పానకాలయ్య ఓ సన్నకారు రైతు. అతని కుమారుడు మేధోమూర్తి. 'తాను చదువుకోకపోయినా, కొడుకు చదివితే చాలు' అనుకునేవాడు పానకాలయ్య.

కానీ పొలంలో కష్టపడితే ఇల్లు బొటాబొటిగా గడిచేది పానకాలయ్యకు. ఇక మేధోమూర్తి చదువు కోసం ఏమంత మిగిలేది కాదు- ఏ ఏటికాయేడు అప్పు చేయాల్సి వచ్చేది. 'ఎలాగోలా అప్పు తీరుద్దాంలే' అని అప్పట్లో అనుకున్నాడు. కానీ అనుకున్నది నెరవేరాలని లేదు కదా! మేధో మూర్తి చదువు పూర్తయ్యేసరికి అప్పు రెండితలయ్యింది.

'కొడుకు ఏదైనా పని చేసుకొని, తన చదువు కోసం చేసిన అప్పులు తీర్చుకుంటాడు' అని ఆశపడ్డాడు పానకాలయ్య. అయితే ఆ సంగతి ఎత్తగానే మేధోమూర్తి చికాకు పడ్డాడు- "నువ్వు చేసిన అప్పుకు నేనెట్లా బాధ్యుణ్ణి అవుతాను?” అనేసాడు.

పానకాలయ్యకు ఏం చెప్పాలో తోచలేదు. "అదేంటిరా, ఆ అప్పులు చేసింది నీ చదువు కోసమేగా? నువ్వు చదువుకొని ఏదో ఒక మంచి పని చేసుకుంటూ మన కుటుంబాన్ని నడిపిస్తావనేగా?” అన్నాడు.

"అట్లా ఊహించుకోకండి. మీరనేది ఒకప్పటి మాట. ఇప్పుడు కాలం మారింది. జీవితం వేగంగా నడుస్తున్నది. ఇప్పటి యువకులకు స్వేచ్ఛ కావాలి. 'మన కుటుంబం' అని భజన చేసుకుంటూ, ఊరికే మీకు సేవలు చేస్తూ కూర్చుంటే నా పనులు సాగవు.

ఇంకో సంగతి- మీకు చెప్పలేదుగానీ, నాకు పోయిన సంవత్సరమే ఉద్యోగం వచ్చింది. కంపెనీ వాళ్ళు మా కాలేజీకే వచ్చి కాల్‌లెటర్ ఇచ్చి వెళ్ళారు. మంచి జీతమే వస్తుంది. నా బ్రతుకు నేను బ్రతుకచ్చు. మీ సంగతి మీరు చూసుకోండి- మరోలా అనుకోకండి" అని చెప్పి, చకచకా బట్టలు సర్దుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు కొడుకు.

పానకాలయ్యకు కళ్ళు తిరిగాయి. "అయినా వీడిని చదివించే బాధ్యత నాదే- అప్పు చేసినా, సొప్పు చేసినా అంతా నా బాధ్యతే కదా, వాడికి అప్పు తీర్చాల్సిన అవసరం ఏమీ లేదు నిజంగానే" అని సర్ది చెప్పుకొని, తానే వేరే ఏర్పాటు చేసుకున్నాడు.

అట్లా కొంత కాలం గడిచాక, అనుకోని రీతిగా వరసగా కొన్నేళ్ళపాటు వర్షాలు బాగా పడ్డాయి. అన్నీ అనుకూలించాయి.

పంటలు బాగా పండాయి; ధరలు కూడా బాగా వచ్చాయి. ఊహించనంత డబ్బు వచ్చింది పానకాలయ్యకు. దాంతో కుటుంబం గట్టెక్కింది. అప్పులన్నీ తీరటమేగాక, కష్టాల్లో ఉన్నవారికి ఒకింత దానం చెయ్యగల స్థితికి వచ్చాడు.

నిజంగానే "కాలం ఓ అనుకూల ప్రతికూల పవనాల సమూహం కదా, ఓ చిత్ర విన్యాస కెరటం అది”.

ఎంతో సంపాదిద్దామని బయటికి వెళ్లిన మేధోమూర్తి 'అంతా నేనే- అంతా నా యిష్టం' అనే గర్వంతో విచక్షణా రహితంగా ప్రవర్తించి తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేయాల్సిన స్థితికి చేరుకున్నాడు. కంపెనీవాళ్ళు అతన్ని వదిలించుకోవ-టమేగాక, తోటి కంపెనీలకు కూడా అతని గురించి చెడుగా చెప్పటంతో, అతనికి ఇక ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. అలా కొంతకాలం గడిచేసరికి మేధోమూర్తికి బ్రతుకంటే భయం పట్టుకున్నది. మనసు దుర్బలమై; వెర్రివాడిలా ఎటుపడితే అటు తిరగనారంభించాడు.

ఓసారి ఎరువులు తెచ్చేందుకని పట్నం వెళ్ళిన పానకాలయ్యకు చినిగిపోయిన దుస్తులతో దర్శనమిచ్చాడు మేధోమూర్తి! బిడ్డను గుర్తు పట్టిన పానకాలయ్య గబగబా అతని దగ్గరికి వెళ్లి ప్రేమగా "నాయనా, మూర్తీ! ఎలా ఉన్నావురా? ఏంటిరా, ఇలా అయ్యావు?” అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.

అన్నేళ్ల తరువాత తండ్రిని చూసిన మూర్తి ఏమీ మాట్లాడలేదు; ఏడుస్తూ తండ్రి పాదాల మీద పడ్డాడు. వాడిని ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయించి, భోజనం పెట్టి, తనతో పాటే వ్యవసాయపు పనులు నేర్పి, మళ్ళీ ఓసారి ప్రయోజకుడిని చేశాడు పానకాలయ్య.

ఆ తర్వాత మేధోమూర్తి కుదురుకున్నాడు.

తండ్రితోబాటు వ్యవసాయంలో నిలద్రొక్కు-కొని, మెల్లగా తన చదువుకు తగిన పనులు కూడా చేసుకుంటూ, 'మంచివాడు' అని పేరు తెచ్చుకున్నాడు.