కంకణాల పల్లిలో నివసించే వెంకటేష్ చాలా అల్లరి పిల్లవాడు. ఎప్పుడూ ఏదో ఒక తుంటరి పని చేస్తూనే ఉండేవాడు. అలా చేయటం వాడికి అదొక సరదా అయిపోయింది.

ఒకసారి ప్రక్క ఊరిలో జరుగుతున్న జాతరకు వెళ్ళారు ఊళ్ళో వాళ్లంతా కలిసి. జాతరలో ఒక మూలన కల్లు దుకాణాలు పెట్టారు. వెంకటేష్ తనవాళ్లనుండి వేరు పడి, మెల్లగా ఆ దుకాణాల వైపుకు నడిచాడు.

అక్కడ త్రాగుబోతులు ఇద్దరు కలబడటం మొదలు పెట్టారు- చూస్తూండగానే వాళ్ల గొడవ పెద్దదైంది. ఒకరి మీద ఒకరు పడి పడి కొట్టుకోసాగారు. చుట్టూతా మూగిన జనాలు ఎవరో, ఏ ఊరివాళ్ళో తెలీదు- వెంకటేష్ కూడా వాళ్లలో ఒకడుగా నిలబడి నవ్వుకుంటూ ఆ పోట్లాటను చూడటం మొదలు పెట్టాడు.

అక్కడ మూగిన జనాలు కూడా బాగా త్రాగినట్లున్నారు- అందరూ ఈలలు వేస్తూ, దొమ్మీలో ఉన్నవాళ్లను ప్రోత్సహిస్తున్నారు. ఆ సమయంలో వెంకటేష్ కూడా ఒళ్ళు మరచిపోయాడు; వాళ్ల పోరాటంలో మగ్నం అయిపోయాడు.

కొంతసేపటికి, అక్కడ వెంకటేష్‌తో పాటు జాతరకు వచ్చిన అమ్మ, నాన్న వాడికోసం వెతుక్కోవటం మొదలు పెట్టారు. వాడు ఎంతకీ కనబడలేదు. వెంకటేష్ వాళ్ల అమ్మ ఇక ఏడుపు మొదలు పెట్టింది. వాళ్ల నాన్న చికాకు పడసాగాడు. ఊరి జనాలు అంతటా కలయతిరగటం మొదలెట్టారు- "వెంకటేష్! వెంకీ!"అని అరుచుకుంటూ.

ఆలోగా వెంకటేష్ చూస్తున్న గొడవ మరింత పెద్దదైంది. అక్కడ కొట్టుకుంటున్న వాళ్ళిద్దరివీ వేరు వేరు ఊళ్ళ వాళ్లట. వారి ఊళ్ళ జనాలు బరిలోకి దిగారు. గొడవ విస్తరించింది. కట్టెలతో కొట్టుకునేవాళ్ళు కొందరైతే, రాళ్ళు విసురుకునేవాళ్ళు కొందరు.

అయినా వెంకటేష్‌కు అదంతా చాలా సరదాగా అనిపించింది. తను జాతరకు వచ్చాడనిగానీ, అమ్మానాన్నలు తనకోసం వెతుక్కుంటారనిగానీ వాడికి అసలు గుర్తే రాలేదు!

ఆ సమయంలో ఎవరో‌ విసిరిన రాయి ఒకటి వచ్చి తటాలున వెంకటేషు తలకు తగిలింది! గొడవలో‌ మునిగి ఉన్న జనాలెవ్వరూ రక్తం కారుతూ గుంతలో పడిపోయిన వెంకటేష్‌ను అసలు గమనించనే లేదు! అంతలో అటుగా వచ్చిన కంకణాలపల్లివాళ్ళు వాడిని గుర్తు పట్టి, వాళ్ల అమ్మానాన్నలకు తెలియజేశారు.

అందరూ కలిసి వెంకటేష్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. "చాలా సీరియస్‌గా ఉంది. త్వరగా ఆపరేషన్ చెయ్యాలి. లేకుంటే పిల్లవాడు బ్రతకడు" అని చెప్పి డాక్టర్లు ఆపరేషన్ చేశారు.

నాలుగు నెలల తర్వాత, వెంకటేష్ మళ్ళీ బడికి పోగలిగాడు. వాడు వెళ్ళే సరికి బడి అంతా గందరగోళంగా ఉంది. 'కిరణ్ అనే పిల్లవాడు తామరపూలకోసం ఒంటరిగా పోయి బావిలో పడిపోయాడు. ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు' అని. ఆ రోజున తెలుగు అయ్యవారు పాఠం చెబుతున్నారు:

తనవారు లేని చోటను
జనమించుక లేని చోట జగడము చోటన్
అనుమానమైన చోటను
మనుజునకు నిలువ దగదు మహిలో సుమతీ!

అది విన్న వెంకటేష్‌కు కన్నీరు ఆగలేదు. మిత్రులందరికీ తన అనుభవాన్ని చెప్పి, "ఆ రోజున జాతరలో మన ఊరివాళ్ళెవ్వరూ లేకపోయి ఉంటే నేను బ్రతికేవాడినే కాదు. అందుకనే జనాలెవ్వరూ లేని చోట్లకు, పోట్లాటలు జరిగే చోట్లకు, పిల్లలకు తగిన వాతావరణం లేని చోట్లకు పోకూడదు. అట్లాంటి చోట్ల మనం ఊరికే నిల్చొని ఉన్నాకూడా ప్రమాదం మనకు వచ్చి తగులుకోవచ్చు. ఇప్పుడు చూడండి కిరణ్‌కి ఎలా అయ్యిందో!" అని.

మాస్టారు చెప్పిన పద్యం, తన అనుభవం రెండూ వెంకటేశ్‌లో గొప్ప మార్పునే తెచ్చాయి. ఆ తర్వాత వాడు ఎంతో‌ బాధ్యతతో వ్యవహరించటం మొదలు పెట్టాడు. తిరిగి బడికి వచ్చిన కిరణ్‌నీ తన బాటలోనే నడిపాడు!