శంకర్ వారానికి ఒకరోజు అడవికి పోతుంటాడు- కట్టెలకోసం. ఒకసారి అట్లా కట్టె పుల్లలు ఏరుకొచ్చేందుకు అడవికి వెళ్లాడు.
దారిలో ఒక ముసలివాడు ఎదురయ్యాడు. "బాగా ఆకలిగా ఉంది నాయనా, నీ దగ్గర ఏమైనా ఉందా, తినేందుకు?" అని అడిగాడు. శంకర్‌కి అతన్ని చూస్తే జాలి వేసింది. కానీ అతనికి ఇచ్చేందుకు శంకర్ దగ్గర ఏమీ లేదు. నిరుత్సాహంగా తల ఆడించి ముందుకు సాగాడు అతను.
అడవి అంచుల్లోనే అతనికి ఒక జింక ఎదురైంది.
దాహంతో ఆ చుట్టు ప్రక్కల అంతా వెతుకుతున్నది అది నీళ్ల కోసం. శంకర్‌కి దాన్ని చూసి జాలి వేసింది. కానీ తన దగ్గర కూడా నీళ్లు లేవు- ఏం చేయగలడిక?
అట్లానే ముందుకెళ్ళి, తనకు దొరికినన్ని కట్టె పుల్లలు ఏరుకొని మూటకట్టుకున్నాడు.
వెనక్కి తిరిగి వెళ్తుంటే ఒక గుడ్డాయన ఎదురయ్యాడు. "నాయనా! వంటకు బొత్తిగా కట్టెలు లేవు. కొన్ని కట్టెలు ఇవ్వగలవా? నేను వండింది నీకు కూడా కొంచెం పెడతాను" అన్నాడు.
శంకర్‌కి అతన్ని చూస్తే జాలి వేసింది. "సరే, ఇవి నువ్వు తీసుకో. నేను మరిన్ని ఏరుకొచ్చుకుంటాను" అని తను ఏరిక కట్టెలు అతనికి ఇచ్చేసి, ఆ చుట్టుప్రక్కల దొరికిన కట్టెలన్నీ తనకోసం జమ చేసుకున్నాడు.
ఆలోగా వంట పూర్తయింది. గుడ్డాయన తనకు ఇచ్చిన అన్నం మూట కట్టుకొని, కొన్ని నీళ్ళు కూడా తీసుకొని వెనక్కి తిరిగాడు శంకర్.
జింకకు నీళ్ళు, ముసలాయనకు అన్నం ఇచ్చి, తృప్తిగా ఇంటిదారి పట్టాడు.
అంతలోనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు శంకర్ ముందు. "ఇంతకు ముందు కనిపించిన జింక, ముసలాయన, గ్రుడ్డాయన అన్నీ నేను సృష్టించినవే. నువ్వు చాలా మంచి పని చేశావు. నీ ఈ సాయం వృధా పోదు" అని అభినందించి మాయం అయ్యాడు!