కృష్ణమోహన్‌ అనే కుర్రవాడికి ఒకసారి ఓ గ్రంథం దొరికింది- చాలా పురాతన కాలం నాటి తాళపత్ర గ్రంథం. దాని భాష ఏదో సగం అర్థమై, సగం కాకుండా ఉంది.

అందులో ఒక పేజీ ఆసక్తికరంగా అనిపించి, జాగ్రత్తగా చదివాడు: "గంగానది ఒడ్డున ఓ చోట సాధారణ నర సంచారం లేని ఓ ప్రాంతం ఉంది. వేల సంవత్సరాల క్రితం సమాధి నొందిన మహా ఋషులు కొందరు, అక్కడ ఓ గుహలో ఇంకా తపస్సు చేస్తూ ఉన్నారు. వాళ్ళు తపస్సు మొదలు పెట్టిన కొత్తల్లోనే, వాళ్ళ తపో ప్రభావం వల్ల, అక్కడి చిన్న రాయి ఒకటి పరసువేది ఐపోయింది. ఆ ఋషులు సర్వ సంగ పరిత్యాగులు. వాళ్ళకి దానితో ఏమీ ఉపయోగం కనిపించ లేదు. "మరి దీనితో ఏం చేద్దాం" అని ఆలోచించి, 'ప్రత్యేకంగా ఇది ఎవరికీ‌ దొరకనక్కర్లేదు' అని దాన్ని కూడా మిగతా రాళ్లతో బాటు నది ఒడ్డున పడేసారు. కానీ ఆ రాయి సోకితే ఏ లోహమైనా బంగారంగా మారిపోతుంది" అని రాసి ఉన్నది.

వెంటనే వివరాలలోకి పోయి చూసాడు కృష్ణమోహన్. గుర్తులన్నీ స్పష్టంగానే ఉన్నాయి. "బహుశ: తను వెళ్ళి వెతికితే దొరకచ్చు.. ఆ ఒక్క రాయి దొరికితే తన జీవితం మారిపోతుంది!" ఆత్రుతతో అతని ముఖం ఎర్రబడింది.

"మరి అన్ని రాళ్ళలో ఆ రాయిని గుర్తు పట్టేదెలాగ?" ఆ వివరం కూడా స్పష్టంగా రాసి ఉన్నది. "వణికించే చలికాలంలో కూడా వెచ్చని నిప్పు కణికలాగా కాలే రాయి ఏదైతే ఉందో అదే పరసువేది" అని!

ఇక ఆగలేకపోయాడు కృష్ణమోహన్. వెంటనే బయలుదేరి వారణాసి దగ్గర గంగాతీరం చేరుకున్నాడు. గంగ వెంబడే పడమటివైపుకు నడుస్తూపోతే, సాయంత్రంకల్లా అతని కాళ్ళు కాయలు కాచాయి. అయినా అట్లా నడుస్తూనే తనకు కావలసిన రాళ్ల కోసం వెతక సాగాడతను. అట్లా పోగా పోగా, పుస్తకంలో చెప్పిన ప్రాంతాలు కనిపించాయి చివరికి- సరిగ్గా పుస్తకంలో వివరించినట్లే ఉన్నాయవి! ఇక అక్కడే ఆగి, ఒడ్డున పడి ఉన్న ఒక్కొక్క రాయినీ ఎత్తి పట్టి పరిశీలిస్తూ పోయాడు కృష్ణమోహన్.
అట్లా వారం గడిచింది. రాళ్ళయితే అక్కడ అనంతంగా ఉన్నాయి. పరసువేది జాడే, లేదు. కృష్ణమోహన్‌కి చికాకు మొదలైంది. చూసిన రాయినే మళ్ళీ మళ్ళీ‌ చూసే సరికి అతనికి తిక్కరేగింది. "ఇట్లా అయితే లాభం లేదు" అనుకున్నాడు.

"ఒకసారి చూసిన రాయిని మళ్ళీ చూడ కూడదు. లేకపోతే ఇన్ని రాళ్ళు ఎప్పటికి పూర్తయేట్లు?"

ఇక ఆ క్షణం నుండీ అతను పరిశీలించిన రాయినల్లా అవతల ఉన్న లోయలోకి విసిరేయటం మొదలు పెట్టాడు. రాళ్ల కుప్పలు తగ్గిపోతున్నకొద్దీ అతనికి ఆనందంగా అనిపించసాగింది.

అట్లా ఇంకొక వారం గడిచింది. తిండీ తిప్పలూ లేక అతనికి ఇప్పుడు తల తిరగటం మొదలైంది. దాహంతో నోరు పిడచకట్టుకుపోసాగింది.

ఒక్కో రాయిని పట్టుకొని చూసి, వెచ్చగా లేకుంటే దాన్ని కోపంతో లోయలోకి విసిరేస్తూ పోయాడతను. చివరికి రాళ్ళను విసిరెయ్యటం కూడా అతనికి ఓ అలవాటుగా మారింది: ఇప్పుడు అతని చెయ్యి యాంత్రికంగా రాయిని ఎత్తుతున్నది; లోయలోకి విసిరేస్తున్నది; మరొక రాయిని ఎత్తుతున్నది..

కొద్ది రోజుల తర్వాత అతనికి ఓ అనుమానం మొదలైంది: 'అప్పుడెప్పుడో తనకు కనిపించిన రాయి ఒకటి- చాలా వెచ్చగా ఉండింది కదా..! మరి అదే పరసువేది అయి ఉండచ్చునేమో..!' అని!

కానీ ఇప్పుడది దొరికే అవకాశం లేదు- లోయలోకి విసిరేసాడు కద! అట్లాగని, ఆ అనుమానాన్ని మనసులో మోస్తూ, అక్కడ ఒడ్డున వెతకాల్సిన పనీ చేయలేడు! జరగాల్సిన అనర్థం జరిగిపోయింది- ఇక తన బ్రతుకు మారదు!