రామానుజన్ గారు చెప్పిన పాత కథ ఒకటుంది.

మేకపిల్ల ఒకటి ఒక రోజున ఒంటరిగా వాగులో నీళ్లు తాగుతున్నది.

దానికి కొద్ది గజాల దూరంలోనే - పై వైపున, ఒక పులి మంచినీళ్లు తాగేందుకని వచ్చి ఉన్నది.

అది మేకపిల్లను చూడగానే అన్నది - "నువ్వు నా నీళ్లను ఎందుకు పాడుచేస్తున్నావు?" అని.

మేకపిల్ల అన్నది - "నువ్వు తాగే నీళ్లు నావల్ల ఎలా పాడౌతాయి? నేనేమో కింది వైపున ఉన్నాను - నువ్వు పై వైపున ఉన్నావు!" అని.

"కానీ నువ్వు పాడుచేసింది ఇవ్వాళ్ల కాదు - నిన్న." అన్నది పులి.

"నిన్న అయితే నేను అసలు ఇక్కడికి రానే లేదు!" అన్నది మేకపిల్ల.

"అయితే ఆ పని మీ అమ్మ చేసి ఉండాలి." అన్నది పులి.

"మా అమ్మ చచ్చిపోయి చాలా కాలమైంది. వేటగాళ్లు ఏనాడో ఆమెను ఎత్తుకపోయారు!" అన్నది మేక.

"అయితే నా నీళ్లను పాడుచేస్తున్నది కచ్చితంగా మీ నాన్నే."

"మా నాన్నా?! మా నాన్న ఎవరో నాకే తెలీదు! ఆయనెలా - ?" అన్నది మేకపిల్ల, ఎలాగైనా పారిపోదామని లేచి నిలబడుతూ.

"నాకదేమీ తెలీదు. నా వాగు నీళ్లను పాడుచేస్తున్నది మరి మీ తాతైనా అయ్యుండచ్చు. వాళ్ల నాన్నైనా అయి ఉండచ్చు. అందుకని నేను నిన్ను తినాల్సిందే." అని, పులి మేకమీదికి దూకి దాన్ని తినేసింది.

ఒకపని చేద్దామని నిశ్చయించుకొని, ఆ తర్వాత దాన్ని అడ్డగోలుగా సమర్థించుకొనే వాళ్లతో మాట్లాడటం వ్యర్థమే అవుతుంది. వాళ్ల మనసుల్లో ఏది ఉందో వాళ్లు దాన్నే చేస్తారు - మాటలు మనకు కనీసం తప్పుకొనేందుకు కూడా అవకాశాన్నివ్వవు. అలాంటివాళ్లకు ఎదురుపడకుండా ఉండటమే మంచిది. ఎదురుపడ్డప్పుడు వాదనల్లో సమయాన్ని కోల్పోవడం కంటే, మౌనంగా వెనక్కి తగ్గి, వేరే దారి వెతుక్కోవడమే శ్రేయస్కరం అవుతుంది. ఏమంటారు?

ఈనెల కొత్తపల్లి పతాక చిత్రానికి ప్రేరణ, రాఖీ పండుగ. అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ, భారతీయ సంప్రదాయపు సౌరభాన్ని నలుదిశలా వెదజల్లుతున్నది. ఇక, ఈ సంచికలోని పాట "డాక్టరుగారు వచ్చారు" ను చిన్నారి నితిన్ గుంటూరు జిల్లానుండి సొంత దస్తూరితో రాసి పంపాడు. ఆ చిన్నారికి, మీకందరికీ కూడాను- కొత్తపల్లి బృందం అభినందనలు.

మీ- కొత్తపల్లి బృందం.