బట్టతల!

రాము: ఒరేయ్ సోమూ, నీ చిన్ననాటి కల ఒక్కటైనా తీరిందారా?

సోము: తీరిందిరా...
రాము: ఏంట్రా ఆ కల?

సోము: చిన్నప్పడు మన టీచరు నా జుట్టు పట్టుకుని పీకేటప్పుడు, ఆ బాధ భరించలేక నాకు జుట్టు లేకుంటే ఎంత బాగుడునని నేను కన్న కల ఇన్నేళ్లకు నిజమయిందిరా!!!

ఆర్డర్!!

జడ్జి: ఆర్డర్..ఆర్డర్.
బోనులో నిలబడ్డ హోటల్ లో పనిచేసిన సర్వర్: ఇడ్లి, వడ, పూరి, దోస, పొంగల్, ఉప్మా, చపాతి, ఇంకా టీ, కాఫీ, పాలు....త్వరగా...త్వరగా సార్.

జడ్జి: ఆఆఆ!!

ఐంస్టీన్!

డాక్టర్: చూడండి, మీరు ఈ టానిక్ ను ప్రతి రోజూ రెండు స్పూన్ లు తాగారంటే మీ తెలివి బ్రహ్మాండంగా పెరుగుతుంది మరి.

పేషంట్: సార్, మా ఇంట్లో ఒకటే స్పూనుండండీ!!

తెలివి!

అమ్మ: ఒరేయ్ చంటీ! ఆ పిల్లి వచ్చి పాలను తాగకుండా చూసుకోరా!

చంటి: సరే అమ్మా.

(కొద్దిసేపటికి..)అమ్మ: ఒరేయ్, పాలేవిరా?

చంటి: కుక్క తాగేసిందమ్మా.

అమ్మ(కోపంగా): నిన్ను ఇక్కడుంచింది పాలు తాగనీకుండా చూడటానికే కదరా?!

చంటీ: పిల్లి తాగకుండా కదమ్మా చూసుకోమన్నది!!

టివిలో ఉందాం రా!

ఉపాధ్యాయుడు: మనకు వానలు ఎంతో అవసరం. కానీ మన రాష్ట్రంలో డిశంబరు నుండి మార్చి వరకూ వానలు పడవర్రా..పిల్లలూ

చంటి: టిచర్! మరేమో రాత్రి నేను టీవీలో వాన పడుతుండగా చూశానండీ. మరిప్పుడు జనవరే కదండీ..

ఉపాధ్యాయుడు: టీవీలో, ఏ నెలలో అయినా వానలు కురుస్తాయిరా చంటీ.

చంటి: టీచర్! మరి జనవరి నుండి డిశంబరు దాకా మనమందరం టివీలోకి వెళితే సరిపోదా టీచర్.

ఉపాధ్యాయుడు: ఆఆఆఆ!!!

బహుళార్థసాధకం!

ఉపాధ్యాయుడు: ఒరేయ్ గోపీ, కోడి వలన ఏవైనా రెండు ఉపయోగాలు చెప్పరా?

గోపి: సార్, కోడి కూస్తే అలారం, కోస్తే ఆహారం లా ఉపయోగపడుతుంది సార్...

మక్కువ!

అత్త: అమ్మాయ్ కోడలు పిల్లా! మా అబ్బాయికి పూరీ ఇష్టం, మా అమ్మాయికేమో చపాతి ఇష్టం. నాకేమో ఉప్మా. మరి, నీకేమి ఇష్టం?

కోడలు: అత్తయ్యా, నాకు వేరే కాపురమంటే చాలా ఇష్టం.

స్వీయ ప్రకర్ష!

ఉపాధ్యాయుడు: ఒరేయ్ పిల్లలూ, మన దేశం చాలా గొప్పదర్రా..అంతేకాదు మన దేశంలో అనేకమంది గొప్పవాళ్లు పుట్టారు. మనందరం గొప్పవాళ్ళమే. ఘనమైన చరిత్ర మనది.

(కాసేపయ్యాక) ఉపాధ్యాయుడు: ఒరేయ్ గోపీ, మన దేశంలో నలుగురు గొప్పవాళ్ల పేర్లు చెప్పరా.

గోపి: మా అమ్మ, మా నాన్న, నేను, మా చెల్లి సార్.