చార్లెస్ డార్విన్ 1809లో జన్మించాడు. జీవ జాతుల మధ్య పోలికల గురించీ, తేడాల గురించీ పరిశోధించాడు. 1859 లో "ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్” అనే గ్రంధాన్ని ప్రచురించాడు. 'కణ స్వరూపం అయిన ప్రోటోప్లాజమ్ నుండి అమీబా రూపొందిందనీ, అటుపైన బహుకణ జీవులైన జంతుజాలం వికసించిందనీ, తుదిగా మానవుడు ఏర్పడ్డాడనీ' ప్రతిపాదించాడు డార్విన్. డార్విన్ చేసిన ఈ ప్రతిపాదనను 'జీవ పరిణామ సిద్ధాంతం' అంటారు.






గణిత శాస్త్రవేత్తగాను, తత్వ వేత్తగాను పేరుగాంచిన బెర్ట్రండ్ రస్సెల్ 1872లో జన్మించాడు. మానవతా వాదిగా ఖ్యాతిగాంచిన రస్సెల్ 'ప్రిన్సిపుల్ ఆఫ్ మాధెమాటికల్ ఫిలాసఫీ' అనే గణిత గ్రంధాన్ని రచించాడు. 1950లో సాహిత్యంలో నోబెల్ బహుమతి ఆయన్ని వరించింది. మానవాళిని ప్రభావితంచేసే విభిన్న తాత్విక అంశాల మీద ఆయన రాసిన వ్యాసాలు అనేక సంపుటాలుగా వెలువడ్డాయి.








'భారత కోకిల' గా పేరుగాంచిన సరోజినీ నాయుడు 1879లో పుట్టింది. స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్న సరోజిని ఆంగ్లంలో అనేక రచనలు చేసి, ఖండాంతరాలలోనూ గొప్ప కవయిత్రిగా పేరు గాంచింది. హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయానికి అనేక సంవత్సరాలుగా సేవ చేస్తున్న భవంతి 'గోల్డెన్ థ్రెషోల్డ్' ఒకప్పుడు ఆవిడ ఆస్తే. దానిని ఆవిడ జాతికి అంకితం చేసారు.