అనగా అనగా జపాన్‌దేశంలో ఒక అన్న-తమ్ముడు ఉండేవారు. అన్న 1880 లో పుట్టాడు; తమ్ముడు 1887లో పుట్టాడు. 1880లో పుట్టిన తమ మొదటి కొడుక్కి వాళ్ళ అమ్మానాన్నలు ఆనాటి ఆచారం ప్రకారం 'టికిటికి టెంబోనో సారంబో హరి కరి బుష్ కీ పెరి పెంబో హై కై పం పం నికినో మీనో డొంబరాకొ" అని పేరు పెట్టారు. ఆనాటి జపాన్ లో ఇంకో నమ్మకం కూడా ఉండేదట- ఎవరినైనా సరే పూర్తి పేరుతోనే పిలవాలట- లేకపోతే అశుభం! అందుకని వీలైనంత వరకూ ఈ పిల్లవాడిని అసలు ఎవ్వరూ పిలవకుండానే పని నడిపించారట!
ఇక ఆ తర్వాత, 1887 లో తమ్ముడు పుట్టేనాటికి, ఆ తల్లిదండ్రుల ఓపిక నశించింది. పెద్ద కొడుకుకి ఉన్న పెద్ద పేరుతో అప్పటికే విసిగిపోయి ఉన్నారు మరి! అందుకని వాళ్ళు తమ ఆచారాలను పక్కన పెట్టేసి, కొత్తగా పుట్టిన తమ్ముడికి 'యాకుచి సేమో' అని ఏదో ఒక చిన్న పేరు పెట్టేశారు. "అట్లా ఎందుకు పెడతారు?! అశుభం! మరీ అంత చిన్న పేరా?! ఎట్లాంటి రోజులు వచ్చాయి?!"అని ముసలివాళ్ళు అందరూ గొణుగుతూనే ఉన్నారట- అయినా వాళ్ళ అమ్మానాన్నలు వాళ్లని అస్సలు పట్టించుకోలేదు.
ఒకరోజు అన్న-తమ్ముడు ఆడుకునేటప్పుడు, హఠాత్తుగా యాకుచి సేమో కాస్తా అక్కడున్న దిగుడు బావిలో పడిపోయాడు. అన్న పరిగెత్తుకుంటూ వెళ్లి "అమ్మా! అమ్మా! రామ్మా! యాకుచి సేమో బావిలో పడిపోయాడు!" అని అరిచాడు.

వెంటనే అమ్మకాస్తా పరిగెత్తుకుంటూ వెళ్లి, నాన్నతో "యాకుచి సేమో బావిలో పడి పోయాడట!" అని చెప్పింది.
నాన్నకూడా తక్షణం పరిగెత్తుకుంటూ వెళ్లి "తోటమాలీ! తోటమాలీ! యాకుచి సేమో బావిలో పడిపోయాడు!" అని అరిచాడు.
తోటమాలి పరుగెత్తుకుంటూ వచ్చి ధడాలున బావిలోకి దూకి, మునకలు వేస్తున్న యాకుచి సేమోను కాపాడాడు.
కొన్ని రోజుల తర్వాత, ఈ సారి అన్న బావిలో పడిపోయాడు.
తమ్ముడు పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్లి "అమ్మా! అమ్మా! టికి టికి టెంబోనో.......!" అంటూ పేరంతా చెప్పి, "బావిలో పడిపోయాడు!" అన్నాడు.
"ఓర్నాయనో" అనుకుంటూ అమ్మ పరిగెత్తుకుంటూ నాన్న దగ్గరికి వెళ్లి "టికి టికి టెంబోనో.......!" అని పేరంతా చెప్పి, "బావిలో పడిపోయాడట" అంది.
నాన్న పరుగెత్తుకుంటూ తోటమాలి దగ్గరికి వెళ్లి "ఓయ్! టికి టికి టెంబోనో........" అని పేరంతా చెప్పి "బావిలో పడిపోయాడు; కాపాడు! " అన్నాడు ఆందోళనగా.
తోటమాలి పరిగెత్తుకుంటూ వెళ్లి బావిలో దూకి "టికి టికి టెంబోనో...."ని బయటికి తీసుకువచ్చాడు.
అప్పటికే పొట్టనిండా నీళ్లు త్రాగి త్రాగి, చనిపోయే పరిస్థితికి వచ్చాడు 'టికిటికి టెంబోనో సారంబో హరి కరి బుష్ కీ పెరి పెంబో హై కై పం పం నికినో మీనో డొంబరాకొ'.
అప్పుడు అక్కడ చేరిన జనాలందరూ అతని పొట్టని నొక్కి నీరు బయటికి తీసి, అతని ప్రాణాన్నైతే రక్షించారు కానీ, అతను కోలుకునేందుకు చాలా రోజులే పట్టింది!
ఇక దాంతో ఆనాటి నుండీ జపాన్ లో అందరూ తమ పిల్లలకి చిన్న పేర్లు పెట్టుకోవడం మెదలుపెట్టారు- లేకపోతే వాళ్ల పిల్లలకు భద్రత ఉండదు కదా, అందుకని!
ఇంతకీ మరి మీ పూర్తి పేరేంటి? :-)