సిరికొండను పరిపాలించే చంద్రభానుడు మంచి రాజు. ప్రజల కష్టసుఖాలను గుర్తిస్తూ సమస్యల్ని తక్షణం పరిష్కరించేవాడు.
అయితే కొన్ని యేళ్ళగా రాజ్యంలో కరువు తాండవిస్తోంది. ఏ వారానికి ఆ వారం, ప్రజలకు సరిపడా ఆహార పదార్థాలను గ్రామాలకు సరఫరా చేయటమౌతున్నది. ఖజానాలోని ధనమంతా ఖర్చయిపోయింది- కష్టాలలో ఉన్న ప్రజలకు మరి కొద్ది నెలలపాటు ఆహార సౌకర్యాలు కల్పించేందుకు సరిపోయేంత ధనం మాత్రం ఉన్నది. తర్వాత కష్టమే..
'ఈ సమస్యను ఎలా అధిగమించాలి?' అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడాయన.
గ్రామాలకు పంపే ఆహార ధాన్యాల సరఫరా తక్షణం నిలిపి వేసాడు. వారం తిరిగే సరికి అన్ని గ్రామాలలోనూ కష్టాలు ఎక్కువయ్యాయి. ప్రజా ప్రతినిధులంతా మహారాజుతో మొర పెట్టుకున్నారు: గ్రామాల్లో పరిస్థితిని మనవి చేసుకున్నారు.
చంద్రభానుడు అందరినీ కూర్చోమన్నాడు.
"మన రాజ్య ఖజానా అంతా ఖాళీ అయ్యింది. ప్రస్తుతానికి పొరుగు రాజ్యం నుండి ఆహార పదార్థాలు తెప్పించాను.
తీసుకెళ్ళండి" అంటూ వాటిని అందరికీ పంచాడు. "ఇప్పటి వరకూ ఎలాగో ఒకలాగా నెగ్గుకొచ్చాను. ఇకపైన నేను అశక్తుడిని. రాజ్యమంతటికీ సరిపడే ఆహార పదార్థాలను ఇక్కడినుండి పంపలేను క్షమించండి" అని చెప్పుకొచ్చాడు.
దాంతో ప్రజా ప్రతినిధులంతా నివ్వెరపోయారు. 'ఇప్పుడెలాగ?' అని గుటకలు మ్రింగారు.
రాజుగారు కొనసాగించారు: "మా వంశాచారం ప్రకారం ప్రతి రాజూ తమ వారసుడికి చెబుతూవచ్చిన రహస్యం ఒకటి ఉన్నది. పట్టాభిషేక సమయంలో మా నాన్నగారు కూడా నాకు చెప్పారు: 'మన గ్రామాలలోని చెరువులు అన్నింటిలోనూ లంకెబిందెలు
దాగి ఉన్నాయి' అని.
ఈ భూమిలోపల ఉన్న సమస్త సంపదలపైనా హక్కు ప్రభువులదే; కానీ ఈ కష్ట సమయంలో నేను ఆ సంపదని మొత్తాన్నీ జాతికి అంకితం చేయదలచాను. మీ మీ ఊరి చెరువుల్లో ఆ లంకె బిందెలున్న స్థానాలను మీరే గుర్తించగలరేమో చూడండి. ఆ సొమ్ముని మీరే వాడుకోండి. మీకు దొరికిన లంకె బిందెలలోని సొమ్మంతా మీ గ్రామానిదే!" చెప్పారు.
ప్రజలంతా ఆతృతగా చెరువుల దగ్గర చేరారు. మరుసటి రోజు ఉదయం నుండే చెరువుల్లో త్రవ్వకాలు మొదలయ్యాయి. త్రవ్విన మట్టినంతా కట్టకు పోసారు ప్రజలు. వారం రోజులు గడిచే సరికి అన్ని చెరువుల్లోనూ పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.
చెరువులు బాగా లోతు అయితే అయ్యాయి; కట్టలుకూడా బాగా బలిష్టంగా అయినాయి. కానీ లంకె బిందెలు మాత్రం ఇంకా ఎవ్వరికీ దొరకలేదు. అయితే ఎందుకనో మరి, అకస్మాత్తుగా వానలు మొదలయ్యాయి. భారీ వర్షాలకు చెరువులన్నీ నిండి, మరవలు పారాయి.
ఇప్పుడింక లంకె బిందెలకోసం చెరువులు తవ్వడం వీలు కాలేదు. మహారాజు చంద్రభానుడు ప్రతి గ్రామానికీ ఒక బిందెడు బంగారు నాణాలు పంపాడు. "చెరువులు మనకు ఏనాటికైనా ఉపయోగపడే లంకెబిందెలు. వాటిని జాగ్రత్తగా చూసుకుందాం.
పూడిక తీసిన చెరువులు ఎక్కువ నీళ్లని ఆపుతాయి; మన అవస-రాలకోసం మరింత నీటిని అందుబాటులోకి తెస్తాయి. బావుల్లో నీళ్ళు మరిన్ని ఊరతాయి. ఇదిగో, ఇప్పుడిక ఈ డబ్బుని పెట్టుబడిగా పెట్టండి. ఎవరికి వారు వ్యవసాయం చేసి, బంగారు పంటల్ని పండించండి. ఇకపై మన బంగారాన్ని మనమే పండించుకుందాం!" అంటూ.
ఆ ఏడాది సిరికొండలో బంగారు పంటలు పండాయి. రాజుగారి ఖజానా మళ్ళీ పొంగి పొరలింది.
"చెరువుల్లో నిజానికి లంకె బిందెలంటూ వేరే ఏమీ లేవురా; కానీ చెరువులు పూడిక తీసి, గట్లు బాగు చేసుకొని ఉంచితే, అట్లా నిండిన చెరువులు బంగారు పంటలు పండిస్తాయి. అదీ రహస్యం" అని చెప్పుకున్నారు ప్రజలు. "మన రాజుగారి తెలివి మహా గొప్పది" అని అందరూ ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు!