రామాపురంలో రాము సోము అనే ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. రాముకు పదేళ్లు. సోముకు ఆరేళ్లు. వాళ్లిద్దరూ ఎక్కడికెళ్లినా కలిసి తిరిగేవాళ్లు; చాలా సార్లు కలిసి తినేవాళ్లు; ఎప్పుడూ కలిసి ఆడుకునేవాళ్లు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఊళ్లో వాళ్లంతా వాళ్లని చూసి మురిపెంగా నవ్వుకునేవాళ్లు.

ఒకరోజున రాము-సోములిద్దరూ గాలి పటాలు ఎగరేసేందుకు ఊరి అవతలికి వెళ్లారు. గాలి తగినంతగా ఉంది. రోడ్డంతా ఖాళీగా ఉంది. రాము గాలి పటాన్ని ఎగరేస్తూ వెనక్కి నడుస్తూ ఉంటే సోము దారపు కండెని చేతిలో పట్టుకొని గంతులేస్తున్నాడు.

ఆ హడావిడిలో ఇద్దరూ చూసుకోనేలేదు: వాళ్లు ఊరికి చాలా దూరంగా, అడవి అంచుకు వచ్చేశారు! ఆ సమీపంలో నర మానవుడు అంటూ ఎవ్వరూ లేరు.

అయినా రాము సోములకు ఏం భయం? రాము వెనక్కి నడుస్తూనే పోయాడు. సోము గంతులేస్తూనే పోయాడు. అయితే అకస్మాత్తుగా వాళ్ల సంతోషం పెద్ద గందరగోళంగా మారింది: ఒక బండరాయిని తట్టుకొని రాము జారి పడ్డాడు- పడటం పడటం

నేరుగా అక్కడున్న ఓ లోతైన బావిలో పడిపోయాడు!

బావిలో చాలా నీళ్లు ఉన్నాయి- కానీ పదేళ్ల రవికి ఇంకా ఈత రాదు. వాడు మునుగుతూ తేలుతూ చేతులు పైకెత్తి కేకలు వేయటం మొదలెట్టాడు.

బావి అంచుకు పరుగున చేరుకున్న సోము 'పెద్ద వాళ్లెవరైనా దగ్గర్లో ఉన్నారేమో' అని చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు. అయితే అక్కడే ఉన్న చేద తాడు బొక్కెన వాడి కంటపడ్డాయి.

ఏమాత్రం ఆలోచనలేకనే వాడు తాడును పట్టుకొని బొక్కెనను బావిలోకి జారవిడుస్తూ "ఇదిగో రామూ! దీన్నందుకో! వదలకు! గట్టిగా పట్టుకో! నేను నిన్ను పైకి లాగుతాను!" అని అరిచాడు.

బొక్కెన అందించే తడవు రాము దాన్ని గట్టిగా పట్టుకొని వ్రేలాడటం మొదలుపెట్టాడు. సోము శక్తినంతటినీ వెచ్చించి మిత్రుడిని పైకి లాగటం మొదలు పెట్టాడు. మెల్లగా బావి అంచుకు రాచుకుంటూ రాచుకుంటూ, రాము ఉన్న బక్కెట్టు ఒక్కొక్క అంగళంగా పైకి జరుగుతూ పోయింది.

మోకును పట్టుకొని లాగుతున్న పిల్లవాడు సోముకు చేతులు దోక్కొపోయి రక్తం కారింది. అయిన వాడు తాడుని చేయి జారనివ్వలేదు. కొద్దిసేపటికి బొక్కెనతో పాటు రాము బావిపైకి చేరుకున్నాడు క్షేమంగా.

మిత్రులిద్దరూ కాళ్లు చేతులు వణుకుతుండగా ఒకరినొకరు అభినందిం-చుకున్నారు. కళ్ల నీళ్లుపెట్టారు. అక్కడే ఇద్దరు కొంతసేపు చతికిల పడ్డారు. అటుపైన సాయంకాలం అవుతుండగా బయలుదేరి ఊర్లోకి వచ్చారు.

వాళ్ల వాలకాన్ని చూసిన పెద్దవాళ్లంతా" ఏమైంది, ఏమైంది?!" అని అడిగారు.

"చెబితే పెద్ద వాళ్లు కొడతారేమో" అని భయపడ్డారు రాము సోములు. అయితే వాళ్లనెవ్వరూ ఏమీ అనలేదు-

అంతేకాదు. వాళ్లు వాళ్ల మాటల్ని కూడా ఎవ్వరూ నమ్మలేదు! "పోండిరా! ఇంకెవ్వరి చెవుళ్లో అయిన పూలు పెట్టండి. కట్టు కథలు చెబితే నమ్మేందుకు మేం ఏమన్నా తిక్కలోళ్లమా?" అన్నారు.

ఆ సమయంలో వాళ్ళ మాటల్ని నమ్మిందీ, మనస్ఫూర్తిగా వాళ్లను మెచ్చుకున్నదీ ఆ ఊరి చివరన ఉండే పెద్దతాత ఒక్కడే. "అయినా తాతా, ఊరికే కాకపోతే ఇదెలా సాధ్యమో చెప్పు? ఆరేళ్ల సోము తనకు రెట్టింపు బరువు ఉండే రాముని అంతలోతైన బావులోంచి ఒక్కడే పైకి ఎలా లాగుతాడు?” అడిగారు ఊళ్ళోవాళ్ళు, మన లాగానే.

తాత నవ్వుతూ చెప్పాడు: "మానవునిలో అంతర్గతంగా అనంతమైన శక్తి ఉంది. అయితే సామాన్యంగా మనం అందరం ఒకరినొకరం వెనక్కి లాక్కుంటూనో, అనుమానిస్తూనో, చిన్నబోతూనో, మన ఆలోచనలతో మనల్ని మనమే నిర్వీర్యులం చేసుకుంటూంటాం.

నిజానికి ఆరేళ్ల పిల్లవాడు తనకు రెట్టింపు బరువున్న స్నేహితుడిని బావిలోంచి పైకి లాగటం మనం అనుకుంటున్నంత అసాధ్యం ఏమీ కాదు-

ఎందుకంటే ఆ సమయంలో "నువ్వు ఈ పని చేయలేవు"; "నీకిది చేత కాదు"; "నీకు ఇది రాదు"; "నువ్వు చిన్న పిల్లవాడివి"- అనేందుకు అక్కడెవ్వరూ లేరు కదా; అంతేకాక ఆ పిల్లవాడు తనకి తానుగా అట్లా ఆలోచించి, చిన్నబోయి, చేతులు ముడుచుకు కూర్చునేందుకు అవకాశం ఇచ్చేంత సమయమూ లేదు!

వాళ్ళేమీ అబద్ధం చెప్పట్లేదు. నాకు తెలుసు" అన్నాడు పెద్దతాత.