ఒక నది ఒడ్డున ఒక ఎలుక, ఒక చీమ, ఒక కప్ప, ఒక ఈగ నివసిస్తూండేవి. ఆ నది ఒడ్డున కొబ్బరి చెట్లు, తాటి చెట్లు చాలా ఉండేవి. అక్కడే ఒక పెద్ద బండ ఉండేది. దాని పేరు 'కొబ్బరి బండ'. కొబ్బరి బండ మీద కప్ప, ఈగ, ఎలుక, చీమలకు కావలసినంత తాటి కొబ్బరీ, టెంకాయ కొబ్బరీ దొరికేవి.
అయితే, వీటిలో చీమ, ఎలుకలు - కప్ప, ఈగలతో కలిసేవి కావు. కప్ప-ఈగ రెండూ మొద్దువనీ, తెలివి తక్కువవనీ చీమ-ఎలుక అనుకునేవి. వాటిని వెక్కిరించేవి. వాటిని తమనుంచి దూరంగా ఉంచేవి. కానీ కప్ప-ఈగ మాత్రం వాటినీ కలుపుకుపోయేందుకు ప్రయత్నించేవి.
కప్ప-ఈగ ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి, ఆహార సంపాదన కోసం తొందరగా బయలుదేరి, నడుచుకుంటూ కొబ్బరి బండకు బయలుదేరేవి. కానీ ఎలుక-చీమ మాత్రం ఆలస్యంగా నిద్ర లేచేవి. అయితే, అవి తాటికాయ చిప్పలతో ఒక బండిని చేసుకొని పెట్టుకున్నాయి! దానిలో ఎక్కి కూర్చొని, అవి కప్ప-ఈగల కంటే ముందుగా కొబ్బరి బండ మీదికి చేరుకునేవి. అంతేకాదు; అక్కడ అవి తమకు నిజంగా కావల్సిన ఆహారంకంటే ఎక్కువ ఆహారాన్ని బండిలో వేసుకొని తీసుకు పోయేవి. పాపం! వెనకగా పోయిన కప్ప, ఈగలకు ఏమీ దొరికేది కాదు. సరిపడేంత ఆహారం దొరకక కప్ప-ఈగ చాలా కష్టాలుపడేవి.
ఇలా ఉండగా, ఒకసారి పెద్ద గాలివాన ఒకటి వచ్చి పడింది. ఆ గాలివానకు అక్కడి నది పొంగింది; నేలంతా చిత్తడి చిత్తడిగా, బురదమయం అయిపోయింది. ఎక్కడచూసినా నీళ్లు, బురద! అలాంటి కష్ట సమయంలోకూడా కప్పకేమీ ఇబ్బంది లేకపోయింది! -ఎందుకంటే కప్ప ఉభయజీవి కదా! అది నీళ్లలో చక్కగా అటూ ఇటూ ఈదులాడుతూ, దొరికినదాన్ని తిన్నది.
ఇక ఈగేమో, ఎగురుకుంటూ పోయి, ఒక చెట్టు తొర్రలోదూరి వానకు చిక్కకుండా, వెచ్చగా కూర్చున్నది.
చీమ-ఎలుక చాలా కష్టపడ్డాయి. చీమ పుట్టలోకి నీళ్ళు వచ్చాయి.ఎలుక కన్నం అయితే నదిలో మునిగిపోయింది. అయినా చీమ-ఎలుక కూడా ఎక్కడెక్కడో దాక్కుని తమను తాము కాపాడుకున్నాయి.
వర్షం ఆగిపోయాక, కప్ప-ఈగ రెండూ, ఆహారం కోసం కొబ్బరి బండ మీదికి ఏమాత్రం శ్రమ లేకుండా త్వరగా వెళ్లగల్గాయి. కానీ ఎలుక-చీమ మాత్రం ఆ నీళ్లల్లోంచి బండ మీదికి ఎక్కలేకపోయాయి.
అయితే కొంతకాలానికి వాటికొక ఉపాయం తోచింది. ఒక పెద్ద కొబ్బరి చిప్పను తీసుకొని, అవి రెండూ అందులో కూర్చొని, ఒక టెంకాయ పుల్లని తెడ్డుగా చేసుకొని, పడవలో మాదిరి, నిదానంగా అవి కొబ్బరిబండ మీదికి ఎక్కగల్గాయి!
కానీ అప్పటికే చాలా ఆలస్యమయిందన్న విషయం ఆ రెండింటినీ నిలువనియ్యలేదు. అవి అనుకున్నాయి "బండ మీదకు ముందుగా వెళ్లిన కప్ప-ఈగ మన వంతు ఆహారాన్ని కూడా ఖాళీ చేసేసి ఉంటాయ"ని.
కానీ, నిజానికి ఆకలి బాధ తెలిసిన కప్ప-ఈగ తమకు కావలసినంత మాత్రమే తీసుకుని, వెనకగా వచ్చే వారి కోసం కూడా అహారాన్ని మిగిల్చాయి.
తమకు ఇక ఆహారం దొరకదనీ, తాము ఆకలితో మాడిచావటం ఖాయమనీ అనుకుంటూ, నిరాశతో మెల్లగా బండమీదకు పోయిన చీమ-ఎలుకలకు, అక్కడ చాలినంత ఆహారం కనబడ్డది!
ఆబరాగా కడుపులు నింపుకొని అటూ ఇటూ చూస్తే, ఆ బండమీదే ఓ పక్కన కూర్చొని, తమకు కావలిసినంత ఆహారాన్ని మాత్రమే తీసుకుని తింటున్న కప్ప-ఈగ కనిపించాయి వాటికి. ఆ క్షణంలో వాటికి కప్ప-ఈగల ఉన్నతత్వం అర్ధమైంది. తాము గతంలో చేసినట్లు, అవి దొరికినదంతా తినేసి ఉంటే ఈనాడు తమ పరిస్థితి ఏమయ్యేదో వాటికి తెలిసివచ్చింది. మనసు లోతుల్లోనుంచి పశ్చాత్తాపం జనించింది.
అవి వెళ్లి కప్ప-ఈగలను క్షమాపణ కోరాయి. ఆపైన అన్నీ కొబ్బరి బండమీద దొరికే ఆహారాన్ని కలిసి తింటూ, అరమరికలు లేకుండా సంతోషంగా జీవించాయి.