సుదర్శన్ అని, పూర్వ విద్యార్థి గుర్తు చేసిన కథ ఇది. అనగనగా ఓ శివాలయం ఉండేది. దాని పూజారి శంకరశాస్త్రి, గొప్ప పుణ్యాత్ముడు. "ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం త్రాగితే అనేక రోగాలు నయమవుతాయి" అని చెప్పుకునేవాళ్ళు జనం.

ప్రతిరోజూ ఆయన చేతిమీదుగా తీర్థం, విభూతి స్వీకరించటం కోసం చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లోంచి భక్తులు వస్తూండేవాళ్ళు. ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. "స్వామీ, ఏ రోజుకారోజు నీ రాక కోసం ఎదురు చూడటం తప్పిస్తే, మరింకేవీ నాకు తృప్తినివ్వటం లేదు. నన్ను నీతో తీసుకొని పోరాదా?" అని అడిగాడు శంకరశాస్త్రి, ఆయనకు నమస్కరిస్తూ.

శివుడు నవ్వి, "దానికోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉన్నది" అంటూ తన చేతిలో ఉన్న మట్టిపాత్రను అతని చేతిలో పెట్టాడు-

"ఇదిగో, ఈ మట్టి పాత్రను చూసావు కదా; ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారం లాగా మెరుస్తుందో, అట్లాంటి వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట. వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కర్మలు. ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుష్షు, ఆ తర్వాత నా సాన్నిధ్యం లభించనున్నాయి" అని చెప్పేసి, మాయమైపోయాడు శివుడు.

మొదట 'ఇదేదో అద్భుతమైన కల' అనుకున్నాడు గానీ; ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ఓ మట్టిపాత్ర కనిపించింది శంకరశాస్త్రికి. ఆయన చాలా భక్తిగా ఆ మట్టిపాత్రను తాకి చూసాడు: అది రంగు మారలేదు! అయితే స్వతహాగా మంచివాడైన శంకరశాస్త్రి అందుకు బాధపడలేదు. "నేను ఇంకా పుణ్యం‌ సాధించాలి అని తెలియజేసేందుకుగాను భగవంతుడు ఇచ్చిన కానుక ఇది! ఇప్పుడిక దీన్ని కొలమానంగా వాడి, ఆలయానికి వచ్చేవాళ్ళలో అసలైన పుణ్యాత్ములెవరో గుర్తిస్తాను. వాళ్ళ అడుగుజాడల్లో నడచి, నేనూ పవిత్రుడినౌతాను" అనుకున్నాడు.

ఆ రోజునుండీ గుడికి వచ్చే భక్తులందరిచేతా ఆ మట్టి పాత్రను తాకించేవాడు ఆయన. చుట్టుపక్కల గ్రామాల్లో అన్నదానాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేసి పేరెన్నిక గన్న భక్తులు ఎందరో వచ్చి మట్టిపాత్రను తాకారు. ఎంతమంది తాకినా అది మట్టి పాత్రగానే ఉండింది తప్ప, రంగు ఏ కొంచెం కూడా తిరగలేదు.

ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకసారి, మహా శివరాత్రి సందర్భంగా గుడిలో వేడుకలు జరుగుతున్న సమయంలో, ఎవరో ఒక బాటసారి అటుగా వచ్చాడు- మాసిన గడ్డంతో, మురికి పట్టిన వస్త్రాలతో- దైవదర్శనం కోరి వచ్చాడు.

చలి బాగా ఉన్నది. ఆ సమయంలో మెట్ల దగ్గర అడుక్కుంటూన్న ముసలాయన ఒకడు చలికి వణికిపోవటం మొదలెట్టాడు. భక్తులందరూ ఎవరి తొందరలో వాళ్ళు ఉడ్న్నారు- అతన్ని ఎవరూ గమనించలేదు; గమనించినా పట్టించుకోలేదు. పూజారి శంకరశాస్త్రి కూడా ముసలాయన్ని చూసి; జాలి పడ్డాడు- కానీ "ఇంత రద్దీ ఉన్న సమయంలో నేను ఏం చేయగలను?" అనుకొని ఊరుకున్నాడు.

అయితే వచ్చిన ఆ బాటసారి మటుకు ముసలాయన దగ్గర ఆగాడు. తన భుజం మీద ఉన్న కంబళిని తీసి అతనికి కప్పాడు. ఆ పైన తన చొక్కా కూడా తీసి అతనికి తొడిగాడు. బయటికి వెళ్ళి, వేడి వేడి టీ తెచ్చి అతని చేత త్రాగించాడు. భగవంతుడికి అర్పించేందుకుగాను తను తెచ్చిన పండును కూడా ముసలాయనకు ఇచ్చివేసాడు. ఆ తర్వాత ఒట్టి చేతులతో గుడిలోకి వచ్చాడు.

గమనించిన శంకరశాస్త్రి ఆలోచనలో పడ్డాడు. "ఈ ముసలతన్ని నేను రోజూ చూస్తుంటాను; పలకరిస్తుంటాను- అయినా అతనికి సాయం అవసరమైనప్పుడు నేను ముందుకు రాలేదు. ఈ బాటసారి ఎవరో నిజంగానే పుణ్యాత్ముడు- తను కప్పుకున్న చొక్కాని కూడా కరుణతో ఇచ్చేసాడు. పరోపకారాన్ని మించిన ధర్మం లేదు అని శాస్త్రం ఘోషించటంలేదా? నేను నా ధర్మాన్ని విస్మరించాను. ఇక ఎప్పుడూ అలా చేయను. ఇతరుల కష్టాల్ని తీర్చేందుకు నావంతుగా కృషి చేస్తాను!" అనుకుంటూ సిగ్గుపడ్డాడు.

ఇన్నాళ్ళుగా లేనిది, ఆ రోజున ఆయన చేయి సోకగానే మట్టి పాత్ర కొద్దిగా బంగారు వర్ణంలోకి మారినట్లు తోచింది- బాటసారి చేయి సోకే సరికి అది నిజంగానే వెలుగులు చిమ్మింది!

ఆనందాతిశయంతో కళ్ళు మూసుకున్న పూజారి శంకరశాస్త్రి కళ్ళు తెరిచి చూసే సరికి ఎదురుగా బాటసారి లేడు! 'సాక్షాత్తూ శివుడే ఈ రూపంలో తనకు మార్గం చూపించాడు' అనిపించింది, ఆశ్చర్యంతో నోరు తెరిచిన శంకరశాస్త్రికి. అటుపైన "ఏలాంటి ప్రయోజనాన్నీ ఆశించకుండా ఇతరులకు సహాయం చేయాలి అందరం- అదే పుణ్యం అంటే!" అని ఆచరణలో చూపిస్తూ చరితార్థుడైనాడాయన.

కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తూ, శివాలయాలు తిరిగేటప్పుడు ఈ కథలోని స్ఫూర్తిని గుర్తుచేసుకుంటారు కదూ? అభినందనలతో

కొత్తపల్లి బృందం.