రంగడు ఓ గజదొంగ. దొంగతనాలే వృత్తి, ప్రవృత్తులు వాడికి. రక్షకభటులకు దొరకకుండా తిప్పలు పెడుతూ, ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాడు.
ఒక రకంగా చూస్తే అవసరమే ఆ యువకుడిని దొంగగా మార్చింది అనచ్చు. అతను చక్కగా చదువుకుంటున్న రోజుల్లో తండ్రి పోయాడు; కుటుంబ భారం మొత్తం అతని తలపై పడింది; సంపాదనా మార్గాలు గగనమయినాయి. సరిగ్గా ఆ సమయంలోనే అతనికి ఒక గజదొంగతో స్నేహం కుదిరింది. దొంగదారి పట్టాడు; పుష్కలంగా ధనం సంపాదించాడు. వాడి సంపాదనని చూసిన తల్లికి అర్థమైంది- కొడుకు దారితప్పాడని. అయినా ఆమె ఉదాసీనంగా ఉండిపోయింది తప్ప, కొడుకుని సంస్కరించడానికి ప్రయత్నించలేదు.
అవి పండుగ రోజులు. ఊరు అంతా సంబరాల్లో మునిగి ఉంది. ఇళ్ళు దోచుకోవడానికి చాలా అనువైన సమయం. రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతాన ఒక సంపన్నుడి ఇల్లు దోచుకొని, ఇంటి కప్పులమీదనుంచి పారిపోతూ ఉన్నాడు రంగడు.
అనుకోకుండా వాడి కాలు జారింది! దొర్లుకుంటూ పోయి ఒక దేవాలయ ప్రాంగణంలో పడ్డాడు. ఆ పడటంలో వాడి కాలు బెణికింది; మోకాళ్లు దోక్కుపోయాయి. అయినా వాడు పడిన చోటు చీకటిగా ఉండటం వల్లనో ఏమో, ఎవరూ వాడిని గమనించలేదు.
ఆ సమయంలో మహాత్ముడొకాయన గుడిలో భాగవతం చెబుతున్నాడు. "భగవంతుడిని శరణుజొచ్చిన వాడికి ఇక దు:ఖం ఉండదు. సంపూర్ణ శరణాగతి మనిషిని అన్ని బంధాలనుండి విడుదల చేస్తుంది.." అంటూ.
రంగడికి దొంగతనాలు నేర్పిన గురువు వాడికి ఏనాడో చెప్పి ఉన్నాడు: "ఎట్టి పరిస్థితుల్లోనూ నీతి బోధలు జరిగే ప్రదేశాలకు వెళ్ళొద్దు" అని. అయినా అసంకల్పితంగా కొన్ని నీతి వాక్యాలు, ఇలా వాడి చెవిన పడ్డాయి. అట్లాంటి మంచి సంగతులు జీవితంలో ఏనాడూ విని ఉండని రంగడికి అవన్నీ అద్భుతంగా అనిపించాయి!
కొంత సేపటికి ప్రవచనం పూర్తయింది. జనాలు ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఎవ్వరూ లేని జాడ చూసి, రంగడు మెల్లగా కుంటుకుంటూ ఆ మహాత్ముడి దగ్గరికి పోయాడు. వాడిని చూసి ఆదరంగా నవ్వాడాయన. రంగడు ఆయనతో " అయ్యా! అనుకోకుండా నేను ఇవాళ్ల మీ ప్రవచనం విన్నాను. భగవంతుడికి పాపాత్ములు, పుణ్యాత్ములు అనే తేడా లేదన్నారు. ఎవరు శరణాగతి చెందితే వారిని ఆయన అనుగ్రహిస్తాడన్నారు. నిజమేనా?" అని అడిగాడు.
ఆయన తల ఊపుతూ "పూర్తిగా నిజం నాయనా! కానీ ఆయన అనుగ్రహం కావాలంటే మనలోని దుర్గుణాలను వదిలిపెట్టాలి" అన్నాడు.
రంగడు గట్టిగా నవ్వి, ఆయనతో "స్వామీ! నా పేరు రంగడు. నేనొక పెద్ద దొంగను. రాత్రిళ్ళు ప్రజల్ని దోచుకుంటాను; పగటి పూట జూదగృహానికి వెళ్ళి జూదం ఆడుతాను; ఇష్టం వచ్చినప్పుడల్లా సారాయి తాగుతూ విలాస జీవితం గడుపుతాను.
విపరీతంగా అబద్ధాలు చెప్తాను. మీరు చెబుతున్న ప్రకారం చూస్తే మరి నాలాంటి దుష్టుడిని దేవుడు కూడా ఉద్ధరించలేడన్న మాట!" అన్నాడు.
"అంత నిరాశ అవసరంలేదు నాయనా! చింత పడనక్కర్లేదు. నీ ఈ దుర్గుణాల్లో ఏ ఒక్కదాన్నైనా దైవం కోసం ఒదులుకోగలవా, నువ్వు?" అని అడిగాడు మహాత్ముడు.
"మిగతావేవీ ఒదులుకునే అవకాశం లేదు స్వామీ, నాకు- కానీ ఒక్క అబద్ధాల్ని మటుకు మానేస్తాను. నిజం చెప్పాలంటే అబద్ధాల వల్ల నాకు వస్తున్న లాభం ఏమీ లేదు; నిజం చెప్పడం వల్ల నాకొచ్చే నష్టం కూడా ఏదీ లేదు" అన్నాడు రంగడు, కొద్దిగా ఆలోచించి.
"అది చాలు నాయనా! భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఈ రోజునుండి ఎల్లప్పుడూ సత్యమే పలుకు!" అన్నాడు మహాత్ముడు.
"భగవంతుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను- ఈ రోజు నుండీ ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడతాను" అని ఆయనకు మాటిచ్చి, వెడలిపోయాడు రంగడు.
తరువాత కొద్ది రోజులకే వాడు రాజుగారి ఖజానాకు కన్నం వేసాడు! ఖజానా నిండుగా బంగారు నాణాలు, నగలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి అలికిడీ లేదు.
'ఇంత సొమ్మును తీసుకెళ్ళటం వృధా. మొత్తం ఎత్తుకెళ్తే భటులనుండి తప్పించుకోవటం కూడా కష్టమౌతుంది' అని ఆలోచించి, వాడు కొన్ని బంగారు నాణాలను, నగలను మూటగట్టి తీసుకుపోబోతూ, తలుపు ప్రక్కగా ఓ పీఠం మీద ఉంచిన బంగారు పెట్టెనొకదాన్ని చూసాడు. దాన్ని తెరిచి చూస్తే ధగధగా మెరుస్తూ కనిపించినై, నాలుగు వజ్రాలు! వాటిలోంచి కూడా రెండింటిని తీసి జేబులో వేసుకొని, చప్పుడు చేయకుండా బయటికి నడిచాడు రంగడు.
వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు కూడా వాడికి కావలివాళ్ళెవ్వరూ ఎదురుపడలేదు గానీ, తను వేసిన కన్నం పరిసరాలలోనే అపరిచితుడొకడు కనపడ్డాడు. చూసేందుకు వాడూ ఓ చిన్నపాటి దొంగలాగా ఉన్నాడు- వాడు రంగడిని ఆపుతూ "ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఏంచేసావు?!" అని అడిగాడు గద్దిస్తూ.
"నువ్వెవరసలు, నన్ను ఆపేందుకు?" ఒకింత భయంగాను, ఒకింత కోపంతోటీ ప్రశ్నించాడు రంగడు.
"నీలాగే నేనూ ఒక దొంగను. కనిపించట్లేదా? మర్యాదగా నువ్వు దోచుకున్న దానిలో సగం నాకివ్వు. లేకపోతే ఇప్పుడే అరిచి రాజభటుల్ని రప్పిస్తాను!" బెదిరించాడు వాడు.
"సరేలే, ఈ సొమ్ములో నీదీ ఒక సగం! సరేనా? ఇక అరవకు. కావలివాళ్ళు వస్తుంటారు.. చప్పుడు చేయకుండా బయట పడదాం ఇద్దరం!" అన్నాడు రంగడు వాడితో చేతులు కలుపుతూ.
తోడుదొంగలు ఇద్దరూ చకచకా కన్నంలోంచి బయటపడి, రంగడి ఇల్లు చేరుకున్నారు.
ఇచ్చిన మాట ప్రకారం రంగడు తను దోచుకొచ్చిన సొమ్మును రెండు సమాన భాగాలు చేసాడు. నీకు ఏది కావాలో అది తీసుకో, రెండవది నాది. తీసుకున్నాక ఇక వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. నీకు-నాకు ఇక ఏలాంటి సంబంధమూ ఉండదు" చెప్పేసాడు.
వాడు ఒక భాగాన్ని ఎంచుకొని అక్కడినుండి సంతోషంగా వెళ్ళిపోబోయాడు.
రంగడు వాడిని ఆపి- "ఈ సొమ్ములు కాక నేను ఇవిగో, ఇంకో రెండు వజ్రాలు కూడా తెచ్చాను- అక్కడినుండి. ఒకటి నీకు, ఒకటి నాకు. సరిపోయింది. ఇక వెళ్ళు!" అని వజ్రాలు రెండూ వాడికి చూపి, ఒక వజ్రాన్ని వాడి చేతిలో పెట్టి పంపించాడు.
తర్వాతి రోజు ఉదయాన్నే రాజభటులు రంగన్న ఇంటిని చుట్టు ముట్టి అతన్ని బంధించారు. సొత్తుతో సహా రాజుగారి ముందు ప్రవేశ పెట్టారు.
"నువ్వేనా రంగడివి? మా కోశాగారానికి కన్నం వేసిన దొంగవు నువ్వేనా?" అడిగారు రాజుగారు.
రంగడు తల ఊపాడు. "నేనే రంగడిని. ఖజానాకు కన్నం వేసిందీ నేనే" అన్నాడు.
"వీడు ఎత్తుకెళ్ళినవి మొత్తం దొరికాయా?" కోశాధికారిని అడిగాడు రాజు.
"ఇంకా చాలా ఉండాలి ప్రభూ!" పట్టికనందిస్తూ చెప్పాడు కోశాధికారి.
"ఏం చేసావు మిగిలినవాటిని?" రాజు అడిగాడు రంగడిని. రంగడు ఒక్క క్షణం ఆగాడు- "అవి మీకు దొరకవు. మొత్తానికీ శిక్ష నాకే వేయండి" అన్నాడు తాపీగా.
"ఎందుకు దొరకవు?" అడిగాడు రాజు. "నీ తోడుదొంగలతో పంచుకొని ఉంటావు. అంతేగా? వాళ్లనీ పట్టుకుంటాం! ఎవరు వాళ్ళు? ఎక్కడుంటారు?" గర్జించాడు.
"ఒక్కడే ఉన్నాడు- అయినా వాడెవడో నాకు తెలీదు- సొత్తుని మేమిద్దరం సమానంగా పంచుకున్నాం" చెప్పాడు రంగడు. సభలో అధికారులంతా నవ్వారు.
"నీ తోడుదొంగ ఎవరో నీకు తెలీదా? ఒరే, మర్యాదగా వివరాలు అందించు, ప్రభువులవారికి కోపం తెప్పిస్తే ఏమౌతుందో నీకు తెలీదు" హెచ్చరించాడు కోశాధికారి.
"నేను అబద్ధాలు చెప్పనని ప్రమాణం చేసాను. అబద్ధం ఆడను. నిజంగానే వాడెవరో నాకు తెలీదు" అన్నాడు రంగడు.
"దొంగట! అబద్ధాలు చెప్పడట! నీతిమంతుడు!!" వెటకరించారొకరు.
"ప్రభూ! వీడిని మాకు అప్పగించండి. నిజం కక్కిస్తాం!" ఆవేశంతో ఊగిపోయాడు కోశాధికారి.
"అవసరం లేదు. ఎవరక్కడ- మా మందిరంలో మూలగా ఒక మూట ఉంటుంది- దాన్ని తీసుకురండి!" భటుల్ని ఆదేశించారు రాజుగారు.
నిజంగానే రాజమందిరంలో ఒక మూట కనబడింది. భటులు దాన్ని తీసుకొచ్చి రాజుగారి ముందు పెట్టారు.
"ఇదేగా? నీ తోడు దొంగతో పంచుకున్నది?!" వెటకారంగా నవ్వి, "దీన్ని కూడా కలుపుకొని లెక్క సరిచూడండి!" కోశాధికారిని ఆదేశించాడు రాజు.
"ఇది మీకెక్కడ దొరికింది?" రాజుగారిని పరిశీలనగా చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచాడు రంగడు.
అంతలో కోశాధికారి లెక్క చూసి చెప్పాడు- "ఇంకో మూడు వజ్రాలుండాలి ప్రభూ!" అని.
రాజుగారు రంగడితో కఠినంగా "నువ్వు ద్రోహివి, అబద్ధాలకోరువి కూడా! మిగిలిన రెండు వజ్రాలూ ఏవి?" అన్నాడు. "ప్రభూ! మూడు వజ్రాలు!" సరిచేసాడు కోశాధికారి.
"లేదు- నేను తీసుకెళ్ళింది రెండే వజ్రాలు! నేను అబద్ధాలు చెప్పను! రెండు వజ్రాల్ని అక్కడే పెట్టెలో వదిలేసి వెళ్ళాను!" మొండిగా అన్నాడు రంగడు.
"ఒకటే దొరికింది. ఇంకా నువ్వు ఎత్తుకెళ్ళినవి మూడు వజ్రాలు రావాలి!" అరిచాడు ఒక భటుడు.
"వీడిని మాకు అప్పగించండి ప్రభూ! అన్నింటినీ కలిపి కక్కిస్తాం!" కోపంగా అరిచాడు కోశాధికారి. సభలో వాళ్లంతా
"అవును!అవును!" అని అరిచారు.
"అవసరం లేదు. ఇదిగో, మరొక వజ్రం! ఇక మీరు దొంగిలించిన రెండు వజ్రాలనూ తక్షణం మాకు సమర్పించండి!" తన జేబులోనుండి ఒక వజ్రాన్ని తీసి ఇస్తూ కోశాధికారిని ఆజ్ఞాపించారు రాజుగారు.
నోటమాటరాని కోశాధికారి బిత్తరపోయాడు. తల వంచుకొని నిలబడిపోయాడు. అకస్మాత్తుగా సభలో నిశ్శబ్దం అలుముకున్నది. భటులు కోశాధికారిని సోదా చేస్తే మిగిలిన రెండు వజ్రాలూ బయటపడ్డాయి.
"గాదె కింద పందికొక్కు, మన ఈ కోశాధికారి! ఇలాంటి ఇంటి దొంగలను క్షమించకూడదు. ఇతనికి పదేళ్ల కారాగార శిక్ష విధిస్తున్నాం" తీర్పునిచ్చారు రాజుగారు.
నిర్ఘాంతపోయిన సభికులకు సంగతి యావత్తూ వివరించారు రాజుగారు- "ఈ రంగడు దొంగే అయినా నిజంగా సత్యవాది.
కొన్నాళ్ళ క్రితం మన గుడిలో గురువుగారిచ్చిన ప్రవచనం విన్నాక, వీడి మనసు కరిగింది. 'మిగిలిన తప్పులు ఏవైనా చేస్తానుగానీ, అబద్ధం మటుకు ఆడన'ని ప్రమాణం చేసాడు ఇతను! ఆ సమయంలో నేను మారువేషంలో అక్కడే ఉన్నాను; నాటినుండీ ఇతన్ని గమనిస్తూ వచ్చాను!
నిజంగానే వీడు అబద్ధాలు ఆడటంలేదని గ్రహించాను. వాడిని పరీక్షించేందుకే, మన ఖజానాకు వాడు కన్నం వేయబూనినప్పుడు, ఆ మార్గాన్ని కూడా సుగమం చేసాను.
దొంగిలించి బయటికి రాగానే వాడికి ఆగంతకుడిగా ఎదురై, తోడుదొంగ వేషం వేసిందీ, ఇంటికి వెళ్ళి వాడితో వాటాలు పెట్టుకున్నదీ కూడా నేనే. ఆ సమయంలో కూడా వాడు మాట నిలుపుకొని, సొత్తుని సమానంగా పంచి ఇచ్చాడు. వాడు దొంగిలించింది రెండు వజ్రాలేనని నాకు ఆ సమయంలోనే తెలుసు!
ఇక కొద్ది కాలంగా మన ఖజానా లెక్కల్లో తేడాలు వస్తున్నాయి.. కోశాధికారిలో నిజాయితీ కొరవడిందని అనుమానం ఉండింది. రంగడిని సాకుగా చేసుకొని, అమూల్యమైన వజ్రాలను రెండింటిని దోచుకోబోయి, అడ్డంగా దొరికిపోయాడు మన ఇంటిదొంగ!.. ఇప్పుడిక ఈ రంగడికి శిక్ష విధించాల్సి ఉంది" అగారు రాజుగారు.
అందరూ ఆసక్తిగా చూసారు.
"నిజాయితీగల రంగడిని మన ఖజానాకు ముఖ్య కాపలా అధికారిగా నియమిస్తున్నాం. కాలాంతరంలో మనకు కోశాధికారి కూడా అయ్యే అవకాశాన్నిస్తాం. అతనికి ఈ శిక్ష నేటినుండే అమలులోకి వస్తుంది" ప్రకటించారు రాజుగారు. సభికులంతా హర్షధ్వానాలు చేసారు. ఈసారి ఆశ్చర్యపోవటం రంగడి వంతయింది.
"ఒక్క దుర్గుణం దూరం చేసుకుంటేనే భగవంతుడు తనకి ఇంతటి అవకాశం ఇచ్చాడే, మరి పూర్తిగా సన్మార్గం అవలంబించి, సంపూర్ణంగా శరణాగతి చెందితే మరెంత కృపావర్షం కురిపిస్తాడో కదా!" అనిపించింది వాడికి. సంతోషంతో కన్నీళ్ళ పర్యంతమై చేతులు జోడించాడతడు.
ఆ క్షణాన అతనిలో మొదలైన పరివర్తన అతన్ని ఆదర్శప్రాయుడయిన పౌరునిగా మార్చింది!