చెన్నయ్యకు తల్లి, తండ్రి అంటే అపారమైన గౌరవం. అలాగే చదువంటే కూడా చాలా ఇష్టం. చక్కగా చదివేవాడు. ఊళ్ళో ఉన్న బడిలో ఐదో తరగతి పూర్తి చేశాడు. పై తరగతులకు వేరే ఊరికి వెళ్ళాలి. కానీ తండ్రి ఒద్దనేసాడు.
దాంతో ఇక పన్నెండేళ్ళ చెన్నయ్య బర్రెలు కాయటంలో పడ్డాడు. అప్పుడప్పుడూ మిద్దె పనులకనీ, కూలీకనీ పోయేవాడు, తండ్రితోబాటు. ఒక్కోసారి వాళ్ళ నాన్న ఏదైనా పనిమీద పట్నానికి పంపితే, అప్పుడు బళ్లో సార్లు చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకునేవాడు. అలవాటుగా రోజూ క్రమం తప్పకుండా ఒక కథో, ఒక వార్తో చదువుతూ ఉండేవాడు.
అతనికి పధ్దెనిమిదేళ్ళు వచ్చే సరికి వాళ్ళ అమ్మానాన్నలు పెళ్ళి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. "అయ్యో! ఇప్పుడే పెళ్లి ఏంటి నాన్నా" అన్నాడు చెన్నయ్య కంగారుగా. "అవునురా! ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? నెలకు ఇంత కూలి సంపాదిస్తున్నావు- నీకేంటి? అయినా ఇప్పుడు కాకపోతే మేము ముసలోళ్లం అయ్యాక చేసుకుంటావా?" అని ఎగిరారు తల్లిదండ్రులు. చెన్నయ్య మారు మాటాడలేదు.
చెన్నయ్య భార్య లక్ష్మి మంచిది. అణకువ గలది. కానీ ఏమంటే ఆమెది రెండో తరగతి చదువు! రెండేళ్ళు తిరిగేసరికల్లా వాళ్లకు ఒక కూతురు పుట్టింది. పేరు ప్రియ. అమ్మాయి పుట్టినందుకు చెన్నయ్య తల్లి దండ్రులు, అత్త మామలు చాలా బాధపడ్డారు.
“ఈసారి కొడుకే పుట్టాలి” అన్నారు. కానీ తన జీవితంలో మొదటిసారి, చెన్నయ్య తన నిర్ణయం తను తీసుకున్నాడు: ఎవరు ఏం చెప్పినా వినలేదు. వెళ్ళి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడు! "ఊరికే అల్లరి చేయద్దండి. నేను సంపాదించే ఈ కాసిని డబ్బులతో ఇల్లు ఎలా గడుస్తుందనుకుంటున్నారు? కొడుకైనా, కూతురైనా ఒక్కరే చాలు!” అని గట్టిగా చెప్పేసాడు.
కాలం గడిచింది. ప్రియకు బడి వయసు వచ్చింది. బడిలో చేర్చాడు చెన్నయ్య: 'నాకు ఎలాగూ చదువులేదు. కాబట్టి, ఎలాగైనా నా కూతురిని చదివించాలి. ఎంత కష్టపడైనా సరే, ప్రియను పెద్ద చదువు చదివిస్తాను” అనుకునేవాడు.
కానీ, ప్రియను చదివించటం ఇంట్లో పెద్దవాళ్లెవ్వరికీ ఇష్టం లేదు. "ఆడపిల్లకు చదువు ఎందుకురా? పోనీ ఇంకో పిల్లోడన్నా పుడతాడంటే, అదీ లేకపాయె!" అంటూ గొణిగేవాళ్ళు. ప్రియ ఐదవ తరగతి మంచి మార్కులతో పాసయ్యింది. చెన్నయ్య ఆ పాపను పట్నం హైస్కూల్లో చేరుస్తానన్నాడు.
తండ్రి ఒప్పుకోలేదు. కానీ, చెన్నయ్య "నాన్నా! నన్ను నువ్వు ఎలాగూ చదువుకోనీయలేదు. నీకేం తెలుసు నాన్నా, చదువు విలువ?! ఆరోజు నీకు ఎదురు చెప్పటం ఇష్టం లేక, చదువు మానుకున్నా. సార్లు చెప్పింది వినలేదా- "పిల్లలు బడికి- పెద్దలు పనికి!" అని? పనులు చేసేందుకు ఇంట్లో మనం నలుగురం పెద్దవాళ్లం ఉన్నాం. ఇదిగో, ఇప్పుడు చెబుతున్నా- ఎవరు ఔనన్నా, కాదన్నా నా కూతురిని మాత్రం చదివించి తీరుతా. ఈ విషయంలో నేనింక ఎవ్వరి మాటా వినదలచుకోలేదు" అంటూ ఎంత కోపంగా అరిచాడంటే, ఇక ఆపైన ఎవ్వరూ మాట్లాడలేదు.
ప్రియ పదవ తరగతి పాసైంది. మంచి మార్కులు కూడా వచ్చాయి. "మన ప్రియకి ఫస్ట్ మార్కంట. అంతే కాదు, గవర్నమెంటు కాలేజీలో సీటు కూడ్ ఫ్రీ అంట.." అని చెన్నయ్య సంతోషంగా చెబితే "చాల్లే, సంబడం" అంటూ పెదవి విరిచి, అమ్మా, నాన్నా లోపలికి వెళ్లిపోయారు.
అటుపైన ప్రియను ప్రభుత్వమే ఉచితంగా ఇంజనీరింగ్ చదివించింది. దారి ఖర్చులకు తప్ప, ప్రియ చదువుకంటూ పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరమే రాలేదు చెన్నయ్యకు!
ఆ సరికి అతని తల్లిదండ్రులు ముసలి వాళ్లు అయిపోయారు. అయినా వాళ్ళు, ఊళ్ళో జనాలు అంతా చెన్నయ్యను పిచ్చోడిలాగానే చూసేవాళ్ళు: "వీడో పిచ్చోడు. ఆడ పిల్లకు చదువంట! ఏడ్చినట్టే ఉంది!" అని గొణుక్కునేవారు.
చూస్తూండగానే ప్రియ చదువు పూర్తయింది. మంచి మార్కులతో పాసయిన ప్రియకు వెంటనే ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చింది. ప్రభుత్వంవారు ఆమెకు ప్రత్యేకంగా కారు కూడా ఇచ్చారు! ఊర్లోకి కారులో వచ్చిన ప్రియను చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. మనసులో "అబ్బా!" అనుకున్నా, బయటికి మటుకు ఏమీ మాట్లాడలేదు.
మరో రెండేళ్ల తరువాత, ఊర్లోకి ఎవరో కోటీశ్వరులు- పెద్ద కారు వేసుకొని వచ్చారు. చేతుల నిండా బంగారు గాజులు, ఒంటినిండా బంగారం, పట్టు చీరతో మెరిసిపోతున్నది కారులో ఉన్న పెద్దావిడ. ఆమె భర్త పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని రాజసంగా ఉన్నాడు. ఆయన ఒక్కో వేలుకూ ఒక్కో రకం ఉంగరం మెరుస్తోంది. "ఇక్కడ రామయ్యగారి అబ్బాయి చెన్నయ్య అంటే ఎవరండీ? వాళ్ళ అమ్మాయి ఇంజనీరు-" అంటూ ఎంక్వయిరీ చేసుకుంటూ వచ్చారు.
అందరూ "ఏంటబ్బా? ఎందుకు అడుగుతున్నారు? బిడ్డను చదివించాడుగా, ఏదో! ఆ పాప ఏదో చేసి ఉంటది. గొప్పోళ్లతో పెట్టుకుంటే అలాగే ఉంటది మరి. ఇప్పుడు వీడికి పోయే కాలం వచ్చింది. అయినా ఏం జరిగిందో చూద్దాం" అనుకుంటూ ఊరి జనాలు కొందరు కారు వెనకాలనే పడి వచ్చారు చెన్నయ్య ఇంటికి.
"అయ్యా! కూర్చోండి" అని మంచం వాల్చాడు చెన్నయ్య- మజ్జిగ తెమ్మని భార్యకు పురమాయిస్తూ. "చెప్పండయ్యా" అన్నాడు బెరుకు బెరుగ్గానే.
"ఇంజనీరు ప్రియ..మీ అమ్మాయేనా?!" అడిగాడు కోటీశ్వరుడు.
"అవునండయా"
"కంగారు పడకండి- నా పేరు జానకి రామయ్య. ఈమె నా భార్య, సీత. మాకు ఒక్కగానొక్క కొడుకు, రవి. మీ అమ్మాయిదీ, మా అబ్బాయిదీ ఒకే ఆఫీసు " చెప్పాడు కోటీశ్వరుడు.
"అనుకున్నా. ఏదో జరిగి ఉంటుందని!" ఊర్లో వాళ్లలో గుసగుసలు మొదలయ్యాయి. విన్న చెన్నయ్యకు భయం పెరిగింది- కోటీశ్వరుడు కొనసాగించాడు. "చెన్నయ్యగారూ! మాకు దాదాపు ఒక ఐదు కోట్ల పైనే ఆస్తులు ఉన్నాయి. మీ అమ్మాయిని మేం చూసాం. మా అబ్బాయికి తగిన పిల్ల అనిపించింది. ఇదిగో, మావాడి ఫొటో తీసుకొచ్చాం. మీ అమ్మాయి తెలివితేటలు, పని సామర్థ్యం, మంచితనం ఇవన్నీ మావాడికి కూడా చాలా నచ్చాయి. ఇప్పుడు మిమ్మల్ని ఆ విషయం అడగడానికే వచ్చాము. మీ అమ్మాయిని అడిగితే, 'అంతా మా అమ్మానాన్నల ఇష్టం' అన్నది. వెంటనే బయలుదేరి ఇలా వచ్చాం!" అన్నాడు కోటీశ్వరుడు.
ఈ మాట వినగానే ఊర్లో వాళ్లంతా నోర్లు వెళ్లబెట్టారు. ముసలి రామయ్యకు ఏడుపొచ్చింది. చెన్నయ్యకు, లక్ష్మికి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
కొద్దిసేపటికి ఆనందబాష్పాలను తుడుచుకుంటూ- "రేపు పండక్కి అమ్మాయి వస్తుంది; దానితో ఒక మాట మాట్లాడి-" చిన్నగా అన్నాడు చెన్నయ్య.
"ఓఁ అలాగే! ఏ ఇబ్బందీ లేదు. నిదానంగానే అన్నీ ఆలోచించుకొని చెప్పండి. మా ఇల్లు, ఫోన్ నెంబరు అన్నీ అమ్మాయికి
ఇచ్చి వచ్చాం... మరి వెళ్లొస్తాం" అని లేచారు. కారు బయలుదేరి వెళ్లింది.
రామయ్య ఉబ్బితబ్బవుతూ "ఒరే! చెన్నా! ఏమోననుకున్నా గానీ, మన ప్రియమ్మను చదివించి మంచిపని చేసావురా! ఇదంతా దాని చదువు వల్లే!" అంటూ కొడుకును పట్టుకొని కన్నీరు కార్చాడు.
ప్రియ పెళ్లి ఊళ్ళోనే, వైభవంగా జరిగింది. ఖర్చంతా మగ పెళ్లివారే పెట్టుకున్నారు. ఎన్నడూ కనీ, వినీ ఎరుగని రీతిలో భోజనాలు చేశారు. ఊర్లో ఒక్కరిని కూడా పోనీయకుండా చెన్నయ్య అందరినీ భోజనాలు చేసేంతవరకూ ఇంటింటికీ తిరుగుతూనే ఉన్నాడు.
"మీ కుటుంబం అంతా మాతో బాటు నగరానికి వచ్చెయ్యండి" అని బలవంతం చేసిన అల్లుడితో చెన్నయ్య "ఒద్దులే బాబూ! అందరూ ఉన్న ఊరిని వదిలి వెళ్తే ఎలా? మీరు కుర్రవాళ్లు; అవకాశం ఉన్నవాళ్లు. అంతగా మేలు చేయాలనుకుంటే ఓ పని చేయండి: ఈ ఊర్లో పెద్ద బడి ఒకటి కట్టించండి. అందరూ వేరే ఊరికి వెళ్ళి పై చదువులు చదవలేకపోతున్నారు కదా" అన్నాడు.
ఆ విధంగా చెన్నయ్య సలహా మేరకు, ప్రియ వాళ్ల కృషి ఫలితంగా ఊళ్లో ఉన్న చిన్న బడి కాస్తా మరో చోట- ఆరు ఎకరాల స్థలంలోకి- వెళ్లింది. వసతులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం స్పందించటం వల్ల అక్కడ హైస్కూలు కూడా ఏర్పడింది. ఇప్పుడు ఊళ్లో అందరికీ చెన్నయ్య, ప్రియలు ఆదర్శం!
"పెద్దలంతా పనికి. పిల్లలంతా బడికి!”