నది. క్షణక్షణం ఎంతో విలువైనది. “ఏం చేయాలి?”
మహా బలశాలి అయిన హనుమంతుడు ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు- “ కొండను మొత్తాన్నీ ఎత్తుకెళ్తాను" అని. ఆ కొండ మొత్తం ఒక అద్భుతమైన తోట. లక్షలాది ఓషధులు విరాజిల్లు తున్నై, ఆ వనంలో. దానిని ఎత్తుకొని, హనుమంతుడు సూర్యోదయంలోగా లంకకు చేరుకున్నాడు. సంజీవని ప్రభావంతో లక్ష్మణుడు కళ్లు తెరిచాడు.
కొండనెందుకు తెచ్చావని అడిగితే హనుమంతుడు " మందు మొక్కను గుర్తుపట్ట లేకపోయాన"న్నాడు నిజాయితీగా. అందరూ నవ్వారు.
కథ ముగియలేదు.
లక్షలాది మొక్కల సమాహారం, ఆ అద్భుత వనం. ఆ కొండను ఏం చేయాలి? చాలా భక్తి శ్రద్దలతో, ఎంతో ఆర్భాటంగా, ఆ పవిత్ర వనాన్ని, మహత్తరమైన మూలికలతో సహా, లంకలోనే ప్రతిష్ఠించి, దానికి 'దేవారణ్యం' అని పేరు పెట్టారు. ఆ వనంలోని ఒక్కొక్క ఆకూ పవిత్రమైనదే. ఆ వనం ఏ ఒక్కరి సొంత ఆస్తీ కాదు; అది అందరిదీ! మొక్కల సంరక్షణకు, వాటి వారసత్వ సంపదల పరిరక్షణకూ ఆ ప్రదేశం పూర్తిగా అంకితం చేయబడింది. ఆ వనంలో ఒక గుడి నిర్మితం అయింది. దాన్ని నడిపేందుకొక వ్యవస్థ ఏర్పడింది.
లంకలో వనాన్ని ఉదాహరణగా తీసుకొని, భరత ఖండంలోని పల్లె పల్లెలోనూ అలాంటి పవిత్ర వనాలు నెలకొల్పబడ్డాయి. హనుమంతుడు మొదలు-పెట్టిన సంప్రదాయాన్ని అందరూ కొనసాగించారు. అలా మొదలైన ఆ పవిత్ర వనాల సంస్కృతి ఈ శతాబ్దపు ఆరంభం వరకూ వర్దిల్లింది. పారిశ్రామిక సంస్కృతి నేపధ్యంలో అటువంటి పవిత్రవనాలెన్నో మన నిర్లక్ష్యానికి గురై నశించాయి. అవి నిలచిన పవిత్ర భూమి కబ్జాదారుల చేతుల్లో పడిపోయింది.
అయినా అలాంటి అద్భుత వనాలు కొన్ని ఈనాటికీ పవిత్రంగా అలానే మిగిలి ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో పెరుంబవూర్ దగ్గర అట్లాంటి వనం ఒకటి ఇంకా నిలిచి ఉన్నదని చెబుతారు. హనుమంతుడు పుట్టింది అక్కడేనట!