అనగనగా ఒక రోజు రాత్రి వాన పడింది. ఆ వానలో ఒక పులి తడిసి ముద్దై, వణుక్కుంటూ ఒక ఇంటి దగ్గరకు వచ్చింది. అప్పట్లో వెంగళప్ప ఒక చాకలిగా ఉండేవాడు.

తాగి ఉన్న వెంగళప్ప ఆ పులిని చూసి తన గాడిదే అనుకున్నాడు. "నువ్వు ఇక్కడున్నావా, నీకోసం నేను ఊరంతా‌ తిరిగానే!" అని దాన్ని తిట్టి, చెవి పట్టుకుని ఇంటికి లాక్కెళ్ళాడు.



అసలే సగం చచ్చి ఉన్నది పులి. దానికి తిరగబడేంత శక్తి కూడా లేదు.

ఇంకేమీ చెయ్యలేక అది నోరు మూసుకొని వాడి వెంట వెళ్ళి, గాడిద స్థానంలో కూర్చున్నది.

తెల్లవారు జామున వెంగళప్ప భార్య తలుపు తెరిచి, గాడిద స్థానంలో కూర్చొని ఉన్న పులిని చూసి, భయంతో కేకలు వేసింది.



వెంగళప్పని లేపి, "పులిని కట్టేసావేంటి?" అని అడిగింది. రాజ భటులకు, జంతుశాఖ వారికి కబురు వెళ్ళింది. వాళ్ళు వచ్చి పులిని బంధించి తీసుకెళ్ళారు.

అంతలో రాజుగారికి మన వెంగళప్పని చూస్తే ముద్దు వేసింది.



"అంత పెద్ద పులిని ఆయుధం లేకుండా పట్టుకొచ్చాడు! ఇక వాడి దగ్గరే ఆయుధం ఉంటే, ఇంక ఎదురేముంటుంది?!" అనుకున్నాడు. వెంటనే వెంగళ్‌ని తన సేనాధిపతిగా చేసుకున్నాడు.

ఐదు రోజులకే శత్రువులు పెద్ద సైన్యం వెంటపెట్టుకొని యుద్ధానికి వచ్చారు. రాజుగారు కులాసాగా నవ్వి, "మా సేనాధిపతి ఒక్కడే చాలు- వాళ్లందరికీ బుద్ధి చెప్పేందుకు!" అని వెంగళప్పకి ఓ గుర్రం ఇచ్చి, దీవించి, "ఇకపోయి, విజయంతో తిరిగి రా!" అని పంపించేసాడు.


వెంగళప్పకేమో, మరి, గుర్రం ఎక్కటం కూడా రాదు. నానా కష్టాలు పడి, చివరికి ఎట్లాగో వెనక్కు తిరిగి ఎక్కి, కళ్ళు మూసుకొని, కళ్ళెం గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. గుర్రం తన అలవాటు కొద్దీ యుద్ధరంగం వైపుకు పరుగు తీసింది.

కళ్ళు తెరిచిన సేనాపతి ఇప్పుడు దాన్ని ఆపేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. అంతలో అది ఒక తాడిచెట్టు క్రిందుగా వెళ్ళింది.

ధైర్యం తెచ్చుకున్న వెంగళ్ గుర్రం మీది నుండి తాటి చెట్టు మీదికి దూకి, దాన్ని కౌగలించుకున్నాడు. ఆ అదురుకి తాటిచెట్టు ఊగటం, దాని పైనున్న కల్లుకుండ ఒకటి జారి గుర్రం తలమీద పడటం అకస్మాత్తుగా జరిగిపోయాయి. కళ్ళు కనపడని గుర్రం గిరగిరా‌ తిరుగుకుంటూ శబ్దం ఎటు వినబడితే అటు దూక్కుంటూ పోయింది.


శత్రువులు దాన్ని చూసి జడుసుకున్నారు. "రాక్షసుడురోయ్! పారిపోండి!" అని చెల్లా చెదరైపోయారు.

నడుచుకుంటూ వెనక్కి తిరిగొస్తున్న సేనాపతిని చూసి ఊళ్ళోవాళ్లంతా పూలవర్షం కురిపించారు.

కానీ ఆ సరికి బుద్ధి వచ్చిన వెంగళప్ప రాజుగారికి దండం పెట్టి, ఏం జరిగిందో వివరిస్తుంటే సభలో వాళ్లంతా కడుపుబ్బ నవ్వారు.

"ఆ శత్రువులెవరో పిరికివాళ్ళు కాబట్టి సరిపోయింది- లేకపోతే ఇంకేమీ ఉండకపోవును! నాకు ఇంక ఈ పని వద్దు ప్రభూ! నన్ను వదిలేస్తే వెళ్లి బుద్ధిగా నా చాకలి పని నేను చేసుకుంటాను" అని ప్రాథేయపడ్డాడు వెంగళప్ప!

అర్థం చేసుకున్న రాజుగారు కూడా నవ్వుతూ సరేనన్నారు!