రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ చెట్టెక్కాడు విక్రం. అక్కడున్న బేతాళాన్ని భుజాన వేసుకొని చెట్టు దిగబోయాడు. అంతవరకూ కదలక మెదలక ఉన్న బేతాళం అకస్మాత్తుగా ప్రాణం ఉన్నదాని మాదిరి ఒళ్ళు విరుచుకున్నది. ఏదో ఆలోచనలో ఉన్న విక్రం ఉలిక్కిపడేట్లు, మాట్లాడటం మొదలు పెట్టింది :

"చూడు విక్రమ్! ప్రపంచంలో అంతటా దు:ఖం నిండి ఉన్నది. కావాలనుకున్న సంతోషాలన్నీ ఒక జీవితంలో ఎవరికీ దొరకవు. ఇంకో అవకాశం రమ్మంటే కూడా అందరికీ రాదు. అలాంటి అవకాశం వచ్చినా కూడా ఉపయోగించుకోని మనుషుల గురించి 'అర్కడీ గైడార్' అనే రష్యావాడొకడు చెప్పాడు. శ్రమ తెలీకుండా ఉండేందుకు నీకు ఆ కథ చెబుతాను, విను " అంటూ ఇలా చెప్పసాగింది.

1

"అలనాటి రష్యాలోని ఒక గ్రామంలో బక్క పలుచటి ముసలివాడు ఒకడు ఉండేవాడు. యాపిల్ పండ్ల తోటల్లో దొంగలు పడకుండా కాపలా కాసి జీవనం సాగించేవాడతను.

అతను యవ్వనంలో ఉండగా ఆ దేశంలో అనేక కష్టాలుండేవి. వాటినన్నిటినీ అతను అనుభవించినట్లు ఆ గ్రామంలో అందరికీ తెలుసు.

ఆ కష్టాల వలనేనేమో, అతనికి వయసుకి మించిన ముసలితనం వచ్చింది. అతని బుగ్గల మీదనేగాక, పెదవుల పైభాగాన- నుదుటి మీద కూడా- గాట్లు, మచ్చలు, ముడతలు ఉండేవి. అతను నవ్వినప్పుడు కూడా అతని ముఖంలో దు:ఖం, విచారం కనపడేవి వాటి వల్ల.

అయితే ఒకరోజున, ఇవాష్కా కుడ్రియాష్కిన్ అనే ఆ ఊరి పిల్లవాడు ఒకడు, అతను కాపలా ఉన్న యాపిల్ పండ్ల తోటలోకి దూరాడు దొంగతనంగా. అయితే ఆ ప్రయత్నంలో వాడి లాగూ ముళ్ళకంచెకు చిక్కుకున్నది. దాంతో వాడు కంచెకి అవతలగా ఉన్న రేగు ముళ్ళ పొద మీద బొక్క బోర్లా పడి, బాధతో గట్టిగా కేక వేశాడు. అలా ముసలాయనకు దొరికిపోయాడు వాడు.

ముసలాయన చూసేసరికి ఇవాష్కా చేతులు చీరుకుని పోయాయి; లాగూ పీలిక క్రిందికి వ్రేలాడుతున్నది; వాడి కళ్ళ వెంట నీరు వాన ధార మాదిరి కారిపోతోంది.

మామూలుగా అయితే అలా దొరికిన వాళ్లను ముసలివాడు దురదగొండి బెత్తాలతో కొడతాడు. ఆ తర్వాత వాళ్లను తీసుకెళ్ళి బడిలో మాష్టారుకి ఒప్పచెప్తాడు.

అయితే ఇప్పుడతనికి ఈ చిన్ని బాబుని ఏమీ అనాలనిపించలేదు. అతని కళ్ళనీళ్ళు తుడిచి, పండ్లతోట వాకిలి గుండా పరిగెత్తి పొమ్మన్నాడు.

అయితే ఇవాష్కా అప్పటికే బాగా భయపడిపోయి ఉండటం వల్లనో ఏమో, పరిగెత్తలేక గబగబా నడుస్తూ వెళ్ళిపోయాడు.

2

ఇవాష్కా నిజంగానే చాలా అభిమానస్తుడు. అతను అట్లా నడుస్తూ నడుస్తూ నేరుగా అడవిలోకి వెళ్ళిపోయాడు. చేసిన పని తలుచుకుంటున్న కొద్దీ అతని తల సిగ్గుతో మరింత వాలిపోయింది.

మధ్యాహ్నం వరకూ దారీ తెన్నూ లేకుండా తిరిగిన అతను దోవ తప్పిపోయాడు. కొండ పాదాన్ని ఆధారం చేసుకుని నడుస్తుండగా ఒకచోట చిత్తడి చిత్తడిగా ఉన్న బురద దారి ఎదురయింది అతనికి. బాగా అలిసిపోయి అక్కడే ఉన్న ఓ బండరాయి మీద కూర్చున్నాడు-

ఏదో చురుక్కుమన్నది పిర్రమీద. బండ మీద కూర్చున్న వాడల్లా "అబ్బా!” అని మూలిగి, ఒక్క ఉదుటున లేచి అవతలకి దూకాడు. రాయి మీదున్న పురుగేదో తనని కుట్టిందనుకొని, దాని కోసం వెతికాడు. పురుగేమీ లేదు!

'మరేంటి?' అనుకుంటూ అట్లా బండరాయి మీద చెయ్యి పెట్టగానే ఈసారి అతని అరచెయ్యి కాలింది! దాంతో అతనికి అర్థమైంది- ఆ రాయి 'నిప్పురాయి'! ఈసారి ఇవాష్కా దాన్ని ముట్టుకోకుండా దగ్గరికి వంగి పరిశీలనగా చూశాడు- దాని మీద ఏవో కొన్ని అక్షరాలు దుమ్ముకొట్టుకుని మసకమసకగా కనిపించాయి!

వెంటనే తన చిరిగిపోయిన లాగూ పీలికని లాగి, దాంతో అక్షరాల మీదున్న మట్టిని తొలగించి, రాయిమీద రాసి ఉన్న దాన్ని గట్టిగా చదివాడు: “తమ జీవితంలో ఆనందాన్ని రుచి చూడని వాళ్ళెవరైనా ఈ రాయిని రెండుగా పగలగొడితే వాళ్ళు తమ యవ్వనాన్ని తిరిగి పొందుతారు"

అది చదివి ఇవాష్కా చాలా నిరాశపడ్డాడు. అతడికి ఇప్పుడు అతని వయసు 8 సంవత్సరాలే. తనకి ఇప్పుడే కొత్త జీవితం ఎందుకు, ఏం చేసుకోను?

"మళ్ళీ ఒకటో తరగతిలో చేరాలో ఏమో!" అనుకుని వాడికి చాలా భయం వేసింది కూడా.

"ఇలా కాకుండా ఇది నన్ను ఒకటో తరగతి నుండి పై తరగతులకి తీసుకుని వెళ్ళగలిగితే ఎంత బాగుండేది కదా! ఇప్పుడు దీంతో నాకేం పని లేదు!" అనుకొని, వాడు దాన్ని అక్కడే వదిలేసి ఇంటి ముఖం పట్టాడు.

దారిలో యాపిల్ పండ్ల తోట మీదుగా వెళ్తూ చూసాడు- ముసలి తాత దగ్గుతూ, ఆయాసపడుతూ కంచెకి తెల్లరంగు వేస్తున్నాడు.

అతన్ని చూడగానే ఇవాష్కాకు చాలా దయ కలిగింది. 'ఈ తాత నన్ను దురదగొండి ఆకులతో కొట్టి మాష్టారుకి ఒప్పచెప్పి ఉండాల్సింది- అయినా ఆ పని చేయకుండా నన్ను ఊరికే వదిలేశాడు. ఇప్పుడు నేను ఇతనికి సాయం చేస్తాను- నిప్పురాయి సంగతి చెప్తాను. దాన్ని వాడుకుంటే అతను మళ్ళీ యువకుడైపోతాడు. ఇంక దగ్గనక్కర్లేదు; ఆయాసపడనక్కరలేదు; కుంటుతూ నడవనక్కర్లేదు' అనుకున్నాడు.

వెంటనే ముసలివాడి దగ్గరికి వెళ్ళి నిప్పురాయి సంగతి చెప్పాడు. ముసలివాడు సంతోష పడ్డాడు. ఇవాష్కాకి తన పట్ల ఉన్న అక్కరకి మెచ్చుకున్నాడు. అయితే తాను అప్పటికప్పుడే తోటని వదిలి రాయి దగ్గరికి రావడానికి మటుకు ఒప్పుకోలేదు- “ఇప్పుడు నేను పనిలో ఉన్నాను. ఈ కాపలా పనిని వదిలి రాలేను. అయితే నువ్వు మంచి పిల్లవాడివి. ఒక పని చేసి పెట్టు. శ్రమ అనుకోకుండా నువ్వు ఇప్పుడే పోయి, ఆ రాయిని ఏదో ఒక రకంగా కొండమీదకి చేర్చు- సాయంత్రంగా నేను వచ్చి రాయిని బద్దలు కొడతాను" అన్నాడు.

3

విషయం చెప్పగానే తాత ఎగిరి గంతేస్తాడనీ, 'ఏదీ, ఆ రాయిని చూపించు!' అని తనమీదికి దూకుతాడనీ, వెంటనే తనను బయలుదేరదీస్తాడనీ అనుకున్న ఇవాష్కా జావ కారి పోయాడు: 'అయినా సాయంత్రం వస్తానన్నాడులే' అని మనసుని సముదా-యించుకుని, ముసలాయన దగ్గర నుండి రెండు దళసరి గోనె సంచులని అడిగి ఇప్పించుకుని, వెనక్కి వెళ్ళాడు. అసలు రాయిని బురదలోంచి బయటికి లాగటమే చాలా కష్టమైంది.

ఆ తర్వాత “హా! హమ్మయ్య! ఇప్పుడు ఇంక ఈ రాయిని కొండ మీదికి దొర్లించుకుంటూ వెళతాను. తాత వచ్చి దీన్ని బద్దలు చేస్తాడు; మళ్ళీ కుర్రవాడైపోతాడు. పాపం, 'అతని జీవితమంతా కష్టాలమయం' అని అందరూ చెప్పుకుంటారు. ఇకనైనా అతని జీవితంలోకి కొంచెం సంతోషం వస్తుంది" అని రాయిని కొండ మీదకల్లా నెట్టాడు ఆ పిల్లాడు.

అంతా అయ్యాక అలిసిపోయి, అక్కడే పడుకుని, ముసలాయన కోసం నిరీక్షించసాగాడు.

సాయంత్రానికి వచ్చాడు ముసలాయన. ఊరికే చేతులూపుకుంటూ వచ్చిన ఆయన్ని చూసి ఇవాష్కా ఆశ్చర్యపోయాడు- "ఏ సుత్తో, సమ్మెటో, గునపమో తీసుకు-రాకుండా, ఒట్టి చేతులతో వచ్చావేంటి? ఈ బండ రాయిని నీ చేతులతో బద్దలు చేయగలనని అనుకుంటున్నావా?” అని అడిగాడు.

ముసలివాడు ఇవాష్కా దగ్గరకి వచ్చి అతని తల మీద చేయి వేసి నిమురుతూ "లేదు బిడ్డా! నేను ఈ రాయిని బద్దలు కొట్టాలనుకోవడం లేదు" అన్నాడు. ముసలివాడు తన తలని నిమరడంలో ఉన్న ప్రేమని ఇవాష్కా అనుభవిస్తున్నాడు.

తాత కొనసాగించాడు- “లేదు మనవడా! నేను కొత్త జీవితం మొదలు పెట్టడాన్ని కోరుకోవడం లేదు. నీ దృష్టిలో నేను ఒక ముసలివాడిని, అనాకారిని, ఎప్పుడూ ఆనందానికి నోచుకోనివాడిని-

కానీ నిజంగా చూస్తే నేను నా జీవితంలో ఎంతో ఆనందాన్ని అనుభవించాను. ప్రజల క్షేమం కోసం, స్వేచ్ఛ కోసం ఎన్నో మంచి పనులు చేశాను. కష్టాలు పడ్డాను. నా దేశ ప్రజలందరూ స్వేచ్ఛగా జీవించాలని నేను కన్న కలలన్నీ సాకారమయ్యాయి- ఇంతకంటే నా జీవితంలో సంతోషం ఏముంటుంది?

నా జీవితం కఠినంగా గడిచింది. ఐనప్పటికీ అది అర్థవంతంగాను, ఉపయోగకరంగాను, నిజాయితీగాను గడిచింది. ఇప్పుడు నాకు ఇంకొక జీవితం, ఇంకో యవ్వనం అవసరం లేదు” అన్నాడు.

తాత అన్న మాటల్లో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు ఇవాష్కాకి. అయినా తాత ముఖంలోని గంభీరతను చూసి అతనేమీ బదులు చెప్పలేదు.

అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ ఇద్దరూ కొంతసేపు మౌనంగా కూర్చున్నారు. గాలి ప్రశాంతంగా వీస్తోంది. నిప్పురాయి కూడా చల్లబడినట్లనిపించింది.

కాసేపయ్యాక ఇద్దరూ లేచి కొండ దిగుతుండగా “అయితే తాతా, ఈ రాయిని కొండ మీదకి ఎందుకు చేర్చమన్నావ్ నన్ను?" అడిగాడు ఇవాష్కా.

ముసలివాడు నవ్వాడు. “అది అందరికీ కనపడేటట్లు కొండ మీదనే ఉండాలి. తర్వాత ఏం జరుగుతుందో నీ జీవితకాలంలో చూద్దువుగాని" అన్నాడు.

4
చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటి నుండీ ఆ రాయి అక్కడే ఉంది. దాన్ని ఎవ్వరూ పగలగొట్టలేదు. చాలామందే వచ్చి చూసారు దాన్ని. అందరూ దాని దగ్గరికి రావడం, కొంచెం సేపు అలా నిలబడి చూడటం, తల పంకించి వచ్చిన దారినే తిరిగి వెళ్ళటం.

మనసు బాగాలేనప్పుడు ఒక్కోసారి పెద్ద ఇవాష్కా కూడా 'రాయిని పగలగొడతాను. మళ్ళీ ఒక కొత్త జీవితం మొదలు పెడతాను' అనుకుంటాడు; అక్కడకి వెళతాడు.

అయితే కొంతసేపు ఆ రాయి ఎదురుగ్గా నిలబడగానే అతని ఆలోచనల్లో మార్పు వస్తుంది. "వద్దులే. మళ్ళీ కుర్రాడిని అవ్వక్కర్లేదు. 'ఇచ్చిన జీవితాన్నే ఉపయోగించుకోలేదు; కొత్త జీవితం కోసం అంతా మళ్ళీ మొదలు పెట్టుకున్నాడు' అని అందరూ నవ్వుతారు" అనుకుని వెనక్కి వెళ్ళిపోతుంటాడు.

తాత ఆ రాయిని అందరికీ కనపడేట్లుగా కొండమీదకి ఎందుకు చేర్చమన్నాడో ఇవాష్కా కుడ్రియాష్కిన్‌కి ఇప్పుడు అర్థం అయింది"

బేతాళం ఈ కథ చెప్పి "ఇంతకీ ఇవాష్కాకు ఏమి అర్థమైందంటావు?! అల్ప సంతోషి ఐన ముసలివాడు 'నాకు ఈ జీవితం చాలు' అనుకొని ఉండచ్చు. కానీ 'మిగిలిన వాళ్లెవ్వరూ కూడా రాయిని బ్రద్దలు కొట్టలేదు' అనటం ఆశ్చర్యంగా ఉంది. మాయ రాయి మనుషుల మనసుల్ని మార్చేస్తున్నదా?!" అన్నది.

విక్రం చిరునవ్వు నవ్వుతూ "బేతాళం, ఈ కథ మానవ స్వభావంలో ఉన్న వైరుధ్యాన్ని ఆవిష్కరిస్తున్నది. మనిషి ఒకవైపున క్రొత్త ఆనందాన్ని కోరుకుంటూనే, మరొకవైపున తనకు లభించిన జీవన రసాన్ని ఆస్వాదిస్తుంటాడు. తను ఒక వైపున కష్టపడుతూనే, మరొకవైపున జీవితంలో కష్టం ఎప్పుడూ ఉంటుందని కూడా చూస్తాడు. పరస్పర విరుద్ధమైన ఈ రెండు భావనల మధ్యా ఉన్న సంఘర్షణ ఎన్నటికీ తెగదు. రాయిని బ్రద్దలు కొట్టి వెనక్కి పోయేంత ధైర్యం ఆలోచనాపరులకెవ్వరికీ ఉండదు. అయితే త్వరపడి ఎవరినీ ఊరికే నిర్ణయించుకోనీక, లోతుగా ఆలోచించే శక్తిని మనుషుల్లో ప్రేరేపిస్తూండచ్చు ఆ రాయి- అంతకు మించి అదేమీ చేయట్లేదు" అన్నాడు.

అలా విక్రంకు మౌనభంగం కలగటంతో బేతాళం అతని పట్టు నుండి చటుక్కున విడివడి, మళ్లీ చెట్టుకొమ్మ మీదికి చేరుకున్నది!