అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊళ్లో రకరకాల చెట్లు ఉండేవి. ఒక్కో చెట్టు మీద ఒక్కో రకం పక్షులు గూళ్లు కట్టుకొని నివసించేవి. అక్కడ ఒక చెట్టు మీద గడ్డిపోచలతో ఒక గూడు కట్టుకొని నివసిస్తున్నది, ఓ పిచ్చుక.
ఆ పిచ్చుక లేకలేక మూడు గుడ్లు పెట్టింది. ఆ మూడు గుడ్లనూ జాగ్రత్తగా పొదిగింది. మూడిట్లోంచీ మూడు చిట్టి చిట్టి పిచ్చుకలు బయటికి వచ్చాయి. ఆకలివేస్తే అమ్మ కోసం కేకలు పెట్టటం తప్ప వాటికి ఏమీ తెలీదు. తల్లి పిచ్చుక తన మూడు బిడ్డలనూ చూసుకొని మురిసిపోయింది. వాటికోసం ఎక్కడెక్కడినుండో పురుగులను ఎత్తుకొచ్చి ఆహారంగా ఇస్తున్నది; వాటికి ఏ ఆపద రాకుండా కాపాడుకొంటున్నది; బిడ్డలను ఎంతో ప్రేమగా గుండెల్లో ఉంచుకున్నది.
అయితే దురదృష్టం వెంటాడింది. అదే రోజు రాత్రే ఓ తుఫాను మొదలైంది. గాలికి, వానకు చెట్లన్నీ గజగజలాడాయి. పిచ్చుక గూడు అల్లల్లాడింది. బిడ్డలను మూడింటినీ రెక్కల చాటున దాచి కదలకుండా కూర్చున్నది పిచ్చుక. "నేను ఏమైపోయినా పరవాలేదు; పిల్లలు బ్రతికితే చాలు" అనుకున్నది. అంతలోనే పైకొమ్మ నుండి నీళ్ళు సూటిగా పిచ్చుక గూడు మీదే పడటం మొదలు పెట్టాయి. ఇక తల్లి పిచ్చుక తట్టుకోలేకపోయింది. పిల్లల క్షేమం ముఖ్యం!

అందుకని అది సాహసించింది. గాలికి ఎదురీదింది. ఇంకా రెక్కలు రాని మూడు పిల్లలనూ చెట్టు దించింది. వెంటనే ఆ ప్రక్కనే ఉన్న మర్రిచెట్టును ఎక్కించింది. ఆ కొమ్మల మాటున వెచ్చగా ఉన్న కాకి గూటికి పోయింది. "కాకమ్మా! తుఫానులో పిల్లలు తట్టుకోలేకపోతున్నాయి. గూట్లోకి నేరుగా నీళ్ళు వచ్చేసాయి. కొద్ది సేపు మమ్మల్ని నీ గూట్లో ఉండనివ్వు. ఒకసారి ఈ తుఫాను తగ్గిందంటే మేం బయటికి వెళ్ళిపోతాం. నీ రుణం ఉంచుకోం!" అని బ్రతిమిలాడింది.
"మా ఇంట్లో చోటు లేదు. మా పిల్లలూ ఉన్నాయి-వాటికి కష్టమౌతుంది. వేరే ఎక్కడైనా ఉండరాదా.." ఇట్లా రకరకాలుగా అడ్డు చెప్పింది కాకి. చివరికి తుఫాను మరింత పెరిగే సరికి, "సరే రండి- కొద్ది సేపు మాత్రమే సుమా!" అని వాటిని లోనికి రానిచ్చింది. ఆ కాకికి రెండు బిడ్డలున్నాయి. కాకులు మూడూ ఇంట్లో విచ్చుకొని పడుకుంటే, తల్లి పిచ్చుక చుట్టూ చేరిన పిల్ల పిచ్చుకలు ఒక మూలగా ముడుచుకొని కూర్చున్నాయి.
తెల్లవారింది. కానీ తుఫాను ఇంకా వెలియలేదు. పిచ్చుక పిల్లలకు ఆకలి వేసింది. అయినా అవి కుయ్‌కయ్‌మనలేదు. కాకి పిల్లలు మటుకు "ఆకలి-ఆకలి" అని గొడవ చెయ్యటం మొదలెట్టాయి.
కొంతసేపటికి కాకి తల్లి పిచ్చుక దగ్గరకు వచ్చింది- "చూడు పిచుకమ్మా! పిల్లలు ఆకలి-ఆకలి అంటున్నాయి. బయట చూస్తే తుఫాను. నీకు నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను కాబట్టి, ఇప్పుడు నువ్వెళ్లి మాకు తినడానికి ఏవైనా పళ్లు తీసుకురా!" అంది. తను వెళ్ళలేని తుఫానులోకి, పాపం తల్లి పిచ్చుక మాత్రం‌ ఎలా వెళ్ళగలదు? అయినా దుష్టబుద్ధి అయిన కాకికి వేరే సాకు ఏదీ దొరకలేదు మరి!
తల్లి పిచ్చుక ఒకసారి తన పిల్లలకేసీ, ఒకసారి కాకికేసీ చూసింది. తర్వాత "సరేనమ్మా, నా పిల్లల్నీ ఓ కంట గమనిస్తూ ఉండు- ఏదైనా ఆహారాన్ని పట్టుకొని నిముషాల్లో తిరిగి వస్తాను" అని చెప్పి ధైర్యంగా తుఫానులోకి ఎగిరిపోయింది.
తల్లి పిచ్చుక అటు పోయిందో లేదో, కాకి అమాయకపు పిచ్చుకపిల్లల మీదికి దూకింది. ఇంకేమీ దొరకనట్లు, వాటిని చంపేసి, ఆ మాంసాన్ని తన పిల్లలకు తినిపించింది!
కొంతసేపటికి తల్లి పిచ్చుక ఏదో ఆహారాన్ని పట్టుకొని వచ్చి చూస్తే ఏముంది, కాకి గూడు అంతటా తన బిడ్డల రక్తమూ, ఎముకలూ! కాకి పిల్లల నోళ్లకు ఇంకా పిచ్చుక పిల్లల మాంసం అంటుకొనే ఉంది.
"నువ్వు వెళ్ళీ వెళ్ళగానే ఓ పాడు గ్రద్ద వచ్చి పడిందమ్మా! ముద్దుగా కనబడుతున్నాయని, నీ‌ పిల్లలు మూడింటినీ ఒక్కపెట్టున ముక్కున కరచుకొని పోయింది" అని నంగనాచిలా మాట్లాడింది కాకి.
పిచ్చుకమ్మకు ఎక్కడలేని దు:ఖం వచ్చింది. కానీ అది కాకిని ఏమీ అనలేదు- పిల్లలను చంపింది కాకే అని స్పష్టంగా తెలుస్తూనే ఉంది!
కొంతకాలం గడిచింది. పిచ్చుక ఒంటరిగా అట్లా తిరుగుతూ ఉండగా ఒకరోజున దానికి రావి చెట్టు మాటున ఒక బంగారు తీగల మూట దొరికింది. దాంతోటి అది ఈసారి రావి చెట్టుమీద ఒక బంగారపు ఇల్లు కట్టుకున్నది. ఆ గూటిని బంగారు తీగలతో రావిమానుకు బలంగా బిగించి కట్టింది- ఎంత తుఫాను వచ్చినా ఇప్పుడిక తనకు ఏమీ కాదు! ఈసారి ఆ గూటిలో రెండు గుడ్లు పెట్టి, రెండింటినీ పొదిగి పిల్లల్ని చేసింది. ఇప్పుడు తనూ-తన బిడ్డలూ ఆ ఇంట్లో హాయిగా జీవిస్తున్నాయి.

అంతలోనే మళ్లీ ఒక పెద్ద తుఫాను వచ్చింది. ఈసారి తుఫానులో కాకి ఇల్లు కూలిపోయింది. దొంగ కాకి తన బిడ్డలతో సహా పిచ్చుకగూటి దగ్గరకు వచ్చి వాలింది. "నీకు అప్పుడు నేను ఆశ్రయం ఇచ్చాను కదా, ఇప్పుడు నాకూ ఆశ్రయం ఇవ్వు" అన్నది. "నువ్వు, నీ బిడ్డలు నా చిన్ని పిచ్చుకలను చంపి తినేసినా ఆనాడు నేనేమీ అనలేదు. సమయం కాదని ఊరుకున్నాను. ఇప్పుడు సమయం నాది. చూడు, ప్రశ్న నువ్వు చేసిన చెడుది కాదు; నేను చేయని సాయానిది కాదు- నా గూటిలో మీరు ముగ్గురూ ఎలాగూ పట్టరు. ఇంత పెద్దగా ఎదిగిన మీ పిల్లలు తుఫానులో తడిసి కూడా ఏమీ కారు. నా పిల్లలు నాకు ముఖ్యం కాబట్టి, మిమ్మల్ని లోపలికి రానివ్వను. క్షమించు. కావాలంటే మా ఇంటి చూరులో నిలబడండి- తుఫాను వెలిసాక వేరే చెట్టు ఏదైనా వెతుక్కోండి" అన్నది పిచ్చుక ఖచ్చితంగా.
ప్రమాదంలోనూ వక్రబుద్ధిని ప్రదర్శించబోయిన కాకి, కాకి పిల్లలు వేరే ఎక్కడికీ‌ పోలేక, వానకు తడుస్తూ,చలికి వణుకుతూ అక్కడే కూర్చుని, ఒకసారి తుఫాను వెలుస్తోందనగా వేరే చెట్టును చూసుకున్నాయి.