పూర్వం అచలపురం అనే గ్రామంలో నారాయణస్వామి అనే పండితుడు ఒకడు ఉండేవాడు. ఆయన కొడుకు పేరు భారవి. భారవి బాగా చదువుకుని పెద్దవాడయ్యాడు. అతనికిప్పుడు పద్దెనిమిదేళ్ళు.
పద్ధెనిమిదేళ్ళ భారవి - చక్కని పాండిత్యంతో కూడిన కవిత్వం చెప్పేవాడు. తెలిసిన వాళ్ళంతా అతని కవిత్వాన్ని తెగ మెచ్చుకునే వాళ్ళు. అయితే భారవి వాళ్ళ నాన్న నారాయణస్వామి కొడుకు పాండిత్యానికి లోలోన సంతోషపడినా, పైకి మాత్రం మెచ్చుకునేవాడు కాదు. భారవికి ఇది కాస్తంత అసంతృప్తిగా ఉండేది.
ఒకసారి భారవి ప్రజలందరి సమక్షంలో కవిత్వం చెప్పాడు. అతని కవిత్వం అక్కడ చేరిన ప్రజలందరినీ బలే మెప్పించింది. దాంతో భారవి ఖ్యాతి చుట్టుపక్కల ఊళ్ళన్నిటికీ వ్యాపించింది. భారవి తండ్రికి ఆప్తులైనవాళ్ళు, బంధువులూ కూడా చాలామంది ఆ ప్రశంసను విన్నారు.
తర్వాత కొన్నాళ్లకు ఏదో సందర్భంలో బంధువులు చాలామంది నారాయణస్వామి ఇంటికి వచ్చారు. వాళ్ళంతా భారవిని మెచ్చుకుంటూ, నారాయణస్వామితో "మీవాడు చాలా గొప్ప కవిత్వం చెబుతున్నాడు నారాయణస్వామీ!" అన్నారు.
దానికి నారాయణస్వామి నాలుక చప్పరించేస్తూ "అబ్బే, అదేమి కవిత్వం, వాడి చదువు ఇంకా పూర్తే కాలేదు! ఏదో రాస్తుంటాడంటే- అంతగా పొగడాల్సిన కవిత్వమేమీ కాదది" అని తీసిపారేసినట్లు మాట్లాడాడు.
పక్కనే ఉండి ఆ మాటలు విన్న భారవి కోపం పట్టలేకపోయాడు. ఆ కోపంలో అతని విచక్షణా జ్ఞానం పూర్తిగా నశించింది. లోకమంతా మెచ్చినా తనను విమర్శిస్తున్న తండ్రిని, ఎలాగైనా సరే- వదిలించుకోకపోతే శాంతి లేదనుకున్నాడు. ఆయన్ని గుండ్రాయితో మోది చంపేయాలని పథకం వేసాడు. గబగబా ఇంటిలోకి వెళ్ళాడు. పెద్ద గుండ్రాయిని ఒకదాన్ని తీసుకొని, భోజనాల గదిలో అటకపైకెక్కి కూర్చున్నాడు: తండ్రి కోసం ఎదురు చూస్తూ.
రాత్రికి నారాయణస్వామి భోజనానికి కూర్చున్నాడు. అటక మీద ఉన్న భారవి గుండ్రాయిని క్రిందికి దొర్లించేందుకు సిద్ధమౌతున్నాడు. సరిగ్గా ఆ సమయంలో భోజనం వడ్డిస్తున్న భారవి తల్లి, నారాయణస్వామితో అన్నది- "కొడుకుని అందరూ పొగుడుతుంటే, మీరు కనీసం ఒక్క మంచిమాట కూడా అనరెందుకు? వాడు యువకుడైనాడు కూడా, పాపం వాడి మనసు నొచ్చుకోదా?" అని.
నారాయణస్వామి అన్నం కలుపుకుంటూ "పిచ్చిదానా! మన భారవి నిజంగా 'భా రవి' (ప్రకాశించే సూర్యుడు). వాడు మనందరికీ పేరు తీసుకొచ్చే రోజు ముందుంది. ఇప్పుడే పొగడ్తలకు అలవాటు పడితే వాడి ప్రగతి ఆగిపోతుంది" అని బదులిచ్చాడు.
అటకమీది నుండి వింటున్న భారవి సిగ్గుతో కుమిలిపోయాడు. అటక దిగి వచ్చి తండ్రి పాదాలమీద పడి, జరిగిందంతా చెప్పి, "ప్రాయశ్చిత్తంగా నాకేదైనా శిక్ష విధించండి" అని వేడుకున్నాడు.
"ఓ ఆరునెలలు అత్తవారింట్లో గడిపి రా! అయితే నువ్వు ఎన్నాళ్ళు అక్కడ ఉండబోతున్నదీ మటుకు చెప్పకూడదు వాళ్ళకు" అన్నాడు నారాయణస్వామి.
'సరే- ఇదేమి శిక్ష?! అత్తవారింట్లో పండగ చేసుకొని వస్తాను ఆరు నెలలు' అని భారవి భార్యను వెంటబెట్టుకొని అత్తవారింటికి వెళ్ళాడు. ’కూతురు-అల్లుడు వచ్చారు!' అని సంతోషపడిన అత్తవారు ఓ రెండు మూడు రోజుల పాటు గొప్ప మర్యాదలు చేసారు.
అయితే తిరిగి వెళ్ళే ముచ్చట ఎత్తట్లేదు అల్లుడు. మూడో రోజుకు 'ఇలా ఊడి పడ్డాడేంటి?’ అనుకున్నారు అత్తవారు. ఓ వారం తిరిగేసరికి ’వీడేంటి, ఇక్కడే తిష్ట వేశాడు?’ అనుకున్నారు. భారవికి ఆదరణ తగ్గింది. ఆపైన అత్తవారింట్లో అందరూ అతనికి పనులు చెప్పటం సాగించారు. నెల గడిచేసరికి అతన్ని పశువుల కొట్టంలో వాటికి తోడుగా పడుకొమ్మన్నారు. పశువులను కడగటం, మేపటం వంటి పనులు అప్పజెప్పారు. మిగిలిపోయిన భోజనం పెట్టసాగారు.
ఇదంతా సహిస్తూ గడువుకోసం ఎదురు చూస్తూ పోయాడు భారవి. ఆర్నెల్ల గడువూ పూర్తి అయ్యిందో లేదో, భార్యాభర్తలిద్దరూ అక్కడినుండి సెలవు పుచ్చుకొని ఇల్లు చేరుకున్నారు. అయితే ఈ ఆరు నెలల్లోనూ భారవికి లోకం తీరు తెలిసి వచ్చింది. కవిగా ఆయన ఎదిగేందుకు ఇది చాలా ఉపయోగపడింది అని చెబుతారు.
ఆ తర్వాత ఓ మారు భారవి భార్య కళ్ళనీరు పెట్టుకుంటూ, చినిగిన చీరను భర్తకు చూపించింది. భారవి ఆమెను ఊరడించి, తాటాకుపై ఓ శ్లోకం వ్రాసి ఇచ్చి, 'ఊళ్ళో ధనవంతుడికి అమ్మి డబ్బు తెచ్చుకో' అన్నాడు.
భారవి భార్య ఆ శ్లోకాన్ని పట్టుకెళ్ళి ఊర్లో శ్రేష్టికి ఇచ్చింది. శ్రేష్టి ఆ శ్లోకాన్ని చదువుకుని ముచ్చటపడి, కొంత డబ్బు ఇచ్చి పంపాడు. ఆపైన దాన్ని కత్తి ఒరలో పెట్టి, ఆ కత్తిని ఒరతో సహా గోడకు వేలాడదీసాడు. అటుపైన పనులలో పడి ఆ సంగతిని మర్చిపోయాడు.
నిజానికి ఆ శ్రేష్ఠి పనిమీద దేశాంతరం వెళుతున్నాడు. ఒకటి రెండు రోజుల తర్వాత భార్యను, ఐదేళ్ళ కుమారుణ్ణి వదిలి ద్వీపాంతరం వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినవాడు మళ్ళీ పదకొండేళ్ళకు కానీ తిరిగి రాలేదు.
ఓ శుభముహూర్తాన ఇంటికి తిరిగి వచ్చిన శ్రేష్టి, భార్య మంచం మీద ఓ యువకుడు పడుకుని ఉండటం చూసాడు. 'తన ఇంట్లో పడుకున్నాడు, వీడెవడు?' అన్న ఆనుమానం అతన్ని దహించి వేసింది. ఆవేశం పట్టలేక గోడకు వేలాడుతున్న కత్తి దూశాడు. ఆ కత్తి ఒర నుండి ఓ తాటాకు ప్రతి రాలి పడింది. అందులో ఇలా వ్రాసి ఉన్నది:
సహసా విదధీత న క్రియాం
అవివేకః పరమాపదాం పదమ్ |
వృణుతే హి విమృశ్యకారిణం
గుణలుబ్ధాః స్వయమేవ సంపదాః ||
తొందరపాటుతో చేసేపని ఆపదలకు కారణమవుతుంది, అందుకని ఒక పని చేసేప్పుడు, చక్కగా పూర్వాపరాలు ఆలోచించి చెయ్యాలి. అలాంటి ఆలోచనాపరునికి సంపదలు తంతట తామే వచ్చి చేరతాయి.
శ్లోకం చదివిన శ్రేష్టి ఆగి, ఒక్క క్షణం ఆలోచించాడు. "మంచం మీద పడుకున్న యువకుడు వేరే ఎవ్వరో కారు- తన కొడుకే! తను వెళ్ళేటప్పుడు వాడు చిన్నవాడు. ఇన్నేళ్ళు గడిచాక ఇంకా చిన్నగా ఎందుకుంటాడు?!" అని అర్థమైంది.
అంతలోనే అక్కడికి వచ్చింది భార్య. శ్రేష్ఠిని చూసి మురిసిపోయింది. ఆ హడావిడికి నిద్రలేచిన కొడుకు తండ్రి చెంత చేరాడు. శ్రేష్ఠి ఇద్దరినీ అక్కున పొదవుకున్నాడు. 'ఈ శ్లోకం నా కుటుంబాన్ని నిలిపింది. ఇది లేకపోతే నా బ్రతుకు ఏమయ్యేది?' అనుకున్నాడు.
ఆ శ్లోకాన్ని తనకు ఇచ్చిన వ్యక్తి కోసం వెతికించాడు. భారవిని కనుక్కుని అతణ్ణి ఘనంగా సన్మానించాడు. ఆ సరికి భారవి కీర్తిప్రతిష్ఠలు దేశమంతా వ్యాపించాయి. తను రచించిన 'కిరాతార్జునీయమ్' అనే కావ్యంలో ఈ శ్లోకానికి తావు కల్పించాడు భారవి.