బాగా వర్షం కురుస్తోంది.

కొందరు చిన్నపిల్లలు పడవలు చేయడంలో నిమగ్నమై పోయారు. కొందరు వర్షాన్ని చూస్తూ అందులో తడుస్తూ, కేరింతలు కొడుతూ ఉన్నారు. కానీ రైతు గుండెల్లో మాత్రం ఒకటే గుబులు- అకాల వర్షాల వల్ల పంట నాశనం అవుతుందని.

రైతు ఒక్కడే బాధపడుతూ దేవుడిని ఇలా ప్రార్థించాడు: "దేవుడా! పంట వేద్దామంటే నీళ్ళుండవు కానీ, నీటి అవసరం లేనప్పుడు, సరిగ్గా నేను కోత కోసే సమయానికి మాత్రం పెద్ద వర్షం కురిపిస్తావు, ఎందుకు? నీ ఈ పని వల్ల మాకు పంట నష్టం; మా శ్రమంతా వ్యర్థం. మాకు ఏ సమయంలో నీరు కావాలో, ఎప్పుడు గాలి అవసరమో మాకు తెలిసినంతగా నీకు తెలియదు స్వామీ. అందుకని దయచేసి నాకు ఈ వరం ఇయ్యి- 'పంటకు ఎప్పుడు అవసరమో చూసుకొని తగినంత గాలి, నీరు అన్నీ నేనే అందిస్తాను వాటికి!’. ఇట్లా మార్చు పద్ధతిని!" అని.

వెంటనే దేవుడు ప్రత్యక్షమై, "నువ్వు ఎట్లా అంటే అట్లాగే కానియ్యి. అంతా నువ్వు కోరుకున్నట్లే జరుగుతుందిలే, బాధపడకు!" అని చెప్పి మాయమైపోయాడు.

రైతుకు చాలా సంతోషం వేసింది. "నారుమడి వేయాలంట- పొలాల్లో నీళ్ళు నిండాలి!" అన్నాడు. వెంటనే వర్షం వచ్చి నీళ్ళు చేరాయి. ఇక అటుపైన రైతు తన శక్తిని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. పొలాల్లో నీళ్ళ మట్టం కొంచెం తగ్గిందంటే చాలు, మేఘాల్ని పిలిచి వాన కురిపించుకున్నాడు.

విత్తనం ఆరేందుకు మంచి గాలి కావాలి. రైతు గాలిని ఆదేశించాడు- వెంటనే గాలి బాగా వీచింది. కంకులు కోయటం ఆరబెట్టటం అయ్యింది.

ఆ వెనక వాటిని తూర్పార బట్టేందుకు ప్రయత్నించాడు రైతు. చూస్తే వరి గింజలు అన్నీ‌ తాలువే! మొత్తం పొట్టే! గింజ లేదు! "ఇదెక్కడి ఘోరం, స్వామీ?! నీళ్ళు అవసరమయినప్పుడు నీళ్ళు, గాలి కావాలన్నప్పుడు గాలి- అన్నీ సమయానికి అందించాను కదా?! కానీ పంట పండలేదేల?" అంటూ దేవుడిని తలచుకొని వగచాడు రైతు.

దేవుడు మళ్లీ ప్రత్యక్షమై "చూడు నాయనా! చాలీ చాలని నీళ్ళున్న బురదలోకి వరి మొక్కను నాటగానే, తను ఎలాగైనా నెలకొనాలని ప్రయత్నించి, గట్టిగా నిలుస్తుంది అది. అటు తర్వాత నాటు పెరిగి పెద్దయ్యేటప్పుడు, గాలితోటి - వానతోటి పోరాడి, తన వేళ్ళను ధృడంగా మట్టిలోకి పంపించి, తన ఆవాసాన్ని స్థిరం చేసుకుంటుంది. నేను అడుగడుగునా పంపించే వర్షాన్ని, గాలిని, తట్టుకొని, అలా పెంచుకున్న తన శక్తినంతా గింజల రూపంలోకి మార్చి, కంకిని తయారు చేస్తుంది. అప్పుడు గదా, పంట నీ చేతికి వచ్చేది?!

కానీ ఎప్పుడు ఏమి అవసరమో నువ్వే నిర్ణయించుకొని, ఆ మొక్కలు ఏమీ శ్రమపడే అవసరం లేకుండా నువ్వే వాటికి అన్నీ తెచ్చి అందిస్తే, ఇక ఆ పంటకు దేనితోటీ పోరాటం లేదు; తనని తాను నిలుపుకునేందుకు ప్రయత్నించాల్సిన అవసరం లేదు; శక్తీ కూడా అవసరం లేదు; ఆ శక్తితో గింజలు తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందువల్ల వరి మొక్క పెరిగింది; కానీ అందులో గింజలు లేవు!" వివరించాడు దేవుడు.

"ఇంత లోతుగా నేను ఆలోచించలేదు స్వామీ! నన్ను క్షమించు. మళ్ళీ అన్ని బాధ్యతలూ తీసుకొని, నువ్వే, నీకు తోచినట్లు చెయ్యి" అని తలవంచి నమస్కరించాడు రైతు.