విజయేంద్రవర్మ అనే రాజుకు ఇద్దరు కుమారులు ఉండేవారు. పెద్దవాడి పేరు జయుడు, చిన్నవాడి పేరు విజయుడు.
విజయేంద్రవర్మకు వయసు మీదపడినకొద్దీ 'తన తరువాత రాజ్యాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలా' అని దిగులు పట్టుకున్నది. ఇద్దరూ సమర్థులే, మరి! చివరికి ఆయన ఒకనాడు ఇద్దరు కొడుకులనూ పిలిచి, దేశాటనకు వెళ్లి కొత్త కొత్త విషయాలను నేర్చుకు రమ్మన్నాడు.
సరేనన్న రాజ కుమారులు ఇద్దరూ రెండు దిక్కులకు బయలుదేరి వెళ్లారు.
తూర్పు వైపుకు వెళ్ళిన జయుడు ఆ రాత్రికి ఒక గ్రామంలో బసచేశాడు. విశ్రాంతి తీసుకుంటూ, "నేనే రాజునవుతాను. దానికోసం ఏమైనా మంత్రశక్తిని సంపాదిస్తాను. ఆ విద్యతో తండ్రిగారిని మెప్పిస్తాను." అనుకున్నాడు. తెల్లవారిన తరువాత విచారించగా, అక్కడికి దగ్గర్లోనే మహిమాన్వితుడైన ఋషి ఒకాయన నివసిస్తుంటాడని తెలిసింది. జయుడు వెళ్ళి ఋషికి మర్యాదగా నమస్కరించి, తనెవరో ఋషికి వివరించాడు. 'చనిపోయిన జీవులకు ప్రాణం పోసే విద్యను నేర్పమ'ని ఆయన్ను ప్రార్ధించాడు.
అందుకు ఆ ఋషి , "అలాంటి విద్యలు అందరికీ పనికిరావు. వేరే విద్యలు ఏమైనా నేర్చుకుందువులే" అన్నాడు.
కానీ జయుడు తనకు ఆ విద్యే కావాలని బ్రతిమాలాడు. ప్రేమాన్వితుడైన ఋషి కాదనలేక, జయుడికి ఆ విద్యను నేర్పనారంభించాడు.
ఇక పడమర దిక్కుకు వెళ్ళిన విజయుడు కూడా ఒక అడవిని చేరుకున్నాడు. ఆ అడవిలో చిన్న చిన్న గ్రామాలు చాలా ఉన్నాయి. అక్కడి గ్రామస్థులందరూ, ప్రపంచం మునిగిపోతున్నట్లు బాధపడుతూ కనబడ్డారు.
"సంగతేమిట"ని అడిగిన విజయుడితో ఒక అవ్వ అన్నది: "బాబూ! ఈ అడవిలో అనేక రకాల కౄరమృగాలు, పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అవి ఎప్పుడు పడితే అప్పుడు మా గ్రామాలమీద పడి, పశువులనూ, మనుషులనూ కూడా తినేస్తున్నాయి. ఈ సంగతిని అనేకసార్లు రాజుగారితో మనవి చేసుకున్నాం. కానీ రాజుగారు మా కష్టాన్ని అస్సలు పట్టించుకోలేదు" అని చెప్పింది.
అవ్వ మాటలు విన్న విజయుడికి అది రాజగౌరవానికే మచ్చ అనిపించింది. 'ప్రజలకు రక్షణ కల్పించటం రాజు బాధ్యత. అది నెరవేర్చకపోతే తాను రాజయ్యీ ఏమి లాభం?' అనుకొని, విజయుడు అక్కడే నిలచిపోయాడు. గ్రామవాసుల కష్టాలను తీర్చటంకోసం గ్రామ రక్షక దళాలను తయారు చేశాడు. యువకులకు యుద్ధవిద్యల్లో శిక్షణనిచ్చాడు. తానూ అక్కడే ఉండి, గ్రామాలలోకి వచ్చిన కౄరజంతువులను ఆ యువకుల సాయంతో చంపేశాడు. అలా గ్రామీణ సమాజం గురించీ, సంస్థా నిర్మాణం గురించీ, యుద్ధవిద్యలను గురించీ విజయుడు అనేక విషయాలు తెలుసుకున్నాడు.
అంతలోనే దేశాటనకు తండ్రిగారు ఇచ్చిన కాలం అయిపోవటంతో అన్నదమ్ములిద్దరూ రాజధానికి చేరుకున్నారు.
సభలో రాజుగారు "దేశాటనలో మీరు చూసినవీ, చేసినవీ, నేర్చుకున్నవీ ఏమిటో చెప్ప"మని అడిగారు జయవిజయుల్ని.
తను నేర్చుకున్న విద్యను ప్రదర్శించాలని అప్పటికే ఎంతో ఆత్రంగానూ, ఆరాటంగానూ ఉన్న జయుడు, తనతోబాటు తెచ్చుకున్న ఒక సింహం మృతదేహాన్ని సభలోకి రప్పించాడు. ముందుగా దాన్ని అందరికీ ప్రదర్శించి, దానితో ఏం చేయబోతున్నాడో ఎవరైనా ఊహించేలోపు, క్షణాలలో దానికి ప్రాణం వచ్చేట్లు చేశాడు.
జీవం పోసుకున్న ఆ సింహం పెద్దగా గర్జిస్తూ తన ఎదుటే నిలబడ్డ జయుడి మీదికి ఉరికింది. సభ మొత్తం భయంతో ఒక్కసారిగా వణికిపోయింది. సభికులు గందరగోళంగా ఎక్కడివారక్కడ ద్వారాలవైపుకు పరుగులు తీశారు.
సింహానికి ప్రాణం పోసేటప్పుడు, జయుడు ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. అందువల్ల సింహం మీదికి దూకగానే, చేత ఆయుధంలేక, అతడు ఆత్మ రక్షణ మాట మరచి, సామాన్యుడికి మల్లే ముడుచుకుని కూర్చుండిపోయాడు. అదే క్షణంలో విజయుడు ఒక్క ఉదుటున ముందుకు దూకి, తన కరవాలంతో ఆ సింహాన్ని తిరిగి యమపురికి పంపేశాడు.
సభికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ విజయుడి ధైర్యాన్నీ, నేర్పునూ కొనియాడారు. జయుడు కూడా తమ్ముణ్ని అభినందించాడు. ఆ తరువాత విజయుడు, దేశాటనలో తాను చేసిన పనులను వివరించగానే, సభలోని వారంతా అతన్ని మెచ్చుకుంటూ హర్షధ్వానాలు చేశారు.
ధైర్య సాహసాలతోబాటు నిబద్ధత, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న విజయుడినే రాజ్యలక్ష్మి వరించింది. జయుడు తమ్మునికి తోడునీడగా వ్యవహరించాడు. విజయుని పాలనలో ప్రజల కష్టాలు అన్నీ తీరి, సంతోషం వెల్లివిరిసింది.