అనగనగా ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో చాలా జంతువులు ఉండేవి. అడవిలో దారులన్నీ తికమక పెట్టేలా ఉండేవి. ఆ అడవిలో ఒక మనిషి కూడా ఉండేవాడు. అతని పేరు టార్జాన్. టార్జాన్ జంతువులను ప్రేమించేవాడు. వాటిని రక్షించేవాడు.

ఒకసారి ఆ అడవిలోకి కొందరు వేటగాళ్లు వచ్చారు. జంతువులను చంపి వాటి చర్మాలను వేరే దేశాలలో అమ్మి డబ్బు సంపాదిస్తుంటారు వాళ్ళు. ఈ సంగతి టార్జాన్‌కి తెలిసింది. అతను వేటగాళ్ళకోసం వెతుక్కుంటూ పోయాడు. కోతులు, పక్షులు అన్నీ టార్జాన్‌కి తెలియజేసాయి, వేటగాళ్లు ఎక్కడున్నారో. టార్జాన్ ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి వేటగాళ్లంతా ఒక పులిని వెంటాడుతున్నారు.

టార్జాన్ ధైర్యంగా పులికి అడ్డంగా వేటగాళ్ల ముందు నిల్చొని "ఆగండి! నేను ఉండగా మీరు ఈ పులిని చంపలేరు!” అని హెచ్చరించాడు. అయితే ఆ వేటగాళ్లంతా వెటకారంగా నవ్వి టార్జాన్‌నే షూట్ చేసారు. టార్జాన్ వాళ్ళందరినుండీ తప్పించుకొని, పైనుండి వ్రేలాడే ఊడల్ని పట్టుకొని ఊగుతూ దగ్గర్లోనే ఉన్న ఓ కొండ మీదికి చేరుకున్నాడు.

అడవిలో ఉన్న జంతువులన్నిటికీ అడవిలో ఏం జరుగుతున్నదో తెలిసింది. అన్నీ టార్జాన్ వెనక గుండ్రగా నిలబడ్డాయి. వాటన్నిటి మధ్యలో నిలబడిన టార్జాన్‌ని చూసి వేటగాళ్ళు ఆశ్చర్యపోయారు.

అప్పుడు టార్జాన్ వేటగాళ్లతో "చూడండి, ప్రాణం మీ మనుషులొక్కరికే కాదు- మా జంతువులకు ఉండేది కూడా ప్రాణమే. మీరు మాకు ఏలాంటి సాయమూ చెయ్యకపోయినా పరవాలేదు కానీ దయచేసి మా దారిన మమ్మల్ని బ్రతకనివ్వండి. ఊరికే మా ప్రాణాలు తీసేందుకు అడవిలోకి రాకండి. మీరు మాకు కష్టం కలిగించకపోతే మేము కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యం.

అట్లా కాదంటే ఇక యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధంలో మరి మీరు గెలుస్తారో, జంతువులు గెలుస్తాయో ఊహింంచుకోండి" అని చెప్పాడు.

అతని ధైర్యాన్ని, అడవి జంతువులకు అతని పట్ల ఉన్న గౌరవాన్ని చూసి వేటగాళ్ల మనసులు మారాయి. వాళ్లంతా మౌనంగా అడవి నుండి వెనక్కి తిరిగారు.