విజయవాడలో ఉండే రవి ఒకరోజున బడి నుండి ఇంటికి సైకిల్ మీద వస్తూ ఉన్నాడు.

దారి మధ్యలో వాడికి ఒక కుక్క పిల్ల కనబడింది. ఆకలౌతున్నదో‌, ఏమో- 'కుయ్ కుయ్' మని ఏడుస్తున్నదది. రవి దానిని ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్లాడు.





"అమ్మా, పాపం దీనికి ఆకలేస్తున్నట్లున్నది. దీన్ని మనం పెంచుకుందాం" అంటూ కుక్క పిల్లను అమ్మకు చూపించాడు. అమ్మ ముఖం చిట్లించింది. "ఛీ- ఈ కుక్క పిల్ల మనకు వద్దు- ఎక్కడ నుండి తెచ్చావో అక్కడే వదిలేయ్" అన్నది. రవికి ఏడుపు వచ్చింది.




అయినా అమ్మ మాటని కాదనేది ఎలాగ? అందుకని దానికి కాసిని పాలు పోసి, ఆనక దాన్ని తీసుకెళ్లి మళ్ళీ అక్కడే వదిలేసి వచ్చాడు.

అయినా కుక్క పిల్ల మటుకు రవిని వదలలేదు. అతని వెంటనే చాలా దూరం వచ్చింది. అయినా దానికేసి చూడకుండా సైకిలెక్కి గబగబా ఇల్లు చేరుకున్నాడు రవి.

ఆ తర్వాత దాన్ని మరిచిపోదామని చాలా ప్రయత్నించాడు అతను.

కానీ అసలు వీలే కాలేదు!

రెండు రోజుల తర్వాత వాళ్ల అమ్మతో కలిసి సంతకు వెళ్లాడు రవి. ఆ కుక్క అక్కడ సంతలోనే ఉంది! వాళ్లను చూడగానే అది తోక ఊపుకుంటూ సంతోషంతో గబగబా పరుగెత్తుకొని వచ్చింది వాళ్ళ దగ్గరికి.

అంతలో ఎవడో దొంగ ఒకడు రవి వాళ్ల అమ్మ మెడలోని చైను లాక్కొని గిరుక్కున వెనుతిరిగి పరుగు పెట్టాడు. రవి వాళ్ల అమ్మ "దొంగ! దొంగ!‌పట్టుకోండి!" అని అరిచింది.

ఏం చేయాలో తోచక నిలబడిపోయాడు రవి. కానీ కుక్క పిల్ల మటుకు దొంగను వెంబడించింది. చటుక్కున వాడి కాళ్ల మధ్యలో దూరింది.

దొంగ దాన్ని తప్పించుకోబోయి, జారి తటాలున క్రింద పడిపోయాడు. ఆలోగా అందరూ వచ్చి వాడిని పట్టుకున్నారు. గొలుసుని రవి వాళ్ళ అమ్మకి ఇచ్చారు.



"ఈ కుక్క పిల్ల మీదేనా? బలే ధైర్యం దీనికి. దీన్ని మాకిస్తారా, పెంచుకుంటాం?" అడిగారు సంతలోని జనాలు అందరూ. "అయ్యొ- దొరక్క దొరక్క దొరికింది ఇది మాకు- దీన్ని ఎవ్వరికీ ఇచ్చేది లేదు" అన్నది అమ్మ, కుక్క పిల్లను ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ.