ఒక రోజు రాము తన బంతితో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ బంతి అంటే వాడికి చాలా ఇష్టం. "ఎంతసేపటి నుండి ఆడుకుంటూ ఉన్నానో, ఆకలిగా ఉంది! చల్లగా ఏమైనా తినాలనిపిస్తూంది. టీవీ చూస్తూ ఐస్క్రీమ్ తిందాం!” అనుకున్నాడు వాడు.
"అమ్మా నాకు ఐస్క్రీమ్ కావాలి! ఇస్తావా?!” అని కేకలు పెట్టాడు.
అమ్మ ఒక ఐస్క్రీమ్ తెచ్చి ఇచ్చింది. అది తినగానే 'ఇంకోటి కావాలి' అని అడిగాడు రాము. అప్పుడు అమ్మ ’వద్దు. నీకు కడుపులో తిప్పుతుంది’ అని చెప్పింది.
"కానీ నాకు ఇంకా ఆకలి వేస్తోంది! నాకు ఇంకో ఐస్క్రీమ్ కావాలి! దానితోపాటు ఒక కురుకురె ప్యాకెట్టు కూడా కావాలి!” అని పేచీ మొదలెట్టాడు రాము.
దాంతో వాళ్ళ అమ్మకు కోపం వచ్చింది. ’నీకు ఏం కావాలంటే అది తిను- కానీ ముందే చెబుతున్నాను- నీకు కడుపులో తిప్పితే మటుకు నాకు చెప్పకు’ అన్నది.
అప్పుడు వాడు ఐస్క్రీమ్‌లు, కుర్‌కురేలు అన్నీ తింటూ మూడు గంటల పాటు టీవీ చూస్తూనే కూర్చున్నాడు. ఆ సరికి అమ్మ, నాన్న అందరూ నిద్రపోయారు.
ఆరోజు అర్ధరాత్రి నిద్ర లేచి ’అమ్మా, కడుపు తిప్పుతోంది, కళ్ళు కూడా మండుతున్నాయి’ అని ఏడ్చాడు రాము.
"అందుకేగదా, ఐస్‌క్రీమ్‌లు, కుర్‌కురేలు తినద్దురా, అన్నది? ఇప్పుడేం చేస్తాం? పద, డాక్టర్ దగ్గరకు!" అని డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళింది అమ్మ.
డాక్టర్ మందులిస్తూ ’ఇవిగో, ఈ మందులు వేసుకో. ఇకనైనా అమ్మ మాట విని మంచిగా ఉంటావుగా?’ అన్నాడు. ’ఓఁ తప్పకుండా వింటానండి డాక్టర్ గారు’ మర్యాదగా తల ఊపాడు రాము!