నమస్తే! నా పేరు రాజేష్. నేను చిప్పగిరిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను, మా అమ్మ పొద్దున్నే పొలానికి వెళ్తుంది; మా నాన్న ఆఫీసుకు వెళ్తారు. నేను బడికి వెళ్లి చదువుకుంటాను. మా క్లాస్‌లో నేనేమీ మొదటి ర్యాంకర్‌ను కాదు; కాకపోతే బాగానే చదువుతాను. ఆటలు కూడా బాగానే ఆడుతాను. మా బడిలో ఉన్న ఉపాధ్యాయులందరూ నన్ను బాగా ప్రోత్సహిస్తారు.
కానీ మా ఇల్లు చాలా చిన్నది. అందుకని నేను మా ఊరికి చివర్లో ఉన్న కొండనెక్కి అక్కడ కూర్చొని చదువుకుంటాను. అక్కడ ఏవైనా చెట్ల క్రింద గడ్డిలో కూర్చోటం, రక రకాల జంతువుల్ని, పక్షుల్ని చూస్తూ చదువుకోవటం బాగుంటుంది. మా బడిలో కూడా చాలా రకాల మొక్కలు ఉన్నాయి. అందులో నాది కూడా ఒక మొక్క ఉంది! నేను దానికి రోజు నీళ్ళు పోస్తాను కూడా!.
మా తెలుగు పండితులకు ఒక కోరిక ఉండేది. అది ఏంటంటే, 'మా బడిలోంచి మూడు వందల మంది విద్యార్థులు ఒకేసారి వంద వేమన పద్యాలు గానం చేస్తుంటే వినాలి' అని.
మేమందరం 'సరే సర్' అన్నాం ఉత్సాహంగా. తెలుగు అయ్యవారు ఒక పెద్ద పేజీ నిండా పద్యాలు రాసి, ఫొటో కాపీ చేసి, మాకు అందరికీ తలా ఒకటీ ఇచ్చారు. అందులో 28 పద్యాలు మాత్రమే ఉన్నాయి. అందులో కొన్ని పద్యాలు మాకు అంతకు ముందే నోటికి వచ్చు! అందుకని అందరం వాటిని త్వరగానే నేర్చుకున్నాము.
అయితే వాటి తర్వాతి పద్యాలు రాసిన పేపరును మాకు ఇవ్వలేదు అయ్యవారు. మా క్లాస్ లీడరుకు మాత్రమే ఇచ్చి, "అందరూ వాటిని చూసో, చెప్పించుకొనో రాసుకోండి" అన్నారు. "ఎందుకట్లా?" అని ఆశ్చర్యపోతుంటే అయ్యవారే చెప్పారు: "మొదటి ఇరవై ఎనిమిదీ మన మెదడులోకి తొందరగానే పోతాయి; కానీ ఇప్పుడిచ్చేవి వాటికి అదనం కదా, అందుకని అంత సులభంగా ఎక్కవు- గుర్తు పెట్టుకునే సామర్థ్యాన్ని 'ధారణ' అంటారు. మన 'ధారణ శక్తిని 'మనమే, ప్రయత్నించి వృద్ధి చేసుకోవాలి. 'మనసు పెట్టి జాగ్రత్తగా, ఒక్కసారన్నా రాయటం' అనేది ఐదుసార్లు పైపైన చదవటం కంటే మెరుగు' అని చెబుతారు. అందుకని మీరు మనసు పెట్టి రాసారనుకోండి, ఈ ఇరవై ఎనిమిదీ కూడా త్వరగా నోటికి వచ్చేస్తాయి!" అని.
మేమందరం ఆ పద్యాల్ని చూసి రాసుకున్నాం, మా రఫ్ నోట్సుల్లో.
ఆ మరుసటిరోజు సెలవు వచ్చింది. "ఈ రోజు సెలవు కదా! పద్యాలన్నీ నేర్చేసుకుంటాను" అనుకుంటూ కొండ పైకి వెళ్లాను. ఒక్కో పద్యాన్నీ గొంతెత్తి రాగం పెట్టి పాడుకుంటూ పోయాను. గట్టిగా పాడితే పద్యాలు చాలా తొందరగా వచ్చేస్తాయి! అట్లా కొద్ది సేపటికే నాకు చాలా పద్యాలు వచ్చేసాయి!
అయితే ఎందుకనో, ఆ రోజు కొండ ఎక్కేందుకు చాలామంది పిల్లలు, పెద్దవాళ్ళు, గుంపులు గుంపులుగా వచ్చారు. వాళ్ల ముందు నేను ఇంక గట్టిగా పాడలేను కదా, అందుకని నోరు మూసుకొని, ఒక మూలన కూర్చుని, మనసులోనే చదవటం మొదలు పెట్టాను. ఒక పద్యం నేర్చుకునేందుకు పది పది సార్లు చదవాల్సి వచ్చింది. రెండు మూడు పద్యాలు నోటికి వచ్చేసరికి ఆవలింతలు కూడా మొదలైనాయి!
అంతలో అక్కడికి ఒక సాధువు వచ్చాడు. ఆయనకు చాలా మంత్రాలు వచ్చు. ఆయన వెనకనే రకరకాల జంతువులు- ఒక యాభైయో, వందో వచ్చాయి. వాటిలో కోళ్ళు, గొర్రెలు, మేకలతో బాటు గుర్రం, ఏనుగు, ఎలుగు బంటి లాంటివి కూడా ఉన్నాయి!
ఆయన నా ప్రక్కనుండే నడచుకుంటూ కొండ ఎక్కి పోయాడు, కానీ ఆయన వెనక వచ్చే జంతువులు మాత్రం ఒక్కటొక్కటిగా నా చుట్టూ ఆగాయి. ఎందుకనో. నాకు వాటిని చూసి భయం వేసింది. వాటిలోంచి ఎలుగుబంటి నా దగ్గరకు వచ్చి- " నీ రఫ్‌నోట్సు ఇటు ఇవ్వు" అంది.
నాకు చాలా ఆశ్చర్యం వేసింది: 'ఎలుగు బంటి తెలుగులో మాట్లాడటం ఏంటి, రఫ్‌నోట్సు అడగటం ఏంటి?' గబగబా నా చేతిలో ఉన్న రఫ్ నోట్సును దాని చేతికి ఇచ్చాను. అది దాన్ని చూసుకుంటూ ఒక్కొక్క పద్యాన్నే రాగంతో సహా పాడటం మొదలు పెట్టింది.
అది అట్లా పాడగానే కోతి కూడా మొదలు పెట్టింది. అంతలోనే ఎక్కడినుండో ఎగురుకుంటూ వచ్చిన రామచిలుక, అది కూడా మొదలు పెట్టింది- ఆ పద్యాలు అన్నిటినీ చూడకుండానే పాడింది! చూస్తూ చూస్తూ ఉండగానే చాలా జంతువులు వేటికవి, వేమన పద్యాలు పాడటం మొదలు పెట్టాయి.
అదంతా చూస్తూంటే నాకు ఎంత ఆనందం అనిపించిందో, నేను మాటల్లో చెప్పలేను. 'నా తెలుగు భాష ఎంత గొప్పది! అమ్మ భాష ఎంత కమ్మనిది!' అంటూ పద్యాల పోటీలో పాల్గొని, విజేత నయ్యాను. బహుమతిని అందుకుంటూ కేరింతలు కొట్టాను!" అంతలో నా చేతులు మా అమ్మకు తగిలినట్లున్నాయి, తను లేచి కూర్చుని "ఏమిరా! నిద్రపోతూనే డాన్సు చేస్తున్నావు?! కలవ- రించుకుంటున్నావా, నిద్రలో?" అని గట్టిగా అరిచింది.
గబుక్కున మెలుకువ వచ్చింది: చూస్తే మంచంపైన మా అమ్మ దగ్గర పడుకుని ఉన్నాను!
అయితే ఆ తర్వాత నాకు పద్యాలు అన్నీ చాలా త్వరగా వచ్చేసాయి- అంతకు ముందు అవన్నీ కలలో నేర్చుకున్నవేగా, అందుకనే కావచ్చు!