విక్రమపురిరాజు విజయసింహుడికి వివాహం అయిన చాలా సంవత్సరాలకు రాణి పద్మావతి దేవి గర్భం దాల్చింది. నెలలు నిండకనే మగ శిశువును ప్రసవించింది.

ఆ సమయానికి విజయసింహుడు నగరంలో లేడు. అతను వచ్చి చూసేసరికి పిల్లవాడు పురిట్లోనే కన్ను మూశాడన్న వార్త అందింది. పుత్ర సంతానం మీద విపరీతమైన అభిమానాన్ని పెంచుకున్న రాజు తీవ్ర నిరాశకు గురయ్యాడు. మనస్తాపంతో అనారోగ్యం పాలై త్వరలోనే కాలం చేశాడు .

తదనంతరం రాజ్యం అతని తమ్ముడు మాధవసేనుడి పాల పడింది. మాధవసేనుడికి విజయసింహుడికున్న మంచి గుణాలేవీ లేవు. దాంతో పరిపాలన గతి తప్పింది. ప్రజలు అష్టకష్టాలు పడనారంభించారు. మాధవ సేనుడు అవసరం లేనివాటికి నిధులు లేవనేవాడు. అనవసరమైనవాటికి లెక్కలేనన్ని నిధులిచ్చేవాడు.

కొలువులో ఉన్న ఉద్యోగులకు అడగకుండానే జీతాలు ఇమ్మడి ముబ్బడిగా పెంచాడు. ఆ భారాన్ని తట్టుకోడానికి ధరలనూ పెంచాడు. యువకులకు పనులు దొరకలేదు. దొంగలు ఎక్కువయ్యారు. మద్యాన్ని ప్రభుత్వమే అమ్మాలని, ప్రతి వ్యక్తీ తప్పక మద్యాన్ని సేవించాలని శాసనం చేసాడు రాజు. వీటన్నింటితోటీ పాలన అస్తవ్యస్తమైంది. తిరుగుబాటు దారులు
తయారయ్యారు.

ఇట్లా కొన్నేళ్ళు గడిచాక మాధవసేనుడు హత్య చేయబడ్డాడు. అతగాడికి కుమారులు లేకపోవటంతో రాజే లేకుండా పోయాడు.

ఇప్పుడు 'ఎవరిని రాజును చేయాలా' అని పెద్దలంతా తలపట్టుకొని కూర్చున్నారు. చివరికి అందరూ కలిసి ఓ నిర్ణయానికొచ్చారు: పట్టపుటేనుగుకి పూలమాలనిచ్చి పురవీధులలో త్రిప్పాలి. అది ఆ మాలను ఎవరి మెడలో వేస్తే వారే రాజు.

అయితే వాళ్ళు ఇలా చేస్తారని ముందుగానే ఊహించాడు పట్టపుటేనుగును పోషించే మావటి. అతనిలో దురాశ ప్రారంభమైంది.

మనసులోనే ఓ ప్రణాళికను రూపొందించుకున్నాడు. ఏ మాత్రమూ ఆలస్యం చేయకుండా తన ప్రణాళికను కార్యరూపంలో పెట్టాడు.

యుక్తవయస్కుడైన తన కొడుకును గజశాలకు రమ్మన్నాడు. ఏనుగుకి అనేక పర్యాయాలు పూలమాలనిచ్చి, తన కొడుకు మెడలో వేయించాడు. ఇలా దానికి శిక్షణ నిచ్చే అవకాశాన్ని దొరికినన్ని రోజులపాటు తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడు!

అంతలో అనుకున్న ముహూర్తం రానే వచ్చింది. పట్టపుటేనుగుకు పూలమాలనిచ్చి పుర వీధులలో వదిలారు. లక్షలాది మంది పురజనులు రహదారులకు రెండు వైపులా నిలబడి జయజయధ్వానాలు చేయసాగారు. అనేకమంది ఏనుగును అనుసరించసాగారు. ఏనుగు అందరినీ దాటుకొని సరిహద్దుల్లో ఉన్న దేవాలయం వద్దకు చేరుకున్నది.

దేవాలయం ముందు నుంచుని ఉన్నాడు మావటి కుమారుడు. ఏనుగు ఒక్కొక్క అడుగూ ముందుకు వేస్తూ ఆ కుర్రవాడిని సమీపించింది.

సరిగ్గా అదే సమయానికి భగవంతుడికి సమర్పించేందుకు కొన్ని ఫలాలు పట్టుకొని అటుగా వచ్చాడొక బ్రాహ్మణ యువకుడు ఆదిత్యుడు. ఏనుగు అతన్ని చూడగానే దిశ మార్చుకున్నది. అతగాడి మెడలో పూలమాలను వేసి, అతని చేతిలోని పండ్లను తను తీసుకున్నది.

గుడిలో గంటలు గణ గణ మోగాయి

పురజనులందరూ పట్టపుటేనుగు నిర్ణయాన్ని స్వాగతించారు. మావటివాడు, ఆతని కొడుకు నిర్ఘాంతపోయారు.

ఆదిత్యుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. అతని తండ్రి సుదర్శనాచార్య మాత్రం మనసులోనే భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుని, ఎన్నో ఏళ్ల క్రితం తను చేసిన తప్పును తలచుకొని పశ్చాత్తాపపడ్డాడు: రాజు అవ్వాలనే దురాశతో మాధవసేనుడు తనను బెదిరించి రాణీవారి సందిటనున్న పురిటి బిడ్డకు మత్తు మందు ఇప్పించాడు. ఆపైన వాడు చనిపోయాడని చెప్పించి; అందరినీ నమ్మించటమే కాక, ఆ విధంగా విజయసింహుడి మరణానికి కారకుడైనాడు. అట్లా చివరికి తానే రాజైనాడు! ఇక తను అతని ఆజ్ఞ ప్రకారం ఆ పిల్లవాడిని చంపలేక, ఎవ్వరికీ తెలీకుండా రహస్యంగా తన బిడ్డగా పెంచాడు- నిజానికి ఆదిత్యుడు విజయసింహుడి కొడుకే! ధర్మాత్ముడైన రాజుగారి కొడుకుకే తిరిగి రాజ్యం దక్కింది!

అనుకోకుండా రాజైన ఆదిత్యుడు కాలక్రమాన గొప్ప పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు.