వరదాపురం గోవిందమ్మది పాల వ్యాపారం. రైతులనుండి పాలు సేకరించటం, కొద్దిపాటి లాభంతో ఇళ్ళ వారికి పోయటం ఆమె వృత్తి. తన పని పట్ల నిబద్ధత ఉండటం వల్ల, ఊళ్ళో అందరూ ఆమెను అభిమానించేవాళ్ళు.

గోవిందమ్మ ఇంటికి ఎదురుగా రంగమ్మ, కూరగాయల వ్యాపారం చేసేది. "నువ్వు రైతు దగ్గర కొనే రేటుకే నాకు పొయ్యాలి. మనం మనం వ్యాపారులం, ఎదురు బొదురు ఇళ్ళ వాళ్ళం. మన మధ్య లాభాల లెక్కలు ఉండకూడదు" అంటూ తను తీసుకెళ్ళే పాలకు తక్కువ డబ్బులు ఇచ్చేది. రంగమ్మ పిసినారితనం తెలిసిన గోవిందమ్మ కూడా, 'సర్లే కానియ్యమ'ని ఊరుకునేది.

గోవిందమ్మకు గుత్తి వంకాయకూర అంటే చాలా ఇష్టం. తన ఇంటి ప్రక్కన ఉండే కాంతమ్మ కూరగాయలు పండిస్తుంది. ఓసారి గోవిందమ్మ కాంతమ్మ ఇంటికి వెళ్ళి "అక్కా వంకాయలు వున్నాయా?!" అని గట్టిగా రెండు, మూడు సార్లు కేకలు వేసింది.

కాంతమ్మ "వస్తున్నానమ్మా" అంటూ బయటకు వచ్చి, గోవిందమ్మను చూసి "నువ్వా! రా! లోపలికి రా!" అని ఆహ్వానించింది. "ఏమీ లేదు కాంతమ్మక్కా, నాకు ఒక కిలో పాటి వంకాయలు కావాలి- ఉన్నాయా?" అడిగింది గోవిందమ్మ.

"అయ్యో ఐదు కిలోల వంకాయలు ఉంటే, ఇప్పుడే రంగమ్మకు ఇచ్చాను. కిలోకు ఇరవై ఇస్తానంది. నీకు ఎన్ని కావాలో అన్ని తీసుకో, ఆమె దగ్గర- నేను చెప్పానని చెప్పు!" అన్నది కాంతమ్మ.

"సరేలే అక్కా! దానిదేమున్నది, నీ దగ్గర తీసుకున్నా, రంగమ్మక్క దగ్గర తీసుకున్నా ఒకటేగదా! వెళ్ళొస్తాను" అంటూ గోవిందమ్మ రంగమ్మ ఇంటికి పోయింది.

"రంగమ్మక్కా! వంకాయలున్నాయటగా, నీ దగ్గర?!" అన్న గోవిందమ్మతో, రంగమ్మ "ఉన్నాయి. కిలో కేవలం యాభై. నీకు ఎన్ని కావాలి?" అని అడిగింది.

"అమ్మ బాబోయ్, యాభై రూపాయలే! కాంతమ్మ ఇరవై రూపాయలకే ఇస్తావన్నది?" అంది గోవిందమ్మ.

"వాళ్ళు పండించినవి కాబట్టి, ఏదో ఒక రేటుకు అమ్ముకుంటారు. మనకు ఆ రేటు గిడుతుందా!" అంది గడుసు రంగమ్మ.

"ఏమయితేనేమిలే అక్కా, అవీ వంకాయలే- ఇవీ వంకాయలే! ఇరవై రూపాయలకు ఇస్తావా?" అని అడిగింది గోవిందమ్మ.

"మేం పట్నం నుంచి తెస్తామమ్మా, మంచి వంకాయలు! వాటిని తెచ్చేందుకే చాలా ఖర్చువుతుంది. ఇరవైకి ఏమాత్రం గిట్టదు" అని రంగమ్మ అంది.

"నువ్వు తెచ్చింది కాంతమ్మ దగ్గరేగా, పోనీ వీటిని ముప్ఫై రూపాయలకు ఇచ్చెయ్యి! అయినా నీకు పది లాభమే!" అంది గోవిందమ్మ.

"కుదరదు. యాభైకి తక్కువ లేదు" అనేసింది రంగమ్మ.

అంతే! ఇక మరుసటి రోజునుండీ గోవిందమ్మ పాలతో బాటు కూరగాయలు కూడా అమ్మటం మొదలు పెట్టింది. కూరగాయలు పండించే రైతులకు ఆమె దగ్గర ఎక్కువ ధర దొరికింది; కొనేవాళ్లకు తక్కువ ధరకు దొరికినై, కూరగాయలు! అత్యాశకు పోయిన రంగమ్మకు మాత్రం పాల రేటు కూడా ఎక్కువయింది!