బ్రహ్మదత్తుడు కాశీ రాజ్య పీఠాన్ని అధిరోహించకముందు యువరాజుగా విలాస జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. అతనికి ఉండే వ్యసనాల్లో ఒకటి, వేట.
కాశీ యువరాజుకి కొంత సమయం చిక్కిందంటే చాలు, వేటాడేందుకు అడవిలోకి పోయేవాడు. ధనుర్బాణాలు ధరించి, గుర్రాన్నెక్కి కాలయముడిలా సంచరించే బ్రహ్మదత్తుడిని చూస్తే అడవిలోని జంతువులన్నీ వణికి పోయేవి.
అతని వల్ల జంతువులన్నిటిలోనూ ఎక్కువ నష్టపోయింది జింకలు. కాశీ రాజ్యానికి ఉత్తరాన ఉన్న అడవుల్లో లెక్కలేనన్ని జింకలు ప్రశాంతంగా జీవించేవి. ఇప్పుడవన్నీ భయంతో బక్కచిక్కిపోసాగాయి.
వాటన్నిటికీ రాజుగా ఉండిన బోధిసత్త్వుడు ఒకనాడు తోటి జింకలన్నిటినీ సమావేశపరచి, "మిత్రులారా, అనేక తరాలుగా మనవాళ్లంతా ఎలాంటి దురవస్థలూ లేక సుఖంగా జీవించటానికి అలవాటుపడి ఉన్నారు. మన శరీరాలన్నీ బాగా క్రొవ్వు పట్టినై, ఎముకల సంధులు కావలసినంత చురుకుగా కదలటం లేదు. ఇప్పుడు యీ కాశీ యువరాజు పేరిట ఆపద ముంచుకొచ్చే సరికి, మనం అతని బాణాలకు సులభంగా చిక్కుకుంటున్నాం.
అందువల్ల మనందరం మన శరీరాలను బాగుచేసుకోవాలి; మన చురుకుదనం పెంచుకోవలసి ఉన్నది. అయితే బ్రహ్మదత్తుని తీరు చూస్తే ఆ లోగానే మనం ఎవ్వరం మిగలని పరిస్థితులు ఎదురవుతామేమో అనిపిస్తున్నది.
ఉత్తమ సంస్కారాలను అనేకాన్ని ప్రోది చేసుకున్న కారణంగానే యీ బ్రహ్మదత్తు కాశీ యువరాజుగా జన్మించాడు. అయితే ఏనాటి దుష్ట కర్మలో అతన్ని యీ మారణ పర్వంలో భాగస్వామిని చేస్తున్నాయి. అతనిలో కరుణ బలపడితే తప్ప మన కష్టాలు పూర్తిగా తీరవు. దానికై మనం పెను త్యాగాలకు సిద్ధమవ్వాలి. మీరంతా సరేనంటే నేను అతనితో మాట్లాడతాను" అన్నది.
జింకలన్నీ సమ్మతించిన మీదట, ఆరోజు వేటకై బయలుదేరిన బ్రహ్మదత్తుడికి అడవి అంచునే ఎదురేగి, ప్రేమ పూరితమైన స్వరంతో, మానవ భాషలో- "యువరాజా! నీ బలసంపదకు ఎదురొడ్డి నిలువలేని జింకల సమూహం కొద్ది నెలల్లోనే, నీ ప్రతాపం వల్ల వందల సంఖ్యకు చేరుకున్నది. మిగిలి ఉన్న జింకలు కూడా తమ జీవన క్రియలన్నిటినీ ప్రక్కన పెట్టి భయంతో ముడుచుకొని పోయాయి. ఇదే గనక కొనసాగితే ఇక యీ అడవులలో జింక అన్నదే కనిపించకుండా పోతుంది. అందువల్ల నువ్వు మా మీద దయ చూపాలి. మమ్మల్ని వధించరాదు" అన్నది.
బ్రహ్మదత్తుడు దాని మాటలకు నవ్వి "ప్రభువులు మృగయా వినోదులు. కాబట్టి నన్ను వేటాడవద్దనే అధికారం మీకు లేదు.
అయితే మీరంతా మా రాజ్యంలోని ప్రాణులు- కనుక మీ కోరికని నేను మనసులో పెట్టుకుంటాను- అయితే దాని వల్ల నాకేమి లాభం?" అన్నాడు.
"ఏ ప్రాణి పట్ల అయినా మీ మనసులో ఉదయించే కరుణ మీకు ఎనలేని మేలు చేస్తుంది. ప్రభువులైన తమకు మాబోటి అల్పజీవులు చేయగల మేలు అంతకంటే ఏముంటుంది?" అన్నది జింకరాజు.
"అలా కాదు. నేను మీ జాతినంతటినీ ఏమీ చేయకుండా వదులుతాను. మీరు నిశ్చితంగా బ్రతకవచ్చు. అయితే దానికి బదులుగా, మీలో రోజుకొకరు నాకు ఆహారం అవుతూ ఉండాలి. అది మీ జాతి పట్ల మీకున్న నిబద్ధతను సూచిస్తుంది; నేను ఇచ్చిన మాటను కూడా నాకు ఏరోజుకు ఆరోజు గుర్తు చేస్తుంటుంది" అన్నాడు బ్రహ్మదత్తుడు.
జింకల రాజు మిగిలిన జింకలకేసి జాలిగా చూసింది. అవి సమ్మతిస్తూ తలలు ఊపిన మీదట, అది బ్రహ్మదత్తుడికి తమ అంగీకారాన్ని తెలియజేసింది.
ఆ రోజునే జింకలన్నీ వంతులు వేసుకున్నాయి; రోజుకొక జింక చొప్పున యువరాజుకు ఆహారమౌతూ వచ్చింది. ప్రతిరోజూ ఒక జింకను అడవి అంచున నిలిపే బాధ్యత జింకరాజుది.
జింకల జీవితాలు త్వరలోనే సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఎటొచ్చీ రోజుకు ఒక జింక నిశ్శబ్దంగా అదృశ్యం అయిపోయేది; అయితే మిగిలిన జింకల్లో నిర్భయత పెరిగింది; అవి తిరిగి బలం పుంజుకున్నాయి; వాటి శరీరాలు చురుకుగా తయారయ్యాయి. జింకల సంతతి తిరిగి పెరగనారం లభించింది.
ఆ సమయంలో ఒకసారి యువరాజుకు ఆహారంగా వెళ్లే వంతు ఒక ఆడ జింకదైంది. అది ఆ సమయంలో నిండు గర్భిణి. 'తన పిల్లను యీ లోకంలోకి తెచ్చే ముందుగానే తన జీవితం ముగియనున్నదే' అని దానికి చాలా దు:ఖం వచ్చింది.
దాన్ని అడవి దాటించేందుకు వచ్చిన జింకరాజుకు దాని దు:ఖం అర్థమైంది-"జింకల సంతతిని తిరిగి వృద్ధి చేసేందుకు గదా, యువరాజుతో ఇటువంటి ఒప్పందం కుదుర్చుకున్నది? ఇప్పుడు ఇలా నిండు గర్భిణిని అతనికి ఆహారంగా పంపటం ఎంత తెలివి తక్కువ పని?!" అని ఆలోచించి, దాన్ని ఊరడిస్తూ "తల్లీ! వంతును మళ్లీ ఏదో ఒకనాటికి మార్చుకుందువు. ఇవాల్టికి ఏదో ఒక విధంగా ఆ ఖాళీని భర్తీ చేస్తాను. నువ్వు పో!" అని దాన్ని వెనక్కి పంపించేసింది.
ఆనాడు స్వయంగా తనకు ఆహారం అయ్యేందుకు వచ్చిన జింకరాజును చూసి బ్రహ్మదత్తుడికి చాలా ఆశ్చర్యం వేసింది. "ఏంటి ఇది? ఇవాళ్ల నువ్వే వచ్చావెందుకు? మిగిలిన జింకలేమైనాయి?" అని అడిగాడు దాన్ని.
జింకరాజు అతనికి జరిగిన సంగతిని వివరించి, "రాజా! నేను లేకున్నా మా జాతి వారు తమ మాట తప్పరు. నువ్వు నిశ్చింతగా నన్ను చంపవచ్చు; ఏమీ పర్వాలేదు" అన్నది.
"కాదు, నువ్వు వెళ్లి వేరే జింకను దేన్నైనా పంపు. నిన్ను చంపటం నాకెందుకో ఇష్టం కావట్లేదు" అన్నాడు బ్రహ్మదత్తుడు, కలవరపడుతూ.
జింకరాజు నవ్వి "యువరాజా! శరీరం అంటూ ఒకటి ఉన్నప్పుడు దానికి కష్టాలు తప్పవు. చిన్నతనంలోను, యౌవనంలోను, మధ్య వయస్సులోను, ముసలితనంలో కూడాను ఎక్కడి దు:ఖం అక్కడ, ఉండనే ఉన్నది. రాజైన వాడు దు:ఖాన్ని అధిగమించి ఇతరులకు మార్గదర్శకుడు కావాలి తప్ప, తన శరీర రక్షణ కోసం ప్రజలను బలి చెయ్యకూడదు." అన్నది.
ఆ క్షణంలోనే యువరాజులో అనంతమైన పశ్చాత్తాపం నెలకొన్నది. "రాజ ధర్మాన్ని నిలుపుకునేందుకు సాధారణమైన జింక ఒకటి తన ప్రాణాలను అలవోకగా త్యజించబోయిందే, మరి తను? ఇన్ని ప్రాణులకు ప్రభువైన తను నిస్సిగ్గుగా ఆ ప్రాణులను ఎలా హింసిస్తున్నాడు, ఇన్నాళ్లుగా?! నిజానికి వాటిని అన్నిటినీ కాపాడవలసిన బాధ్యత తనదే; తను 'వేట' అనే యీ కౄరకర్మలో ఎందుకు కూరుకుపోయాడు?” తక్షణం అతనిలో హృదయ పరివర్తన కలిగింది.
జింకరాజులో బోధిసత్త్వుడిని దర్శించిన యువరాజు దాని ముందు మోకరిల్లాడు. అటుపైన అతను ఇక ఏనాడూ వేటాడలేదు; జంతువుల్ని హింసించలేదు!!