రామయ్య, రాంబాబు ఇద్దరూ రైతులు, దూరపు చుట్టాలు కూడా. రామయ్య కష్టజీవి. రాంబాబు ఎక్కడ వీలైతే అక్కడ అడ్డదారులు తొక్కే రకం.
రామయ్య ఇంట్లో ఏనాడో పెద్దలు చేయించి పెట్టిన ఎద్దుల బండి ఒకటి ఉంది. దాన్ని లాగేందుకు పెద్ద ఎద్దులు కొనాలని బలే కోరిక అతనికి. కానీ ఏనాడూ దానికి తగినంత డబ్బు సమకూరక, ఆ కోరిక అలాగే నిలచిపోయింది.
అయితే ఆ సంవత్సరం పంటలు కొంచెం బాగా పండేసరికి, కొంత రొక్కం చేతిలో నిలచింది. దాంతో ఎద్దులను కొందామని ఆ కాసింత డబ్బూ పట్టుకొని సంబరంగా పట్నంలో జరిగే పశువుల సంతకు వెళ్లాడు రామయ్య.
సరిగ్గా అప్పుడే 'టోకరా వేసేందుకు ఏ గొర్రె దొరుకుతుందా' అని సంతలో ఎదురు చూస్తున్నాడు రాంబాబు. రామయ్య చేతిలో డబ్బుని చూడగానే రాంబాబు కళ్ళు మెరిసాయి. సంతోషంగా దగ్గరికి వచ్చి “ఏంటి! బావా, ఇలా వచ్చావు?” అన్నాడు.
"గేదెను కొందామని వచ్చాను బావా! ఇంతకూ నువ్వు ఏంటి ఇక్కడ?” అన్నాడు రామయ్య. వెంటనే రాంబాబు ముఖం విచారంతో నిండిపోయింది: "మా అమ్మకు బాగాలేక పోతే ఇక్కడ హాస్పిటల్‌లో చేర్పించాను బావా! ఆపరేషన్ చేయాలంట. ఇరవై, ముప్ఫై వేల దాకా ఖర్చు అవుతుందని చెప్పారు. 'సంతలో ఐతే తెలిసిన వాళ్లు ఎవరైనా కనిపిస్తారు కదా' అని వచ్చాను. వాళ్ళేమైనా సాయం చేస్తే ఈ కష్టం గట్టెక్కుతుంది. పెద్ద ప్రాణం, పాపం!" అనేసాడు.
రామయ్య మనసు కరిగి నీరైపోయింది. "అయ్యయ్యో, అలాగా! ఇదిగో, ఈ డబ్బు ఉంచు. తరువాత నీకు వీలైనప్పుడు తిరిగి ఇద్దువు గాని. ముందు అమ్మకు ఆపరేషన్ చేయించు, పో బావా!” అని తన దగ్గరున్న డబ్బంతా ఇచ్చేసాడు.
రాంబాబు ఆ డబ్బు పుచ్చుకొని "బావా! ఎంత మంచి మనసు నీది! వీలైనంత తొందరలో తప్పకుండా నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. నా పాలిట దేవుడివి నువ్వు!” అంటూ మాయం అయిపోయాడు.
నిజంగానే రాంబాబు వాళ్ల అమ్మకు ఆపరేషన్ అవసరం ఉండింది. అయితే అదేమంత పెద్దది కాదు. కొద్దిపాటి డబ్బుతో ఆ పని ముగించి, రాంబాబు ఇచ్చిన డబ్బులో అధికశాతం మిగుల్చుకున్నాడు రాంబాబు. ఆ డబ్బుతో వ్యవసాయం సాగించాడు; మంచి లాభాలే వచ్చాయి కూడా.
అయినా డబ్బు కళ్ళజూసే సరికి ఆశ పెరిగింది. రామయ్యకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇవ్వనే లేదు! సంవత్సరం దాటాక కూడా రాంబాబు డబ్బు ప్రస్తావన ఎత్తకపోవటంతో, ఒకరోజు రామయ్య రాంబాబు ఇంటికే వెళ్లాడు నేరుగా. రాంబాబు కాస్త తడబడ్డాడు; కానీ, పైకి మటుకు నవ్వుతూ “రా బావా! రా! బాగున్నావా?! ఎన్నాళ్లయింది, నిన్ను చూసి!" అంటూ ఆహ్వానించాడు.
కాసేపు ఆ మాట, ఈ మాట మాట్లాడాక రామయ్య తనకు ఇవ్వాల్సిన డబ్బు గురించి అడిగాడు. “డబ్బా?! ఏం డబ్బు, బావా?!” అన్నాడు రాంబాబు, ప్రశ్నార్థకాన్ని ముఖమంతా నింపుకొని.
తను మోసపోయాడని ఆ క్షణాన్నే గుర్తించాడు రామయ్య. అయినా "ఆ.. హా..హా..ఏం లేదు..ఏం లేదు. నువ్వు కాదులే, వేరే ఎవరో ఇవ్వవలసి ఉన్నది. ఆ పని మీద వచ్చాను- వస్తాను" అనేసి బయటపడ్డాడు. ఏమంటే తను రాంబాబుకు డబ్బు ఇచ్చినట్లు సాక్ష్యం కూడా ఏమీ లేదు మరి!
తరువాతి ఏడాది పంట డబ్బుతో తనకు నచ్చిన ఎద్దులు కొన్నాడు; బండి కట్టాడు; అట్లా కొంత వృద్ధిలోకి కూడా వచ్చాడు రామయ్య.
అయితే ఉద్దరకు (తేరగా) వచ్చిన సొమ్ముతో బ్రతకటం అలవాటైన రాంబాబుకు వ్యవసాయం ఏమాత్రం గిట్టుబాటు కాలేదు. బాగా నష్టాలు వచ్చాయి. తిండి కూడా కరువైంది.
అతని మోసాలు కనుక్కున్న జనాలంతా "వామ్మో! వీడు మామూలు వాడు కాదు! వీడికి దగ్గరైతే అంతే సంగతులు!" అనుకున్నారు; ఇంక ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా అప్పు ఇవ్వలేదు.
చివరి ప్రయత్నంగా రామయ్యని కలిసిన రాంబాబు కళ్ళలో నీళ్ళు తన్నుకు వచ్చాయి. "నన్ను క్షమించు బావా! నా మోసాలకు తగిన బుద్ధి చెప్పాడు దేవుడు" అంటూ రామయ్య కాళ్ల మీద పడ్డాడు.
రామయ్య అతన్ని ఓదార్చుతూ ”లేలే, రాంబాబూ! కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీకు నేను ఇచ్చిన డబ్బులతో ఎద్దులు కొందామనుకున్నాను. ఆ ఏడాది వీలవ్వలేదు-కానీ మరుసటి ఏడాదికి అవి సమకూరినైగదా! అట్లా అవుతుంటుందంతే. మనకంటూ ఏలాంటి అప్పులూ మిగలకుండా బ్రతకటంలో పరమార్థం ఉంది. ప్రస్తుతానికి నేను నీకు ఇంకొంత సాయం చేస్తాను- నీ వీలును బట్టి మొత్తంగా తీర్చేందుకు ప్రయత్నించు" అని మరి కొంత డబ్బును అతని చేతిలో పెట్టి పంపాడు.
దాంతో రాంబాబు మనసు నిజంగానే మారింది. అటుపైన మోసాలు చేయడం ఆపేశాడు. రెండేళ్లలో వడ్డీతో సహా రామయ్య డబ్బును రామయ్యకు ఇచ్చేసాడు. బుద్ధిగా నడుచుకుంటూ తనపై ఉన్న మచ్చను పోగొట్టుకున్నాడు. 'మంచివాడు' అనిపించుకున్నాడు.