తరగతిలోని పిల్లలందరికంటే కొంచెం పెద్దవాడు విజయ్; చాలా అల్లరి పిల్లాడు కూడా. ఆలోచన అనేదే లేకుండా ఎప్పుడూ ఏదో ఒక చిలిపి పని చేసి, ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉండేవాడు. టీచర్లు, పెద్దలు చేయద్దన్నదల్లా చేస్తూ ఉండేవాడు ఊరికే.
ఒకసారి ఆదివారం బడికి సెలవు. విజయ్‌కి వేరే పనేమీ లేక, 'ఏం చేద్దామా' అని ఆలోచించాడు. చేను దగ్గర బావి ఉంది. తనకి ఈత రాదు; అయినా "బావిలో రాళ్ళు వేస్తూంటే బలే ఉంటుంది" అనుకున్నాడు.
చేను కాడికి బయల్దేరాడు. పొలాల వెంబడి నడుచుకుంటూ పోతున్నాడు- దారిలో చెరువు గట్టున మర్రిచెట్టు ఒకటి కనిపించింది. దాని పేరే కోతుల మర్రి. దానినిండా ఎప్పుడూ వందల వందల కోతులు ఉంటై. విజయ్‌కి వాటిని ఏడిపించాలని మనసైంది. ఇంకేముంది; నేలమీదున్న రాళ్ళను ఏరుకొని, వాటి మీదికి విసరటం మొదలెట్టాడు.
కోతులన్నీ 'గుర్రు గుర్రు' మన్నాయి. అన్నీ ఒకేసారి చెట్టుదిగి వాడి వెంట పడ్డాయి. “బాబోయ్ కాపాడండి! కాపాడండి!!" అంటూ విజయ్ పొలం గట్ల వెంట పరిగెత్తాడు.
అకస్మాత్తుగా వాడి కాలుని ఏదో చుట్టుకున్నట్లూ, కరిచినట్లూ అనిపించింది. 'పామే!' అనిపించింది వాడికి. “వామ్మో! పాము!" అని కేకలు పెడుతూనే పరుగు కొనసాగించాడు వాడు. దగ్గరలోనే పని చేసుకుంటున్న ముసలి రైతు ఒకడు ఆ పొలికేకలు విని గబగబా వచ్చాడు. పని చేస్తున్న కూలీలు కూడా పరుగున వచ్చారు.
వాళ్లలో ఒకాయన వెంటనే 108కి ఫోన్ చేశాడు. ముసలాయనేమో తన కండువా చింపి విజయ్ తొడ క్రిందుగా గట్టి కట్టు కట్టాడు. అంతలో అంబులెన్సు వాళ్ళు రావటం, వాడిని దానిలోకి ఎక్కించి ఆసుపత్రికి తీసుకువెళ్లటం జరిగిపోయాయి. అక్కడ డాక్టర్‌గారు గాయాన్ని గమనించి, అది పాము కాదని తేల్చారు. అయినా మంచిదే, ఇంజక్షన్లు వేసుకోవాలి అని వరసగా నాలుగైదు ఇంజక్షన్లు ఇచ్చారు. అవన్నీ అయినాక నీరసంగా ఇంటికొచ్చాడు విజయ్.
దాంతో బుద్ధి వచ్చినట్లుంది- విజయ్ కొంచెం పెద్దయ్యాడు: అల్లరి తగ్గించి ఇప్పుడిప్పుడే కొంచెంగా చదువులో పడ్డాడు!