చాలాకాలం క్రితం ఒక ఊరిలో నడిచే చెట్టు ఒకటి ఉండేదట.

అది చాలా మంచిది. పిల్లలంటే దానికి ఎంతో ప్రేమ. మిగిలిన చెట్లన్నీ ఒకచోట నిల్చొని పండ్లిస్తుంటే, అది మాత్రం ఇంటింటికీ తిరిగి పండ్లిచ్చేది.

మిగిలిన చెట్లన్నీ ఏ జాతి చెట్టు ఆ జాతి పండ్లని మాత్రమే ఇచ్చేవి, కానీ ఈ చెట్టు మాత్రం ఏ పండ్లడిగితే ఆ పండ్లిచ్చేది.

పిల్లలు మామిడి పండ్లు కావాలంటే దానికి మామిడి పళ్లు కాసేవి. జామకాయలిమ్మంటే అది జామకాయలిచ్చేది. నేరేడుపళ్లు, రేగుపళ్లు, దానిమ్మలు, సపోటాలు, పనసపళ్లు - ఒకటేమిటి, ఏవడిగితే అవి కాసేవి, ఆ చెట్టుకు.

పిల్లల తల్లితండ్రులు కూడా, తమకేవైనా పండ్ల చెట్ల విత్తనాలు కావాలంటే, పిల్లలకు చెప్పి, నడిచేచెట్టుచేత ఆ పండ్లు తెప్పించుకుని, విత్తనాలు తీసి, వాటిని నాటుకునేవాళ్లు.

వీటన్నింటికీ ప్రతిఫలం ఏమీ ఆశించేది కాదు, నడిచేచెట్టు. ఆ ఒక్క చెట్టు కారణంగా చుట్టుపక్కల అనేక గ్రామాల్లో పండ్ల చెట్లు పుష్కలంగా పెరిగాయి.

కాలం గడిచేకొద్దీ పిల్లలూ పెద్దయ్యారు. చెట్టూ పెద్దదైపోయింది. అయినా అది నడుచుకుంటూ ఊరంతా తిరిగేది. కొత్త పిల్లలు ఏ పండ్లడిగితే వాటినల్లా అది ఇస్తూండేది.

చివరికది చాలా ముసలిదైపోయాక, ఒక రోజున చచ్చిపోయింది.

అది చచ్చిపోయిన తర్వాత, ఊళ్లోవాళ్లంతా అనుకున్నారు - "అరే, తప్పైపోయిందే, మనం నడిచేచెట్టు దగ్గర అన్ని రకాల పళ్లూ అడిగి తీసుకున్నాం గానీ, దాని సొంత పండ్లు ఇమ్మని మాత్రం ఎన్నడూ అడగలేదే!? దాని విత్తనాలే నిలచి ఉంటే, ఈ రోజున ఎక్కడ చూసినా నడిచే చెట్లు పెరిగి ఉండేవికదా!" అని.

మాకు బాగా తెలిసి, అలా నడిచిన ఒక చెట్టు- గొర్రెపాటి నరేంద్రనాథ్. చిత్తూరు జిల్లా వెంకట్రామాపురంలో నడిచీ, నడిచీ, గతమాసంలో చనిపోయిందా చెట్టు. అందరికీ ప్రేమను, మానవత్వాన్నీ, సామాజిక స్పృహను పంచి ఇచ్చిన నరేన్ కు జోహార్లు.

మన సమాజంలో మంచి మనుషులు ఇంకా చాలామందే ఉన్నారు. మనం అలాంటి వాళ్ల నుండి ఫలాలను పొంది లాభపడుతూనే ఉన్నాం! అయితే కేవలం వాళ్ళను ఉపయోగించుకొని ఊరుకోకుండా, వాళ్లను అలా నడిపించే సహృదయతా బీజాల్ని కొంచెం సేకరించుకుని, వేరే చోట్ల కూడా నాటి, సంరక్షించి, పెంచుకోవటం మనందరి బాధ్యత.

మనలోని మంచితనం మరింత వృధ్ధి చెందాలని ఆశిస్తూ,

కొత్తపల్లి బృందం.