దౌలత్, ఇంతియాజ్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. 35 సంవత్సరాలుగా ఇద్దరి ఇళ్లూ ఒకే ఆటస్థలానికి ఎదురుబదురుగా ఉన్నాయి. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్లిద్దరూ అదే ఆట స్థలంలో ఆడుకునే వాళ్లు - ఇప్పుడు ఇద్దరికీ పెళ్లిళ్లయిపోయాయి, ఇద్దరివీ వ్యాపారాలు పెరిగాయి, ఇద్దరికీ పిల్లలు పెద్దవుతున్నారు. వాళ్ల స్నేహం ఇంకా బలపడింది.
ఒక రోజున ఇంతియాజ్ కు హజ్ ను సందర్శించాలని కోరిక కల్గింది. "ఇద్దరం కలిసి మక్కాకు పోదాం" అన్నాడు. దౌలత్ అందుకు అంగీకరించాడు; అయితే ప్రయాణ ఖర్చులు, ఇతర ఖర్చులకోసం కావలసిన డబ్బు అతనివద్ద లేదు - అంత మొత్తం కూడబెట్టేందుకు కనీసం ఒక సంవత్సర కాలం పడుతుంది. ఇద్దరు మిత్రులూ తమ హజ్ యాత్రను అలా వాయిదా వేసుకున్నారు.
యాత్ర కోసం దౌలత్ డబ్బును దాచడం మొదలుపెట్టారు. ఇంట్లో వృధా వ్యయంపై కోత పడింది. నెల పూర్తి కాగానే మిగిలిన డబ్బంతా యాత్ర కోసం వేరుగా పెడుతున్నారు. ఈలోగా యాత్రకు కావలసిన తయారీ కూడా మొదలుపెట్టారు.
ఇంకో నెలకు బయలుదేరతారనగా, ఒకరోజున, పొరుగింట్లోంచి మాంసం వండుతున్న కమ్మని వాసన వచ్చింది దౌలత్ కు. `అదేం మాంసమో' చూసిరమ్మని భార్య రుబీనాను పక్కింటికి పంపాడతను. రుబీనా వెళ్లి, ఆ వాసనను మెచ్చుకొని, తన భర్త కోసం ఒక చిన్న గిన్నెడు మాంసం కూరను ఇమ్మని అడిగింది వాళ్లను. అయితే పొరుగింటామె ఇచ్చేందుకు చాలా సంకోచించింది - "దయచేసి అడగకు. ఈ మాంసం మీరు తినగలిగేది కాదు' అని ఆమె కళ్ల నీళ్లు పెట్టుకున్నది. "మీరు తినే మాంసాన్ని మేమూ తినగలం" అని రుబీనా పంతం పట్టిన మీదట, ఆమె వాస్తవాన్ని వివరించింది. "ఈమధ్య వ్యాపారం సరిగా నడవటం లేదు. మూడు రోజులుగా ఇంట్లో తినేందుకు ఏమీ లేదు. నిన్న మా భర్తకు అతి కష్టం మీద చనిపోయిన బర్రె మాంసం, పాతది, కొంత దొరికింది - చెప్పేందుకు చాలా సిగ్గుగా ఉన్నది, కానీ ఏం చెప్పను? మా పరిస్థితి ఇలా ఉంది" అని బాధపడిందామె.
రుబీనా తిరిగివచ్చి దౌలత్ కు సంగతి అంతా చెప్పింది. వారికి ఏదైనా సాయం చేద్దామనుకున్నారు ఇద్దరూ. కొన్ని రోజులు తీవ్రంగా ఆలోచించినమీదట, తను హజ్ యాత్ర కోసం దాచుకున్న డబ్బునంతా వారికి ఇస్తే మంచిదన్న నిర్ణయానికి వచ్చాడు దౌలత్.
"మిత్రమా, ఏదైనా సత్కార్యం కోసమే అల్లా ఈ డబ్బుని నా చేతుల్లో పెట్టాడు. నీ అవసరాన్ని చూసిన మీదట, దీన్ని నీకివ్వటానికి మించిన సత్కార్యం మరోటి నాకు కనబడటం లేదు. దీనితో ముందు మీ ఇంటికి కావలసిన భోజన సామాగ్రి కొనుక్కోండి. మిగిలిన ధనాన్ని మీ వ్యాపారంలో మదుపు చేయండి. అల్లా దయవల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది" అని చెప్పాడు దౌలత్. వారికి డబ్బునందిస్తూ.
ఇంతియాజ్ తో మాత్రం, కుటుంబ సమస్యల వల్ల తను ఆ సంవత్సరం హజ్ యాత్రకు రాలేనని చెప్పాడు. తను ఆ డబ్బుతో ఏవో దాన దర్మాలు చేసినట్లు చాటుకోవటం అతనికి ఇష్టం లేకుండింది. ఇక, దౌలత్ రావటం లేదని ఇంతియాజ్ బాధపడ్డాడు; కానీ తాను ఒంటరిగానే హజ్ కి వెళ్లాలని నిశ్చయించుకుని, అనుకున్న రోజున జెడ్డా వెళ్లే పడవనెక్కాడు.
తన స్నేహితుడిని ఒంటరిగా పంపుతున్నందుకు దౌలత్ కూడా చాలా నిరాశకు లోనయ్యాడు. అయినా, `అత్యవసరంలో ఉన్న పొరుగు వ్యక్తికి సాయం చెయ్యటం హజ్ యాత్ర చెయ్యటంతో సమానం' అనుకుని అతను మనసును చక్కబెట్టుకున్నాడు. అయినా అతని ఆలోచనలు హజ్ చుట్టూనే పరిభ్రమించాయి. "ఈ రోజున ఇంతియాజ్ కాబాను సందర్శింస్తూంటాడు... ఇప్పుడు బహుశ మదీనాకు బయలుదేరుతూంటాడు" అని భార్యకు చెబుతూ, రోజులు లెక్కపెట్టుకుంటూ గడిపాడు.
అక్కడ, ఇంతియాజ్ కూడా దౌలత్ గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాడు. ఆలోచించటమేకాదు, ఆశ్చర్యంగా, తను వెళ్లిన చోటల్లా తనకంటే ముందు నడుస్తూ దౌలత్ కనిపించాడు అతనికి.
మక్కాలోనూ, ఆపై మదీనాలో కూడాను అలాగే జరిగింది. అతన్ని అందుకుందామని ఇంతియాజ్ ప్రయత్నించినా వీలుకాలేదు.
వెనక్కి తిరిగి రాగానే ఇంతియాజ్ నేరుగా దౌలత్ ఇంటికే వెళ్లాడు. దౌలత్ ని మనసారా అభినందిస్తూ, "నీ హజ్ యాత్ర నిజంగా పూర్తైంది" అని చెప్పాడు. "నువ్వు అక్కడ ఉండినావు, దౌలత్! నేనెక్కడికి వెళ్లినా నువ్వు అక్కడికి నా కంటే ముందే చేరుకున్నావు. అల్లా అద్భుత శక్తిశాలి. ఆయన నీపట్ల దయతో ఉన్నాడు. ఈ యాత్రా ఫలాన్ని నీకు ఇవ్వాలనుకున్మ్నాడు. దీనికి నేనే సాక్షిని" అన్నాడు.