అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. ఒకరోజు అది ఆహారం కోసం బయలు దేరింది. దారిలో దానికి ఒక అడవి పిల్లి ఎదురైంది. ఆ అడవి పిల్లి కూడా చాలా ఆకలితో ఉంది. ఆహారం కోసం వెతుక్కుంటోంది.
అడవిపిల్లిని చూడగానే పులికి నోరూరింది. తటాలున దాని వెంటపడింది. “బాబోయ్! నా ఆకలి సంగతి సరే- ఈ పులికి ఆహారం మాత్రం కాకూడదు!” అనుకుంటూ అడవి పిల్లి తోచిన దిక్కుకు పరుగు తీసింది.
కనబడిన ఆహారాన్ని పులి ఊరికే ఎందుకు వదుల్తుంది? అది పిల్లి ఎటుపోతే అటు పోయింది. అడవిపిల్లికేమో ఆయాసం ఎక్కువైంది. 'ఎట్లా దేవుడా, దీన్నించి తప్పించుకోవటం?' అని అది అట్లానే పరిగెత్తుతూ పరిగెత్తుతూ గబగబా ఓ చెట్టు పైకి ఎగ బ్రాకింది.
అంతకు ముందురోజే పులి కాలికి ఓ ముల్లు గుచ్చుకొని నొప్పి చేసి ఉన్నది. పరుగు పెట్టటమైతే ఎలాగో ఒకలాగా చేస్తున్నది కానీ, చెట్టుపైకి ఎగబ్రాకటం మటుకు ఇంకా వీలవట్లేదు దానికి. అందుకని అది గుర్రు గుర్రు మంటూ చెట్టు క్రిందే చక్కర్లు కొట్టటం మొదలుపెట్టింది.
ఆ చెట్టు కొమ్మ మీదే కోతి ఒకటి నిద్రపోతున్నది. అడవి పిల్లి రాకతో దానికి నిద్రాభంగమై కళ్లు తెరిచి చూసింది. అడవి పిల్లి గబుక్కున దాని కాళ్ళు పట్టుకొని "బాబ్బాబు! నన్ను కాపాడు!చెట్టు కిందే ఒక పులి నా కోసం కాచుకొని కూర్చుంది. కొద్ది సేపు ఆశ్రయం ఇవ్వు. నా ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి" అని ప్రాధేయపడింది.
కోతి పాపం మంచిది. అడవిపిల్లిని క్రిందికి తొయ్యకపోతే పులికి కోపం వస్తుందని దానికి తెలుసు. అయినా 'పిల్లి తనని కాపాడమని వేడుకున్నది గదా' అని అది 'సరే' అని తల ఊపి తిరిగి నిద్రలోకి జారుకుంది.
'అడవి పిల్లి ఎప్పటికైనా కిందికి దిగుతుంది; దాన్ని తను తినాలి' అని పంతం పట్టిన పులి ఆ రాత్రంతా చెట్టు కిందే కాపు కాసింది. తెల్లవారవస్తున్నా పులి కదలకపోయేసరికి అడవిపిల్లికి ఊపిరాడలేదు. 'ఎట్లా అయినా సరే, పులిని ఇక్కడినుండి పంపించెయ్యాలి' అని ఆలోచించటం మొదలుపెట్టింది.
చివరికి దానికో ఉపాయం తట్టి కోతి వైపు చూసింది. కోతి గాఢ నిద్రలో ఉంది. “ఈ కోతిని కిందకు తోసేస్తే..? పులి దాన్ని తింటుంది; ఒకసారి కడుపు నిండిందంటే పులి ఇంక ఇక్కడ ఉండదు- వెళ్లిపోతుంది. అది తినగా కోతి మాంసాన్ని నేను కూడా తినొచ్చు.
నా ప్రాణాలను కాపాడుకున్నట్లూ ఉంటుంది; ఈ పూటకు నా కడుపు కూడా నిండుతుంది" అనుకున్నది మోసకారి పిల్లి. ఆ ఆలోచన వచ్చిందే తడవు కోతిని కిందకు తోసేసింది!
అయితే కోతి పడటం పడటం సరిగ్గా పులి నెత్తి మీద పడింది. ఆ బరువుకు పులికి తల తిరిగినట్లయింది. ఒక్క ఉదుటున లేచి బ్రతుకు జీవుడా అని అడవిలోకి పరుగు తీసింది. నిద్ర మత్తు వదిలిన కోతికి జరిగిందేమిటో అర్థమయ్యేందుకు ఒక్క నిముషం పట్టింది. అంతే- అది ఆవేశంగా చెట్టెక్కి, అడవి పిల్లి గూబ మీద ఒక్కటిచ్చింది.
గూబ గుయ్యిమన్న అడవి పిల్లి పట్టు తప్పి కింద పడింది. దాని నడ్డి విరిగింది; అయితేనేమి, 'పులి పారిపోయింది దేవుడా, అది చాలు. కోతి ఇచ్చిన బహుమానంతో నాకు మా బాగా బుద్ధొచ్చింది- ఇంక ఏనాడూ, ఎవ్వరినీ మోసం చెయ్యను..' అంటూ అది తన ఇంటికేసి పరుగు పెట్టింది!