ఒక గ్రామంలో కిరాణాషాపు నడిపే శెట్టిగారు ఒకాయన, ఒకరోజున పక్కనే ఉన్న పట్టణానికి నడిచిపోతున్నాడు. మధ్యదారిలో ఆయనను ఒక రైతు కలిశాడు. రైతు కూడా పట్టణానికే వెళుతున్నాడు. అక్కడో వడ్డీ వ్యాపారికి తన ముత్తాత తీసుకున్న అప్పు తాలూకు వడ్డీని కట్టిరావటం కోసం అతను పట్నం పోతున్నాడు.
ఆ అప్పును రైతు ముత్తాత, తన ముత్తాత దహన సంస్కారాల నిమిత్తం తీసుకొని ఉన్నాడు. వంద రూపాయల ఆ సొమ్ము, ఈ అర్థ శతాబ్దపు చక్రవడ్డీతో వెయ్యి రూపాయల మొత్తమైంది. ప్రస్తుతం 'తన భూములన్నీ ఆ వ్యాపారి పాలబడకుండా కాపాడుకోవటం ఎలాగ?' అని ఆ రైతు సతమతం అవుతున్నాడు.
ఆ సమయంలో శెట్టిగారు అతన్ని సాదరంగా పలకరించాడు నడుస్తూనే - "ఏమయ్యా, చౌదరీ, నువ్వు పట్నంలో మహాజన్ కు వడ్డీ కట్టేందుకు పోతున్నట్లుందే? నీ భూముల్ని దక్కించుకునే మార్గమే లేదంటావా?" అంటూ.
ఆ పేద రైతు అన్నాడు- "అయ్యో శెట్టిగారూ! ఏం చెప్పాలి? నాదంతా ఓ విషాద గాధ. మీకు తెలిసిందే కదా? మా ముత్తాత వంద రూపాయలు అప్పు తీసుకొంటే అదిప్పుడు ఏనుగంత అయ్యింది. నాకున్న కొద్దిపాటి భూమీ అంత సొమ్మునెలా ఇస్తుంది?"
"మరీ ఎక్కువగా ఆలోచించి మనసు పాడుచేసుకోకు. నీ నొసటన ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. అందుకని, మనం ఆ సంగతులు మరిచిపోయి, కథలు చెప్పుకుని సంతోషిద్దాం. అలా మన ప్రయాణమూ రంజుగా సాగుతుంది. ఏమంటావు?" అన్నాడు శెట్టి.
"అవునయ్యా! మీరు చెప్పింది బాగుంది. నుదుటి రాతల్ని తలుచుకొని ఏడుస్తూ మొత్తుకుంటుంటే ఏమీ ప్రయోజనం ఉండదు. అందుకని మనం కథలే చెప్పుకుందాం - అయితే ఒక్క షరతు: కథ ఎంత అవాస్తవంగా, ఎంత అసంబద్దంగా అనిపించినా సరే, మనలో ఏ ఒక్కరూ దానిని 'అబధ్ధం' అనకూడదు. మనలో ఎవరైనా ఇంకోళ్ల కథను అబద్ధం అంటే, దానికి జరిమానాగా వెయ్యి రూపాయలు అవతలి వాళ్లకు ఇచ్చుకోవాలి" అన్నాడు చౌదరి.
"సరే" ఒప్పుకున్నాడు శెట్టి. "ముందుగా నేనో కథ చెబుతాను - నీకు తెలుసుగా, మా ముత్తాత మా కులంలోనే అందరిలోకీ గొప్పవాడు; అత్యంత ధనవంతుడున్నూ."
"అవును శెట్టిగారూ! అవును, నిజం!" అన్నాడు చౌదరి.
"మా ఈ ముత్తాత ఒకసారి నలభై ఓడలనిండా రత్నాలు వేసుకొని చైనాకు వెళ్లి, అక్కడ రత్నాల వ్యాపారం చేశాడు." అన్నాడు శెట్టి.
"నిజం. నిజం" తలూపాడు చౌదరి.
"ఆయన అక్కడ కొన్నాళ్లు నివాసం ఉండి, చాలా సంపద గడించాడు. చివరికి మన దేశానికి తిరిగివస్తూ అక్కడి వింత వస్తువులను చాలావాటిని తన వెంట తెచ్చాడు. వాటిలో ఒకటి, మాట్లాడే బంగారు ప్రతిమ. దాన్ని ఎంత తెలివిగా తయారుచేశారంటే, ఎలాంటి ప్రశ్నలడిగినా అది సమాధానం చెప్పగలదు.
"నిజమే" ఒప్పుకున్నాడు చౌదరి.
ఆయన మన దేశానికి తిరిగి వచ్చాక, చాలామంది వచ్చి , ఆ బంగరు ప్రతిమను ప్రశ్నలడిగి, తమ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో తెలుసుకున్నారు. అది ఇచ్చే సమాధానాలు అందరికీ ఆశ్చర్యాన్నీ, తృప్తినీ కలిగించాయి. ఆ సమయంలో ఒకసారి, మీ ముత్తాత మా పూర్వీకుని దగ్గరకు వచ్చాడు- మాట్లాడే ప్రతిమని కొన్ని ప్రశ్నలు అడుగుదామని. ఆయన అడిగాడు - "అందరిలోకీ తెలివైన వాళ్లు ఏ కులం వాళ్లు?" అని. దానికి ఆ ప్రతిమ సమాధానం ఇచ్చింది - "కోమట్లు" అని. ఆ తర్వాత ఆయన అడిగాడు- "అందరిలోకీ మూర్ఖులు ఏ కులం వాళ్లు?" అని. అప్పుడా ప్రతిమ "చౌదరీలు" అని సమాధానం ఇచ్చింది. మీ ముత్తాత చివరికి అడిగిన ప్రశ్న ఏంటంటే - "మా వంశంలోకెల్లా అతి గొప్ప మందమతి ఎవరౌతారు" అని. "లాహిర్ సింగ్ చౌదరి" అని జవాబిచ్చిందా ప్రతిమ. అస్సలు తడుముకోకుండా!" నవ్వుతూ ఆపాడు శెట్టి - ఎందుకంటే ఇప్పుడతని ఎదురుగా ఉన్న చౌదరి పేరే- లాహిర్ సింగ్, మరి!
ఆ కుళ్లు హాస్యం చౌదరి మనసుకు శూలం లాగా గుచ్చుకున్నది. అయినా అతను అమాయకపు ముఖాన్ని పెట్టుకుని "బాగుంది. బాగుంది. నిజం! నిజం!!" అన్నాడు. అయితే అదే క్షణంలో, ఈ శెట్టికి చిరకాలం గుర్తుండే జవాబుని, అతని బాషలోనే ఇవ్వాలని మనసులోనే నిశ్చయించుకున్నాడు చౌదరి.
"సరే, అప్పుడేమైందంటే.."కొనసాగించాడు శెట్టి." ఆ బంగరు ప్రతిమ పేరు ప్రఖ్యాతులు దేశమంతటా వ్యాపించి, చివరికి రాజుగారి చెవిన పడ్డాయి. రాజుగారు మా ముత్తాతను సభకు పిలిపించుకొని, ఆ ప్రతిమను అడిగి తీసుకున్నారు. బదులుగా మా ముత్తాతనే తన ప్రధానమంత్రిగా నియమించుకున్నారు."
"నిజమేనండీ. అక్షరాలా నిజం!" ఒప్పుకున్నాడు చౌదరి.
"ఆ తర్వాత చాలా సంవత్సరాలకు, రాజుగారికి అత్యంత సన్నిహితుడిగా మా ముత్తాత పదవీ విరమణ చేసినప్పుడు, ఆయన స్థానంలో మా తాత ప్రధాన మంత్రి అయ్యాడు. అయితే మా తాత విలాసంగా బ్రతికి, తన బాధ్యతల్ని కొంచెం సరిగ్గా నిర్వహించలేదు. దాంతో రాజుగారికి కోపం వచ్చి, ఆయన్ని ఏనుగులతో తొక్కించమని ఆజ్నాపించారు. మా తాతను కట్టేసి, ఒక మదపుటేనుగు ముందు పడేశారు. కానీ ఏమైందో తెలుసా? అది మా తాతను చూడగానే శాంతించి, ఆయన ముందు సాగిలపడి మొక్కింది! ఆపైన ఆయన్ని మెల్లగా తొండంతో ఎత్తి, మూపు మీద కూర్చోబెట్టుకుని ఊరేగించింది!"
"నిజం శెట్టిగారూ. నిజం!" అన్నాడు రైతు
"రాజుగారు అత్యాశ్చర్యకరమైన ఈ సంఘటనను చూసి ఎంతగా చలించిపోయారంటే, ఆయన మా తాతను తిరిగి ప్రధాన మంత్రిగా చేసుకొని, ఆర్భాటంగా ఉత్సవాలు నిర్వహించి, జీవితాంతమూ ఆయన శిష్యుడిలా మెలిగారు. ఆయన చనిపోయిన తర్వాత మా నాన్నగారు ప్రధానమంత్రి అయ్యారు - కానీ ఆయనకు ఆ పని నచ్చక, దాన్ని వదిలిపెట్టి, విదేశాలకు వెళ్లారు. ఆయన తన యాత్రలో ఒంటికాలు మనుషులు చెట్లనుండి తలక్రిందులుగా వేలాడుతూ బ్రతకటం, ఒంటి కన్ను రాకాసులు తిరగటం, ఆకుపచ్చ కోతులు ఎగురుతుండటం లాంటి అద్భుతాలను అనేకం చూశారు."
"ఒకసారి మా నాన్న చెవిదగ్గర ఒక దోమ 'గుయ్(' అని తిరుగుతూ ఉండిందట. ఆయనకు ఏం చేయాలో పాలుపోలేదు - నీకు తెలుసుగదా, మేం కోమట్లం - ఏ ప్రాణినీ చంపటానికి లేదు-"
"అవును శెట్టిగారూ, నిజం చెబుతున్నారు."
"ఇక అప్పుడు, మా తండ్రిగారు ఏం చేశారనుకుంటున్నావు? మోకాళ్ల మీద నిలబడి ఆ దోమను ప్రార్థించారు, దయచూపమని. అప్పుడా దోమ చాలా సంతోషపడి, ఇలా అన్నది: "అత్యంత శ్రేష్టుడైన ఓ శెట్టీ!, ఈనాటి వరకూ నీ అంత ఉత్తముడు నాకు కనిపించలేదు. నీ కోసం ఏదైనా చేయాలని నా మనస్సు తహతహలాడుతున్నది." ఇలా అని, ఆ దోమ తన నోటిని తెరిచింది. ఆ నోటిలో , మెరిసే బంగారంతో చేసిన పే...ద్ద రాజభవనం ఒకటి మా తండ్రిగారికి దర్శనమిచ్చింది. ఆ భవనానికి అనేకానేక కిటికీలు, తలుపులు, ద్వారాలు ఉన్నాయి. వాటిలోని ఒక కిటికీలో నిలబడి, అత్యంత సుందరమైన యువతి ఒకామె కనిపించింది. అయితే రైతులా కనిపిస్తున్న దుర్మార్గుడొకడు (ఆమె వెనకనుండి) ఆమెపైకి దాడిచేస్తున్నాడు. అప్పటికే వీరుడుగా పేరుగన్న మా నాన్నగారు ఒక్కసారిగా ముందుకు దూకి, దోమనోటిలోకి దూరాడు. అక్కడి నుండి దోమ కడుపులోకి పరుగెత్తేసరికి అంతా చీకటిగా ఉంది. దారి కనబడటం లేదు".
"నిజం. చక్కగా చెప్పారు!" మెచ్చుకున్నాడు చౌదరి.
"కొద్దిసేపటి తరువాత, చీకటి అంతా కరిగిపోయింది. ఇక ఆ వెలుతురులో మా నాన్నగారికి ఆ రాజ భవనం, ఆ రాకుమారి, ఆ దుర్మార్గపు రైతూ అందరూ మళ్లీ కనబడ్డారు. వీర యోధుడైన మా తండ్రిగారు కత్తి చేత బూని ఆ దుర్మార్గుని వైపుకు దూకారు. తీరా చూస్తే ఆ దుర్మార్గుడు ఎవరనుకుంటున్నావు? మీ నాన్నే!! అలా వాళ్లిద్దరూ దోమ కడుపులో సంవత్సర కాలం పోరాటం చేశారు. చివరికి మీ నాన్న ఓడిపోయి, మా తండ్రిగారి కాళ్ల మీద పడి శరణు వేడాడు. దయాశీలి గనక, మా నాన్నగారు వాడిపై దయతలచి, క్షమించి వదిలిపెట్టారు. ఆ తర్వాత ఆయన రాకుమార్తెను పెండ్లాడి ఆ రాజ భవనంలోనే నివసించారు. నేను అక్కడే పుట్టాను. ఆనాటి నుండీ మీ నాన్నగారు మా తండ్రిగారి సేవకుడిగా, ద్వార పాలకుడిగా ఆయన సన్నిధిలోనే ఉన్నాడు."
"నాకు పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా రాజ భవనం మీద, ఎలా కురిసిందో ఏమో, మరిగే నీళ్ల వర్షం పడింది. ఆ వేడికి మా భవనం పూర్తిగా కరిగిపోయి, మేమంతా కాలే-కాలే సముద్రంలోకి విసిరేయబడ్డాము. చాలా కష్టాలు అనుభవించిన తరువాత, నేను, మా నాన్నగారు, రాకుమార్తె, మీ నాన్న - నలుగురమే ఒడ్డుకు చేరుకున్నాం. తీరా ఒడ్డుకు చేరి, పైకెక్కి చూస్తే ఏముందనుకున్నావు? వంటగది! అక్కడున్న వంట మనిషి మమ్మల్ని చూసి వణికిపోయింది!
మేమందరం మనుషులమేననీ, దయ్యాలంకామనీ ఆమెని ఒప్పించేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఆమె అన్నది - "మీరంతా మంచివాళ్లే, కానీ నా చారే కదా, పాడైంది? నేను చేపల్ని ఉడకబెడుతున్న నీళ్లలోకి వచ్చిపడాల్సిన అవసరం ఏం వొచ్చిపడింది, మీకు?" అని.
మేం ఆమెకు క్షమాపణలు చెప్పుకుని, అన్నాం - "మాకు అసలు మేం ఆ కుండలోకి ఎలా వచ్చిందీ అర్థం కాలేదు. గత పదిహేనేళ్లుగా మేం ఒక దోమ కడుపులోని రాజ భవనంలో నివసిస్తున్నాం" అని.
"ఓహో, గుర్తుకొచ్చింది" అన్నదామె - "ఓ పదిహేను నిమిషాల క్రితం కావచ్చు, నేనో దోమను చూశాను - అది నా చేతిమీద కుట్టింది. ఇదిగో, అది కుట్టిన చోట ఎర్రగా దద్దు ఏర్పడింది-చూడండి! నాకు చాలా నొప్పి పుట్టింది కూడా. బహుశ: ఆ దోమే మిమ్మల్ని నా చేతిలోకి గుచ్చి ఉండవచ్చు. నేను ఆ దద్దురును గట్టిగా ఒత్తితే, ఆవగింజంత రక్తపు బొట్టు నల్లగా రాలి, మరుగుతున్న ఈ నీళ్లల్లో పడింది. మీరు ఆ బొట్టులో ఉంటారని నేను ఊహించనైనా లేదు" అన్నది. ఆ క్షణంలో నాకు అర్థమైపోయింది, నేను పదహైదు సంవత్సరాల అబ్బాయిలాగా కనబడుతున్నా, అలాగే ప్రవర్తిస్తున్నానుకూడానూ, నిజానికి నా వయసు పదహైదు నిముషాలేనని. ఆ కొద్ది సమయంలోనే నేను పుట్టాను, పెరిగాను; మా తండ్రిగారూ, మీ నాన్నా ఇద్దరూ పదహైదు సంవత్సరాల ముసలివాళ్లయ్యారు. నేను ఇప్పుడు పెద్దవాడిలాగా కనబడుతున్నాను, కానీ నిజానికి నా వయసు ఇంకా పది సంవత్సరాలే. నేను వేడిగా మసిలే ఆ దోమ గర్భంలో పదహైదు నిముషాల్లోనే చాలా ఎదిగాను కదా! దాని ప్రభావమన్నమాట, ఇదంతా!"
"అవును సేఠ్జీ, నిజం!" అన్నాడు చౌదరి.
"మేం బయట పడేసరికి, పూర్తిగా వేరే దేశంలో ఉన్నాం. నిజానికి అది ఈ గ్రామమే. మా తండ్రిగారు, ఒకప్పుడు ప్రధాన మంత్రిగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు వ్యాపారం మొదలుపెట్టారు. ఆయన తర్వాత నేనూ దాన్ని కొనసాగిస్తున్నాను. యువరాణి - మా తల్లిగారు - ఈ మధ్యే గతించారు. అదీ నా కథ!" అని ముగించారు శెట్టిగారు.
"అద్భుతంగా ఉంది శెట్టిగారూ. చాలా వాస్తవంగా ఉంది" మెచ్చుకున్నాడు చౌదరి. "ఇప్పుడు నేను చెప్పే కథను వినండి. ఇది మీ కథంత అద్భుతమైనదేమీ కాదు; కానీ ఇదీ వాస్తవమైన కథే: మా ముత్తాతగారు ఊరంతటికీ ధనికుడైన చౌదరి. ఆయన అందంలోనూ, మానమర్యాదల్లోనూ, తెలివితేటల్లోనూ ప్రత్యేకంగా ఉండేవారు. అందరూ ఆయన్ని మెచ్చుకునేవారు. గ్రామపెద్దగా ఆయన పేదసాదల్ని కాపాడేవారు. గ్రామ సభల్లో ఎప్పుడూ పేదల పక్షం వహించేవాడు. ఏమీ లేనివారికి తన ఎద్దుల్ని ఇచ్చి వ్యవసాయం చేయించేవాడు. ఇతరుల పంటల్ని కోయటంలో సాయం చేసేందుకుగాను మనుషుల్ని పంపించేవాడు. అంతేకాదు, ఆయన ధాన్యాగారంలోని ధాన్యం, పాల కేంద్రంలోని పాలు ఎవరైనా వాడుకోవచ్చు. చుట్టుపక్కల గ్రామాల్లో అనేక తగాదాలను ఆయనే తీర్చేవాడు. చక్రవర్తుల, రాజుల శాసనాలకంటే, ఆయన తీర్పుల్నే ప్రజలు అధికంగా విశ్వసించేవాళ్లు. అంతేకాదు, ఆయన దుష్టులకు సింహస్వప్నంగాను, భీమసేనుడికంటే బలంగానూ ఉండేవాడు.
"నిజం, చౌదరీ, వాస్తవం!" అన్నారు శెట్టిగారు.
"సరే, అయితే, ఒకసారి మన గ్రామంలో చాలా పెద్ద కరువు ఏర్పడింది. వానల్లేవు. బావులు, నదులు, చెరువులు అన్నీ ఎండిపోయాయి. మహా వృక్షాలుకూడా వలవలా మాడిపోయాయి. పశువులకు మేతలేక కృశిస్తున్నాయి. పక్షులు, జంతువులు అన్నీ ఎక్కడికక్కడ చచ్చిపోతున్నాయి. అప్పుడు మా ముత్తాత గ్రామంలోని చౌదరీలందరినీ పిలిచి, 'సోదరులారా, మన నిలువలన్నీ అయిపోవస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజలంతా ఆకలితో మాడి చావటం ఖాయం. ఒక పని చేయండి. మీరంతా మీ మీ పొలాల్ని నాకు ఆరు నెలలపాటు ఇచ్చేశారంటే, వాటిలో బంగారం పండిస్తాను' అన్నాడు."
"చౌదరీలందరూ సంతోషంగా వాళ్లవాళ్ల పొలాలను ఇచ్చేశారు. అప్పుడు మా ముత్తాత నడుం బిగించాడు- వెయ్యి ఎకరాలకు పైబడిన నేల ఉన్న గ్రామాన్ని- మొత్తాన్నీ- ఒక్క ఉదుటున పెళ్లగించి, ఎత్తి తన తలమీద పెట్టుకున్నాడు!"
"నిజమే చెబుతున్నావు చౌదరీ, నిజం!" అన్నారు శెట్టిగారు, అర్థం పర్థం లేని ఆ ప్రేలాపనకు మనసులోనే నవ్వుకుంటూ.
"సరే, అప్పుడు, మా పూర్వీకుడు గ్రామం మొత్తాన్నీ తన తల మీదికి ఎక్కించుకొని, వాన కోసం వెదుకుతూ బయలుదేరాడు. వాన ఎక్కడ పడుతుంటే అక్కడికల్లా వెళ్లి, ఆయన తన తలమీదున్న పొలాల్లోకీ, చెరువుల్లోకీ ఆ నీటినంతా సేకరించాడు. ఆపైన, ఆయన తోటి చౌదరీలందరినీ పొలాలుదున్ని, విత్తమన్నాడు. అప్పుడు వచ్చినంత చక్కని పంట ఏనాడూ రాలేదు మన ఊరిలో. జొన్న దంట్లు, గోధుమ మొక్కలు ఆకాశాన్ని దాటాయి.
"నిజం, చౌదరీ, నిజం! చక్కగా చెబుతున్నావు!" అన్నారు శెట్టిగారు.
"సరే, ఆ పైన, పండిన ధాన్యాన్నంతా ఒక చోటుకి చేర్చారు. కానీ అది ఎంత ఎక్కువ ఉన్నదంటే, దాన్ని నిలువ చేసేందుకు స్థలం చాలలేదు. దేశం నలుమూలలనుండీ వర్తకులు అద్భుతమైన ఆ పంటను చూసి, కొనేందుకు వచ్చారు. అలా మా పూర్వీకుడు బహు సంపదను ఆర్జించాడు: అయితే ఆ సందర్భంలో ఆయన వేల రూపాయల్ని పేదలకు పంచిపెట్టాడు; ఆకలిగొన్నవారికి అన్నం పెట్టాడు. ధాన్యాన్నిచ్చాడు."
కథ అంత వరకు వచ్చేసరికి, ఇద్దరూ పొలిమేరలుదాటి, పట్నంలోకి ప్రవేశిస్తున్నారు. చౌదరి తన కథను కొనసాగించాడు:
"ఆ సమయంలో మీ ముత్తాత చాలా పేదవాడుగా ఉండేవాడు. అతని పేదరికాన్ని చూసి జాలిపడి, మా ముత్తాత అతన్ని తన సేవకుడిగా ఉంచుకొని, ధాన్యాన్ని కొలిచే పనిని అతనికి అప్పజెప్పాడు."
"నిజం చౌదరీ, నిజం" అన్నాడు శెట్టిగారు.
"రాత్రింబవళ్లూ ధాన్యాన్ని కొలిచీ, కొలిచీ, మీ ముత్తాత క్షీణించిపోయాడు. అతని తెలివితేటలూ అంతంతమాత్రంగానే ఉండేవి - చాలా మొద్దు మెదడు - దాంతో అతను చాలా తప్పులు చేసేవాడు. ఆ తప్పులకు గాను మా ముత్తాత చేతిలో బాగా దెబ్బలు తినేవాడు, పాపం!" "అవును నిజం" అన్నారు శెట్టిగారు.
ఆ సరికి, వాళ్లిద్దరూ చౌదరి అప్పున్న వడ్డీవ్యాపారి దుకాణానికి చేరుకున్నారు. వడ్డీవ్యాపారి కూర్చొనే ఇద్దర్నీ లోనికి ఆహ్వానించాడు. కానీ చౌదరి అతన్ని పట్టించుకోకుండా తన కథను కొనసాగించాడు:
"సరే, శెట్టిగారూ, మా ముత్తాత తన పంటనంతా అమ్మివేసిన తరువాత, ఇక కొలిచేందుకు ఏమీ ధాన్యం మిగలలేదు. అందువల్ల మీ ముత్తాత ఉద్యోగం ఊడింది. అయితే, వెళ్లిపోయేముందు, అతను మా ముత్తాతను ఒక వంద రూపాయలు అప్పు అడిగాడు. మా ముత్తాతకూడా ఉదారంగా అతనికి అప్పు ఇచ్చాడు."
"నిజం చౌదరీ, నిజమే!" అన్నారు శెట్టిగారు, తల ఊపుతూ.
"బాగుంది" అన్నాడు చౌదరి, వడ్డీవ్యాపారికి కూడా వినబడేటట్లు తన గొంతు పెంచి: " మీ పూర్వీకుడు ఆ అప్పును తీర్చలేదు."
"నిజం, చౌదరీ!" అన్నారు శెట్టిగారు.
"మరి మీ తాతగానీ, మీ నాన్నగానీ, ఎవ్వరూ ఆ అప్పును తీర్చలేదు. ఇప్పటి వరకూ నువ్వుకూడా దాన్ని తీర్చలేదు" అన్నాడు చౌదరి గట్టిగా.
"నిజమే, వాస్తవం!" అన్నారు శెట్టిగారు, ఇంకా కథలోనే లీనమై.
"ఇప్పుడా వంద రూపాయలు అసలూ, చక్రవడ్డీతో కలిసి మొత్తం వెయ్యి రూపాయలైంది. ఆ మొత్తం నువ్వు నాకు ఇప్పుడు అప్పున్నావు!" అన్నాడు చౌదరి.
"నిజం చౌదరీ, నిజమే!" అన్నారు శెట్టిగారు, నిస్సహాయుడై.
"అందువల్ల, నువ్వు నీ అప్పును ఇంతమంది పెద్దల ఎదుట నిలబడి ఒప్పుకున్నావు గనుక, నాకు ఇవ్వాల్సిన వెయ్యి రూపాయలనూ ఈ వడ్డీ వ్యాపారిగారికి ఇస్తావా? నేను నా భూముల్ని విడిపించుకుంటాను?" అన్నాడు చౌదరి.
ఇంతగా ఊహించని శెట్టిగారి నెత్తిన ఈ చివరి మాటలు పిడుగుల్లాగా పడ్డాయి. తనకి తెలీకుండానే తను అప్పు పడ్డట్లు సాక్షుల ఎదుట అంగీకరించాడు! అతనికి ఇక ఏం చేయాలో పాలుపోలేదు. ఒకవేళ తను ఇదంతా కేవలం కట్టుకథేనని, కల్పితం అనీ అంటే, తమ ఒప్పందం ప్రకారం చౌదరికి వెయ్యి రూపాయలు ఇవ్వాలి! అలా కాక అదంతా వాస్తవం అని ఒప్పుకుంటే వెయ్యి రూపాయల్నీ తన మాటకోసం చెల్లించక తప్పదు! ఎటు తిరిగీ వెయ్యి రూపాయలు ఖాళీ! చివరికి శెట్టిగారు లబోదిబోమంటూనే వెయ్యి రూపాయలు వదులుకొని దుకాణం బయటికి నడిచారు!
తను మొదలుపెట్టిన అబధ్ధపు కథల పోటీని తానే జీవితాంతం తిట్టుకున్నారు!!