అనగనగా ఒకప్పుడు తిరుపతిలో కృష్ణ, అనురాధ అనే దంపతులు ఉండేవారు. వారికి అఖిల్, సాయి ఆదిత్య అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అఖిలేమో నాలుగవ తరగతి. ఆదిత్యేమో రెండవ తరగతి చదువుతున్నారు.
పెద్దవాడు అఖిల్‌కి ఫాస్ట్‌పుడ్ అంటే చాలా ఇష్టం. వాళ్ల అమ్మ బాక్సులో పెట్టి ఇచ్చే భోజనం సరిగ్గా తినకుండా ఆకలితో ఇంటికి వచ్చి 'నూడుల్స్ కావాలి, పిజ్జా కావాలి' అని మారాం చేసేవాడు. అన్నయ్యని చూసి ఆదిత్య కూడా అలానే గొడవ చేసేవాడు. పెద్దవాళ్లు ఎలా ప్రవర్తిస్తే చిన్నవాళ్లు కూడా అలాగే ప్రవర్తిస్తారు కదా.
కృష్ణ, అనూరాధ పిల్లలకు ఆరోగ్యవంతమైన భోజనం పెట్టాలని శతవిధాలా ప్రయత్నించేవారు. కానీ పిల్లలు మాత్రం చాలా మొండిగా 'చెత్త తిండే కావాలి' అనేవాళ్ళు. పాపం పిల్లలకి తెలీదు కదా, 'వాళ్లకి దీర్ఘకాలంలో ఏది మంచిది' అన్న విషయం? స్వయంగా అనుభవంలోకి వస్తే అప్పుడు వివరంగా అర్థమవుతుంది.
ఒకరోజు కృష్ణ, అనూరాధ అఫీసుకు వెళ్ళారు; పిల్లలిద్దరూ ఆరోజున ఇంట్లోనే ఉన్నారు. సాయంత్రంగా నానమ్మ భానుమతి గారిని అడిగి పది రూపాయలు తీసుకొని, ఇంటి ప్రక్క షాప్‌లో నూడిల్స్ కొనుక్కొచ్చారు. నానమ్మకేం తెలుసు- తెచ్చి ఇచ్చి, చేయమంటే చేసి పెట్టింది వాళ్లకి!
నూడుల్స్ తినేసాక ఇద్దరూ నానమ్మకు చెప్పి ఆడుకోవడానికి వెళ్లిపోయారు. రెండు గంటల తర్వాత ఇంటికి వచ్చి, చకచకా కాళ్ళు చేతులు కడుక్కొని, స్నానాలు చేసారు: అన్నం వడ్డిస్తున్న అమ్మ దగ్గరికి వచ్చారు.
ఆదిత్యేమో పోయి నాన్న ప్రక్కన కూర్చున్నాడు; అఖిల్ మాత్రం నెమ్మదిగా అమ్మ దగ్గరికి వచ్చి, 'నాకు కొంచెం కడుపులో నెప్పిగా ఉంది. నేను అన్నం తినను' అన్నాడు. దానికి అమ్మ 'నువ్వు పిచ్చి ఫుడ్ అంతా తింటే కడుపులో నెప్పి రాదా?' అని తిట్టి, కొంచెం గోరువెచ్చని జీలకర్ర నీళ్లు త్రాగించి పడుకోబెట్టింది.
రాత్రి పదకొండు గంటలకి అఖిల్ ఏడుస్తూ నిద్రలేచి అనూరాధ దగ్గరికి వచ్చాడు- "అమ్మా! నాకు చాలా కడుపు నెప్పి వస్తున్నది. భరించలేనంత!" అంటూ. ఇంకేం చెయ్యాలి?
అమ్మానాన్నలిద్దరూ వెంటనే వాడిని పిల్లల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఎమర్జెన్సీ వార్డులో వాడికి రకరకాల టెస్ట్‌లు చేసారు: "ప్రస్తుతానికి నొప్పి తగ్గడానికి మందులు ఇచ్చాం; ఏమీ పర్లేదు; రేపు ఆపరేషన్ చేస్తాం' అన్నారు.
అఖిల్‌కి ఆసుపత్రి అంతా వింతగా అనిపించింది: చేదు మాత్రలు, ఇంజక్షన్స్ నెప్పి, ఫినాయిల్ వాసన- అసలేదీ నచ్చలేదు. 'మరునాడు ఆపరేషన్' అని చెప్పి హాస్పిటల్ వాళ్ళు కూడా అసలు ఇంకేమీ పెట్టలేదు. అఖిల్‌కి ఆకలి దంచేసింది; ఆపరేషన్ అంటే భయమేసింది; చాలా ఏడుపు వచ్చేసింది!
అయినా పాపం, వాళ్ల అమ్మ సముదాయించగా ఊరుకున్నాడు. ఆపరేషన్ థియేటర్‌లో పెద్ద సూది ఇంజక్షన్ ఇచ్చాక, ఇంక అఖిల్‌కి ఏమీ తెలియలేదు. మళ్ళీ వాడికి మెలకువ వచ్చేసరికల్లా హాస్పిటల్లో మరో రూంలో ఉన్నాడు!
అప్పుడుచెప్పింది అమ్మ- 'తిన్న నూడిల్స్ అరగకపోవడం వల్ల కడుపులో నెప్పి వచ్చింది అఖిల్‌కు. డాక్టర్లు పొట్ట కోసి, ఆపరేషన్ చేసి, అరగని నూడుల్స్ తీసేసి, పొట్ట మొత్తం క్లీన్ చేశారు'.
మర్నాడు డాక్టరు గారు వచ్చి అఖిల్ తల నిమిరి "ఎలా ఉంది ఇప్పుడు?! ఇక నుంచి అయినా అమ్మ పెట్టిన ఫుడ్ తింటావా, లేక నూడిల్స్ తింటావా? జంక్‌ఫుడ్‌తో మళ్లీ మళ్లీ కడుపు నెప్పి వస్తుంటుందమ్మా, జాగ్రత్త!" అన్నారు.
'ఎప్పుడూ ఇంట్లో చేసిన ఫ్రెష్ ఫుడ్, ప్రూట్స్, చపాతీ, టిఫిన్స్ మంచివి' అన్నారు. "ఆహారం విషయంలో అమ్మ, నాన్న చెప్పిన మాట విను- ఇంకెప్పుడూ ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేదు అన్నారు.
"అవును డాక్టరు గారూ! మా తమ్ముడు-నేను కూడా ఇక నుంచి ఎప్పుడూ అమ్మ నాన్న పెట్టిన ఫుడ్ తింటాం. వాళ్ల మాట కూడా ఎప్పుడూ వింటాం" అన్నాడు అఖిల్. దానికి బుల్లి ఆదిత్య కూడా తలూపాడు.
అంతా విని అమ్మ అన్నది, నవ్వుతూ: "అమ్మ-నాన్నలు అన్నీ మంచి విషయాలే చెప్తారు' అని వీళ్ళిద్దరికే తెలిసేందుకేగా, నాకు ఇట్లా లక్షరూపాయలు ఖర్చు అయింది?" అని.
అప్పట్నుంచీ పిల్లలిద్దరూ వాళ్ల అమ్మ చేసే చిరుధాన్యాల టిఫిన్స్ తిని ఆరోగ్యంగా, బలంగా ఎదిగారు. ఇంక వాళ్లకి అసలు ఆసుపత్రికి వెళ్లే అవసరమే లేకుండా పోయింది. అఖిల్‌కి అయితే ఆసుపత్రి అసలు కొంచెం కూడా నచ్చలేదుగా, మరి?! .