కొండ బడాయి:
ఉడతా ఉడతా చిన్నారి బుడతా!
వింటావా నా గొప్ప వివరించి చెబుతా!
అబ్బబ్బ నా ఎత్తు ఆకాశమంత!
అహ్హహ్హ నా గొప్ప చెప్పలేనంత!
నాముందు నువ్వెంత?
కంటిలో నలుసంత!
నాపైన పెరిగేటి చెట్టుపుట్టలు చూడు!
నాపైన పడిఉన్న బండరాళ్లను చూడు!
నిన్ను మోసేది నేనే ఓ ఉడతా!
నువ్వు తిరిగేది నాపైనే ఓ బుడతా
అబ్బబ్బ నా ఘనత ఓపలేనంత!
అహ్హహ్హ నా బరువు మోయలేనంత!
నాముందు నువ్వెంత?
ఓ చిన్న రాయంత!
ఉడత జవాబు:
బండరాళ్లను మోయు కొండన్నా!
బడాయిమాటలు వద్దన్నా!
ఉడతనే బుడతనే
కాదనను నేను
నీ ఎత్తు నీ లావు ఒప్పుకుంటాను
బుడతనైనా నేను పరుగెత్తుతాను!
చెట్లకొమ్మలపైన గంతులేస్తాను!
నాలాగ అటూ ఇటూ నడవగలవా నువ్వు?
కాయలను కమ్మగా కొరికి తినగలవా ?
నాకన్నా నువ్వెంతో పెద్దవాడివె కాని
నీకన్నా నేనెంత చిన్నదాన్నో చూడు!
నీ గొప్ప నీదే
నా గొప్ప నాదే
కొండన్నా
ఈ నిజం తెలుసుకో అన్నా!