ప్రవీణ్ వాళ్ళ అమ్మ-నాన్నలు ఎప్పుడూ అనుకునేవాళ్ళు- "మాకు చదువు రాక చాలా కష్టపడుతున్నాము; ఏమైనా గానీ మా కుమారుడిని మటుకు బాగా చదివించాలి" అని.
వాళ్ళు అనుకున్నట్లే ప్రవీణ్ కూడా చాలా శ్రద్ధగా, పట్టుదలతో చదువుకొని, పోస్టుగ్రాజు- యేషన్ పూర్తి చేసినాడు. "పై చదువులు ఇక వద్దు, ఏదైనా ఉద్యోగం చేసి అమ్మానాన్నల్ని సుఖపెడతాను' అని ఉద్యోగ ప్రయత్నం మొదలుపెట్టాడు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వ ఉద్యోగాలేవీ రాలేదు. తల్లిదండ్రులు ముసలివాళ్ళవుతున్నారు; సరైన ఆహారం కూడా తింటున్నట్టు లేరు; వాళ్ల ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. "ఇన్నాళ్ళూ అమ్మనాన్నలు నా కోసం ఎంతో శ్రమ కోర్చి నన్ను పోషించారు కదా! ఇప్పుడు వాళ్లను నేను పోషించలేకపోతున్నానే" అని అతనికి బాధ మొదలైంది.
రాను రాను కుటుంబ పోషణ భారం కూడా అతని భుజాలమీద పడింది. తను ఏదో ఒక పని చేస్తే తప్ప ఇంట్లో ఎవరికీ భోజనం ఉండని స్థితి వచ్చింది.
ఇక తను పెద్ద చదువు చదివినాడనే భావనను ప్రక్కకు పెట్టేసి, ఏదైనా షాపులలో పని దొరుకుతుందేమోనని ప్రయత్నించాడతను. అతని సర్టిఫికెట్లు చూసి "ఇంత పెద్ద చదువులు చదువుకున్నావు; నీయట్ల వానికి మేమేం ఉద్యోగం ఇస్తామయ్యా?!" అంటూ ఎవ్వరూ ఏ పనీ ఇవ్వలేదు అతనికి.
"ముగ్గురికి కూడా అన్నం పెట్టలేని నా ఈ చదువు మొత్తం వ్యర్థం" అనుకున్న ప్రవీణ్ చివరికి తన సర్టిఫికేట్లు అన్నీ పక్కన పెట్టేసాడు. కార్లు, జీపులు రిపేరు చేసే మెకానిక్ షెడ్డులో పనికి కుదురుకున్నాడు. తనెవరో, తన చదువేమిటో ఎవరికీ తెలీకుండా మసలుకున్నాడు.
చూస్తూండగానే ఆరు నెలలు గడిచి-పోయినాయి. ఎంత కాదనుకున్నా, చదువువల్ల తెలివి తేటలకు ఒక అర్థం ఏర్పడుతుంది కదా! బాగా చదువుకున్న ప్రవీణ్ వాహనాలను సరిచేసే పనిలో కూడా చక్కని నైపుణ్యం సంపాదించాడు.
ఒకనాటి ఉదయం ఒక ఆఫీసరు గారు తన కారు తెచ్చి ఇచ్చారు. దానితో సమస్యలు ఏమి వస్తున్నాయో చెప్పి, "సమస్యలన్నీ పెద్దవే; అయినా దీన్ని తొందరగా సరి చేయాలి; సమస్యలు తీరతాయా? సాయంత్రంకల్లా కారును సిద్ధం చేసి ఇస్తావా?" అన్నాడు.
"తప్పకుండా!" అన్నాడు ప్రవీణ్.
అన్నట్లుగానే ఆరోజు సాయంత్రం లోగా దానిలోని లోపాలన్నీ సరిచేసి, బండిని శుభ్రంగా కడిగి, సిద్ధం చేసి ఆ ఆఫీసరు గారి ముందుంచాడు.
కొత్తది లాగా మెరిసిపోతున్న కారును నడిపి చూసుకున్న ఆఫీసరు గారు సంతోషపడి, అదనంగా కొంత డబ్బు తీసి ప్రవీణ్‌కు ఇవ్వబోయారు. ప్రవీణ్ మర్యాదగానే ఆ డబ్బును తిరస్కరిస్తూ, "మా యజమాని ప్రతి నెలా నాకు జీతం ఇస్తాడు. మీరిచ్చే ఆ అదనపు డబ్బును కూడా ఆయనకే ఇవ్వండి సర్" అని చెప్పాడు.
ఆఫీసరుగారికి ప్రవీణ్ నిబద్ధత నచ్చింది. షెడ్డు ఓనర్‌తో "ఇట్లాంటి మంచి బుద్ధి గల పిల్లలు చాలా అరుదు. మా ఆఫీసులో నాలుగో తరగతి కాంట్రాక్టు పని ఒకటి ఖాళీ ఉన్నది. ఇతన్ని ఆ పనిలో పెట్టుకుందామని ఉంది. నువ్వు ఇతన్ని పంపిస్తావా?" అని అడిగాడు.
షెడ్డు ఓనర్ ప్రవీణ్ మంచితనాన్ని, పని తీరును గొప్పగా చెప్పి, "తమరు గవర్నమెంటు ఆఫీసులో పని ఇస్తానంటే ఇంకేమి, సంతోషం. అతని జీవితం బాగుపడుతుంది. పిలుచుకొని పొండి" అని సంతోషంగా సాగనంపాడు.
అలా ప్రవీణ్ ప్రభుత్వ ఆఫీసులో కాంట్రాక్టు అటెండర్‌గా చేరాడు. అక్కడ కూడా తన చదువుగురించి ఎవ్వరికీ తెలియనివ్వలేదు. పగలంతా తనకు ఇచ్చిన పనల్లా చేసేవాడు; ఆఫీసర్లందరికీ ఎవరికి కావలసిన ఫైళ్ళు వాళ్లకు అందించేవాడు. అదంతా అయిపోయాక, రాత్రిపూట ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని, ప్రభుత్వ ఉద్యోగాల అర్హతా పరీక్షలకు పనికొచ్చే మంచి మంచి పుస్తకాలు చదివేవాడు. రకరకాల అర్హతా పరీక్షలు రాస్తూండేవాడు.
ఆ ఆఫీసులో కరుణాకర్ అనే సెక్షన్ ఆఫీసర్ ఒకాయన ఉండేవాడు. ఆ సెక్షన్‌లో పనిచేసే ఇరవై మందీ పర్మనెంట్ ఉద్యోగస్తులే. అయినా సెక్షన్ ఆఫీసర్‌గా ఈయన తన క్రింది ఉద్యోగులందరినీ చిన్నచూపు చూసేవాడు. అడ్డు-ఆపు లేకుండా మాట్లాడేవాడు. ఇక ఆయనకు ప్రవీణ్ ఒకలెక్కా?!
ప్రవీణ్ ఆయనకు దగ్గరగా నిలబడితే "స్నానం చేసినావా లేదా? చెమట వాసన వస్తున్నావే?!" అంటాడు. ప్రవీణ్ వేసుకునే బట్టలు చూసి "ఎన్నాళ్ళకు ఒకసారోయ్, నువ్వు బట్టలు మార్చుకునేది?" అని తన జోకుకు తానే నవ్వుతాడు. మంచి నీళ్ళివ్వ మంటాడు; ప్రవీణ్ గ్లాసుతో నీళ్ళు తెచ్చి యిస్తే "గ్లాసు బాగా కడిగినావాలేదా? నీళ్ళు తెచ్చే ముందు చేతులు బాగా కడుకున్నావా?" అని అవమానిస్తాడు.
టేబుల్‌ను చూపించి "దానిమీద ఎంత దుమ్ము పేరుకున్నదో చూడు?! తుడవాల్సిన పని లేదా?" అని చివాట్లు పెడుతూనే వుంటాడు. ప్రవీణ్ అతని మాటలకు బాధపడేవాడు; కానీ "ఈ పనీ లేకపోతే ఇక ఇల్లు గడిచేదెలాగ?" అన్న ఆలోచన అతనిలోని సహనశీలతను మరింత పెంచింది.
ఒకసారి ఆఫీసులో కొత్తగా చేరిన యువ ఉద్యోగి ఒకడు ఉండబట్టలేక కరుణాకర్‌ను "ఏంసార్? ప్రవీణ్ అంత ఉత్తముడు కదా, అతన్ని అట్లా వేధిస్తున్నారు?" అని అడిగేసాడు. ఈ మాట వినగానే కరుణాకర్ అగ్గిమీద గుగ్గిలం అయిపోయి, ప్రధాన ఆఫీసరుగారికి ప్రవీణ్ మీద ఫిర్యాదు చేసాడు: 'తన సెక్షన్ లోని ఉద్యోగులందరినీ ప్రవీణ్ తనపైన తిరుగుబాటు చేసేటదుకు పురిగొల్పుతున్నాడు" అని.
ప్రధాన ఆఫీసరు సెక్షన్లోని ఉద్యోగులను పిలిచి అడిగితే ఎవ్వరూ ప్రవీణ్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అందరూ 'కరుణాకర్ ఆగడాలు ఎక్కువైనాయి' అనే చెప్పారు.
ప్రవీణ్ అంటే అభిమానం గల ఆఫీసరు గారు అందరికీ సర్ది చెప్పి పంపించాల్సి వచ్చింది.
రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. ఒకనాడు ప్రవీణ్‌కు ప్రభుత్వం వారినుండి ఒక ఉత్తరం వచ్చింది. అతను వెంటనే ఆ కవరును తెచ్చి ప్రధాన ఆఫీసరు గారికి ఇచ్చి నమస్కరించాడు.
ఆఫీసరు గారు ఆ ఉత్తరం చదివి, లేచి నిలబడి, ప్రవీణ్‌కు మర్యాదగా కుర్చీ చూపి కూర్చోమని, 'ఈ కవర్‌లోని విషయం నాకు నిన్ననే తెలిసింది ప్రవీణ్- చాలా సంతోషమైంది' అన్నారు. వెంటనే ఒక అటెండరును పిలిచి "మన ఆఫీసర్లందరినీ అర్జంటుగా ఇక్కడికి రమ్మను" అంటూ ఒక సర్క్యులర్ పంపారు.
ఆఫీసర్లందరూ సమావేశమయ్యే సమయానికి ప్రధాన ఆఫీసరుగారి టేబుల్ ప్రక్కగా కుర్చీలో కూర్చుని ఉన్నాడు ప్రవీణ్. అది చూడగానే కరుణాకర్‌కు ఎక్కడలేని కోపం వచ్చింది. ప్రవీణ్ దగ్గరకు వచ్చి నిలబడి "ఎంత పొగరురా, నీకు? నువ్వు నీ బోడి ఉద్యోగానికి రాజీనామా చేసి పోతే పో, కానీ మేం ఇంతమందిమి ఆఫీసర్లం వస్తే పైకి కూడా లేవకుండా కుర్చుంటావా?! పైకి లే, ముందు!" అని అరిచాడు. ప్రవీణ్ చటుక్కున లేచి నిలబడి, అతనికి నమస్కరించాడు.
అంతలోనే అక్కడికి వచ్చిన ప్రధాన ఆఫీసరు గారు ప్రవీణ్‌ను కూర్చోమని చెప్పి, కరుణాకర్‌తో "ఏమిటి సర్, మీ నోటి దురుసుతనం మరీ ఎక్కువైందేమి? ఈయన ఎవరనుకున్నారు? గ్రూప్-1 స్టేట్ ఆఫీసర్‌గా శిక్షణ నిమిత్తం మన ఆఫీసుకు వచ్చారు ఈయన. మీరే కాదు, నాలాంటి జిల్లా ఆఫీసర్లందరూ కూడా ఆయన ముందు కూర్చునే యోగ్యత లేనివాళ్లమే, అర్థమైందా?" అన్నారు.
కరుణాకర్ ముఖం తెల్లబడింది. అతను తలవంచుకొని ప్రవీణ్ వద్దకు వెళ్ళి 'సారీ ప్రవీణ్' అన్నాడు.
ప్రక్కనే ఉన్న ఉద్యోగి ఒకడు "ఏమిటి నీ సంబోధన- 'ప్రవీణ్ సార్' అనాలి" అన్నాడు. అక్కడున్న వాళ్ళంతా గొల్లున నవ్వారు.
"కొండ అద్దంలో చిన్నదిగా కనబడినంత మాత్రాన అది నిజంగా చిన్నదై పోదు. వ్యక్తి యొక్క యోగ్యతాయోగ్యతల్ని ఆ వ్యక్తి వేసుకున్న దుస్తులను బట్టి నిర్ణయించకూడదు.
మట్టిపొర క్రమ్మినంత మాత్రాన, అందరూ రాయి అన్నంత మాత్రాన, మాణిక్యం మాణిక్యం కాకుండా పోదు. ఇన్నాళ్ళూ మనతో కలిసి ఉన్నా, ఈ ప్రవీణ్‌గారి గొప్పతనాన్ని మనం ఎవ్వరం గుర్తించలేకపోయాం చూడండి, అది మనందరికీ చెంప పెట్టు అవ్వాలి" అన్నారు ప్రధాన ఆఫీసరుగారు.
"అట్లా అనకండి-వేరే అవకాశాలేమీ లేక, పొట్ట గడవక, గ్యారేజీలో పనిచేస్తున్న నాకు ఇక్కడికి వచ్చే అవకాశాన్నిచ్చారు మీరు. ఆనాడు మీరు కాపాడకుండా ఉంటే ఈ మొక్క ఇంత పెద్దగా అయ్యేది కాదు. నేను మీకు ఎల్లప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటాను" అన్నాడు ప్రవీణ్, సహజ సిద్ధమైన తన సహృదయంతో.