అనగా అనగా ఒక చిన్న రాజ్యాన్ని దైవనందనుడు-సునందమాల అనే రాజు-రాణి పరిపాలించేవారు. వాళ్లకు అన్ని సంపదలూ ఉన్నాయిగానీ, పిల్లలు మాత్రం లేరు.
అయితే ఒకసారి సునందమాల కిటికీ దగ్గర కూర్చొని పూలు అల్లుకుంటూ ఏదో ఆలోచనలో పడింది. ఆ పరధ్యానంలో తన చేతిలోని సూది వేలుకు గుచ్చుకొని నాలుగు చుక్కల రక్తం కిటికీ అంచుమీద పడింది. చురుక్కుమనేసరికి రాణి ఈలోకంలోకి వచ్చి చూసుకునేసరికి, క్రింద పడిన ఆ రక్తపు చుక్కలు ఓ ఎర్ర గులాబిలాగా అందంగా కనబడ్డాయి.
పిల్లల ధ్యాసలో ఉన్న రాణి దాన్ని చూస్తూ "అబ్బ! నాకు ఇలా గులాబీ లాంటి పాప పుడితే ఎంత బాగుంటుంది, కదా!" అనుకుంది.

సరిగ్గా అప్పుడే ఆకాశంలో పోతున్న శివుడు-పార్వతిలకు ఆమెమీద దయ కలిగింది. వాళ్ళు "తథాస్తు" అన్నారు. అనేసరికి ఇంకేముంది, రాణీకి కొన్నాళ్ల తరువాత ఒక పాప పుట్టింది. రాజు రాణిల ఆనందానికి మేరలేదు. ఆ పాపకు 'హిమబాల'అని పేరు పెట్టి, అల్లారుముద్దుగా పెంచుకోసాగారు.
అయితే కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా, కొన్నాళ్లకు రాణీగారికి ఏదో తెలీని జబ్బు చేసింది. రాజుగారు ఎంతమంది వైద్యులను పిలిపించినా లాభంలేకపోయింది. చివరికి ఆమె చనిపోయింది. హిమబాలేమో, మరి ఇంకా చాలా చిన్నదాయె! ఆమె బాధ్యతలు చూసుకునేందుకని, రాజుగారు మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. ఇప్పుడాయనను పెళ్ళి చేసుకున్న 'విజయసుందరి'కి హిమబాల బాగోగులకంటే తన అందం అంటేనే గొప్ప శ్రద్ధ ఉండేది.
ఆ రోజుల్లో కూడా, ఇప్పటిలాగానే రాజ్యంలో రకరకాల సమస్యలు ఉండేవి. రాజుగారు ఆ సమస్యలతోటే వ్యస్తంగా ఉండి, ఇంటి గురించి ఎక్కువగా పట్టించుకునేవారు కాదు. అట్లా ఇంటి విషయాలలో విజయసుందరి పెత్తనం చెలాయించటం మొదలైంది. ఆమె హిమబిందును రకరకాల సూటిపోటి మాటలు అనేది. హిమబిందు చేత అన్ని ఇంటి పనులూ చేయించేది.
చిన్నరాణి విజయసుందరి దగ్గర ఒక మాయ అద్దం ఉండేది. రోజూ ప్రొద్దున లేచి, స్నానం చేసి, ఆ మాయ అద్దం తీసి, "ఈ లోకంలో నాకంటే అందమైన వాళ్లు ఎవరైనా ఉన్నారా?" అని అడిగేదామె. "నీకంటే ఎవరూ అందంగా లేరు" అని సమాధానం ఇచ్చేది మాయ అద్దం. చిన్నరాణి చాలా గర్వపడేది. మురిసిపోతూ చిరునవ్వు నవ్వుకునేది.
కొన్నాళ్లకు హిమబాల పెద్దది అయ్యింది. ఎర్ర గులాబీలాగా చాలా అందంగా తయారయింది. ఇంట్లో పనులు చేసీ చేసీ వాటినన్నిటినీ కూడా నేర్చుకున్నది. ఆ సమయంలో ఒక రోజున రాణి మాయ అద్దం తీసి, ఎప్పటి మాదిరే "ఈ లోకంలో నాకంటే అందమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?" అని అడిగింది. "ఓఁ లేకేమి? ఉన్నది! ఇవాల్టిరోజున ప్రపంచంలోకెల్లా అందగత్తె ఎవరో కాదు- నీ కూతురు హిమబాల!" అని సమాధానం ఇచ్చింది అద్దం.

అది వినగానే విజయసుందరికి చాలా కోపం వచ్చింది. "ఏది ఏమైనా సరే! ఈ లోకంలో నాకంటే అందమైన వాళ్లు ఉండకూడదు. హిమబాలను చంపెయ్యాలి- ఇక వేరే మార్గం లేదు" అని, దారిన పోతున్న బాటసారిని ఒకడిని పిలిపించింది- "అదిగో, అక్కడ ఆడుకుంటున్నదే, ఆ పిల్లను అడవికి తీసుకెళ్ళు. ఎవరికీ తెలీకుండా చంపెయ్యి. చంపినందుకు గుర్తుగా దాని కళ్లను నాకు తెచ్చి ఇవ్వు- నీకు పదికాలాలకు సరిపడా డబ్బు అందే ఏర్పాటు నేను చేస్తాను" అని ఆశపెట్టింది. "అట్లా చెయ్యలేదంటే నిన్ను చంపి నీ తలను కోట గుమ్మానికి వేలాడదీస్తాను జాగ్రత్త" అని అతన్ని బెదిరించింది కూడా.
దాంతో‌ బాటసారి భయంతో "చిత్తం మహారాణీ!" అని హిమబాల దగ్గరికి పోయి "నేను నీకు అందమైన పూలు, జింకలు, చిలుకలు చూపిస్తాను రామ్మా" అని ప్రేమగా మాట్లాడి, అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడున్న పూలను, జంతువులను చూసి హిమబాల అమాయకంగా మురిసి-పోయింది; సంతోషంగా గంతులు వేసింది. ఆ పాప అమాయకత్వాన్ని చూసిన బాటసారికి ఆమెను చంపేందుకు చేతులు రాలేదు. అతను ఆ పాపకు నిజం చెబుతూ "పాపా! మీ చిన్నమ్మ నిన్ను చంపమని నాకు అప్పగించిందమ్మా. అయితే నేను నిన్ను చంపను- ఇక్కడే వదిలేస్తాను. నీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది- కానీ నువ్వు మటుకు ఇక మన రాజ్యానికి రాకు! వచ్చావంటే రాణి చేతిలో నీకు చావు తప్పదు!" అని ఆమెను అక్కడే వదిలేసి, గబగబా వెళ్ళిపోయాడు.
పోతూ పోతూ అతను దారిలో ఒక జింకని చంపి, దాని కళ్లు తీసుకెళ్ళి "ఇదిగోండి మహారాణీ! హిమబాల కన్నులివిగో" అని ఆమెకు అప్పగించాడు. రాణి చాలా సంతోషపడింది. మరునాడు ఉదయాన్న ఆమెకు ఇంక అద్దంలోకి చూడబుద్ధి కాలేదు. "ఎలాగూ హిమబాల చనిపోయింది కదా, అందుకని ఇంక ఈ లోకంలో నాకంటే ఎవరూ అందంగా ఉండి ఉండరులే" అనుకొని అద్దంలో చూడటం మానేసింది.
ఇక అక్కడ అడవిలో హిమబాల ఏడ్చుకుంటూ పోతుంటే, అడవి మధ్యన ఆమెకొక చక్కని పెంకుటిల్లు ఒకటి కనిపించింది. ఆ సరికి హిమబాలకు చాలా ఆకలిగా ఉంది; ఆ ఇంటి తలుపు తీసి ఉంది- కానీ తలుపు తడితే ఎవ్వరూ పలకలేదు. హిమబాల కొంచెం అనుమానంగానే ఆ ఇంట్లోకి వెళ్లి చూసింది- ఎవ్వరూ కనబడలేదుగానీ అక్కడ టేబుల్ మీద రకరకాల వంటకాలు చక్కగా పేర్చి ఉన్నాయి. ఆకలిగొని ఉన్న హిమబాల ఆ వంటకాలన్నీ చక్కగా తిని, అక్కడే పడుకొని నిద్రపోయింది.
ఆ యిల్లు నిజానికి ఏడుగురు మరుగుజ్జులది. వాళ్ళు రోజూ వంటంతా ముగించుకొని, అడవిలోకి వెళ్ళి మరుసటి రోజుకు కావలసిన వస్తువుల్ని సంపాదించుకొని వస్తుంటారు.
అట్లా కాసేపటికి ఇంటికొచ్చిన మరుగుజ్జులకు తెరిచి ఉన్న వాకిలి కనిపించింది- "ఓఁ! మన ఇంట్లో ఎవరో దొంగలు పడ్డారు!" అని హడావిడిగా ఇంట్లోకి వచ్చిన మరుగుజ్జులకు, అక్కడ నిద్రపోతున్న హిమబాల కనిపించింది. ఆమెను చూసి వాళ్ళకు చాలా ముచ్చట వేసింది. వాళ్ళు చాలా మర్యాదగా ఆమె వివరాలను అన్నిటినీ అడిగి తెలుసుకొని "నీకు ఎలాంటి భయమూ వద్దు; నీకు నచ్చినన్ని రోజులు మా ఇంట్లో‌ ఉండు" అన్నారు. హిమబాల సంతోషంగా వాళ్లతోబాటు ఉండిపోయింది.
ఇక అక్కడ, రాజుగారు ఆమెకోసం మొత్తం అన్ని దిక్కులా గాలించారు. అట్లా వెళ్ళినవాళ్ళెవరికీ మరుగుజ్జుల ఇల్లుగానీ, హిమబాలగానీ అడవిలో ఎక్కడా కనబడనే లేదు. చివరికి కూడా హిమబాల ఆచూకీ తెలీని రాజుగారు "నా కూతురిని తెచ్చి ఇచ్చిన వారికి అర్థరాజ్యంతో బాటు నా బిడ్డను ఇచ్చి పెళ్ళి చేస్తాను" అని చాటింపు వేయించాడు. అది విని ఎందరెందరో రాజకుమారులు హిమబాలకోసం గాలించా-రు. ఎవ్వరికీ మరుగుజ్జుల ఇల్లు కనబడనే లేదు.

చివరికి ఆ సంగతి తెలిసిన ప్రక్క రాజ్యపు రాజకుమారుడు విజయుడు హిమబాలను వెతుక్కుంటూ బయలు దేరాడు. విజయుడు స్వతహాగా చాలా మంచివాడు. పక్షులకు, జంతువులకు ఎంతో సాయం చేశాడు. అతనికి మటుకు మరుగుజ్జుల ఇల్లు కనబడింది. ఆ యింట్లో విచారంగా కూర్చొని ఉన్న హిమబాలను, ఆమెను నవ్వించేందుకు ప్రయత్నిస్తున్న మరుగుజ్జులను చూసి, విజయుడు వాళ్ళతో‌ ఉల్లాసంగా మాట్లాడి, మెప్పించాడు. రాజుగారి ప్రకటన గురించి చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళందరినీ వెంటబెట్టుకొని దైవనందనుడి దగ్గరికి తీసుకొచ్చాడు.
హిమబాలనుండి జరిగిన సంగతులన్నీ తెలుసుకున్న దైవనందనుడు విజయ-సుందరిని కఠినంగా‌ శిక్షించాడు. మరుగుజ్జులను చాలా గౌరవించి, సత్క-రించాడు. విజయుడికి హిమసుందరినిచ్చి ఘనంగా పెళ్ళి చేశాడు. ఆ తర్వాత విజయుడు రెండు రాజ్యాలకూ రాజై, 'మంచి రాజు' అని పేరు తెచ్చుకున్నాడు.