కంకణాలపల్లిలో ఉండే వెంకటయ్య, భవన నిర్మాణంలో సెంటరింగ్ పనులు చేస్తాడు. ఒక రోజున వాళ్ల ఇంట్లో వాళ్ళు అందరూ బంధువుల పెళ్ళికని బయలుదేరారు. వెంకటయ్య మాత్రం 'నేను రాను-నాకు పని ఉంది" అన్నాడు. ఎంత చెప్పినా వినకపోయే సరికి, 'సరేలే, నీ‌ పనేదో చూసుకో' అని అతన్ని విడిచిపెట్టి మిగిలినవాళ్ళంతా పెళ్ళికి వెళ్ళారు.

ఎన్నడూ లేనిది, ఏమైందో ఏమో, ఆ రోజున చెక్క కొడుతూండగా కర్ర జారి, వెంకటయ్య క్రింద పడ్డాడు. కాలికి మేకు గుచ్చుకొని పెద్ద గాయం అయ్యింది. "తనని ఆసుపత్రికి తీసుకుపోయేందుకు కూడా ఎవ్వరూ లేరు" అని బాధ వేసింది అతనికి. "అంత బాధ్యత లేకుండా వదిలేసి వెళ్ళారు. వాళ్ళెవరైనా వచ్చే వరకూ నేను ఆసుపత్రికి పోనే పోను" అని, గాయానికి సొంత కట్టు కట్టుకున్నాడు, వెంకటయ్య.

తీరా వంట చేసుకుందామని చూస్తే, పొయ్యిలోకి కట్టెలు లేవు. వాళ్ళ ఇంటికి దగ్గర్లోనే ఓ అడవి ఉంది. అక్కడికి వెళ్లి పుల్లలు తెద్దామని, గాయమైన ఆ కాలితోనే కుంటుకుంటూ అడవిలోకి వెళ్ళాడు వెంకటయ్య. అక్కడ విరిగిన ఎండు కొమ్మలని పట్టుకోగానే, ఎన్నడూ లేనిది అవి కాస్తా విరిగి మీద పడ్డాయి! కాలికి మళ్ళీ గాయాలు అయ్యాయి. ఆ చుట్టుప్రక్కల మనుషులు కూడా ఎవ్వరూ లేరు- దాంతో అతనికి వెనక్కి నడిచి రాక తప్పలేదు.

ఊరి శివార్లలోనే ఓబులయ్య వాళ్ల ఇల్లు ఉన్నది. కాలునొప్పికి తట్టుకోలేని వెంకటయ్య, ఆ ఇంటి బయట అరుగు మీదే విశ్రాంతిగా కూర్చున్నాడు .

సరిగ్గా అప్పుడే ఆ అరుగు ముందు ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్య కొట్లాట మొదలైంది. చూస్తూండగానే మంది జమ అయ్యారు అక్కడ. వ్యక్తుల మధ్య పోట్లాట కాస్తా వర్గాల మధ్య గొడవగా పరిగణించింది. ఆ గొడవలో ఎవరో విసిరిన కర్ర ఒకటి ఎగిరి వచ్చి, వెంకటయ్యకు తగిలింది! 'గొడవలు జరిగే చోటుకు పోవద్దు! అని చిన్నప్పుడు అమ్మ నాన్న ఎంత ముద్దుగా చెప్పారు; నేను విననేలేదు" అని బాధ పడ్డాడు వెంకటయ్య, కొంచెం ముందుకు వెళ్ళి ఓ చెట్టు క్రింద కూర్చుంటూ.

అట్లా దూరంగా కూర్చొని, కర్ర తగిలిన చోట కట్టు కడుతూనే, ఇంకా కొనసాగుతున్న గొడవను గమనించటం మొదలు పెట్టాడు అతను. ఆలోగా గొడవ ఇంకాస్త పెద్దదైంది. ఒక దశలో "ఇది బాగా పెద్దదవుతోంది- పోలీసులు వస్తారేమో!" అని అనుమానం వచ్చింది అతనికి. అయితే అక్కడినుండి పోవాలని అతను అరుగు దిగేలోపే పోలీసులు వచ్చి చేరారు; అక్కడున్న వాళ్లందరినీ పట్టుకొని వ్యాను ఎక్కించారు! ఆ పరిసరాల లోనే, చెట్టు క్రింద గాయాలతో ఉన్న వెంకటయ్యను చూసి, "వీడు కూడా గొడవ వాడే అయి ఉంటాడు!" అని అతన్ని కూడా పట్టుకొని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారు.

"అయ్యో! అనవసరంగా పోలీస్‌స్టేషన్‌కి వెళ్ళాల్సి వచ్చింది!" అని మొదట కోపం తెచ్చుకున్న వెంకటయ్య, చివరికి తనకుతానుగా శాంతపడి, పోలీసుల్ని బ్రతిమాలుకొని, మెల్లగా ఇల్లు చేరుకోవాల్సి వచ్చింది.

వచ్చేసరికి ఇంటి తలుపులు బార్లా తెరచి ఉన్నాయి! "మా వాళ్ళు వచ్చేసినట్లున్నారు!" అని సంతోషంగా లోనికి అడుగు పెట్టిన వెంకటయ్యకు పై ప్రాణాలు పైనే పోయాయి! ఇంటిని దోస్తున్న దోపిడీ దొంగలు అతన్ని చితక బాది, కొస ప్రాణాలతో వదిలారు! "నాకు సమయం బాగా లేదు! ఏం చేసినా ఎదురు తిరుగుతున్నది" అని నిరాశపడ్డాడు వెంకటయ్య. ఆ నిరాశలోనే వాడు గమ్యం తెలీకుండా నడుస్తూ అడవిలోకి పోయాడు. అక్కడ వాడికి అకస్మాత్తుగా ఏవో గొంతులు వినబడ్డాయి. చూడగా వాళ్ళు తన ఇంటిని దోచుకున్న దొంగలే! వెంకటయ్య వణికిపోతూ, అక్కడికి దగ్గర్లోనే ఉన్న ఓ మర్రి చెట్టు ఎక్కి కూర్చుని స్పృహ తప్పిపోయాడు.

ఎంత సేపు అట్లా ఉన్నాడో తెలీదు- తిరిగి అతనికి మెలకువ వచ్చే సరికి దొంగలు ఏవో మూటలు ఎత్తుకొని, అతను ఎక్కి ఉన్న చెట్టు దగ్గరికే చేరుకుంటున్నారు! కొమ్మల సందుల్లోనుండి వెంకటయ్య చూస్తూండగానే అందరూ ఆ మూటల్ని చెట్టు తొర్రలో పెట్టుకొని వెళ్ళిపోయారు! వాళ్ళు వెళ్ళాక చాలా సేపటికి గాని వెంకటయ్యకు క్రిందికి దిగి వచ్చేందుకు ధైర్యం చాలలేదు. తర్వాత మెల్లగా మూటలు విప్పి చూస్తే వాటి నిండా నగలు, సొమ్ములు!

"అంత సొమ్మును ఏం చేయాలి, దాన్ని ఇంటికి ఎట్లా చేరవేయాలి?" అని ఆలోచించిన వెంకటయ్య, చివరి నిముషంలో మనసు మార్చుకొని, పోయి, పోలీసులకు కబురందించాడు. పోలీసులు ఆ మూటల్ని స్వాధీనం చేసుకోవటమే కాక, వాటికోసం తిరిగి వచ్చిన దొంగల్ని కూడా పట్టుకున్నారు!

అట్లా 'సమయం బాగాలేదు' అని చిన్నబోయిన వెంకటయ్యకు తమ సొమ్ములు తిరిగి దక్కటమే కాక, అదనంగా పోలీసులు ఇచ్చిన బహుమతులు కూడా లభించాయి!