ఊరి మధ్యలో అందరూ గుమిగూడి ఉన్నారు. వారిలో పిల్ల-పెద్ద, ముసలి-ముతక, ఒక్కరేమిటి- అందరూ ఉన్నారు. ముక్కు పచ్చలారని ఒక ఏడేండ్ల పిల్లాడు వాళ్ళందరి మధ్యలో నిలబడి ఉన్నాడు. వాడి కాలుకు ఒక గుల్ల ఉంది. దాని ప్రభావం వల్లనేనేమో, మరి ఆ పిల్లవాడి కాలు ఏనుగు కాలులాగా ఉబ్బి ఉన్నది. అక్కడే ఉన్న వైద్యుడు ఒకడు ఆ ప్రక్కనే నిప్పుల్లో కాలుతున్న ఎర్రని కడ్డీ వైపు, పిల్లవాడి కాలు వైపుకు మార్చి మార్చి చూస్తున్నాడు.
ఇంతకీ అక్కడ జరగబోయేదేమిటంటే, ఎర్రగా కాలుతున్న కడ్డీతో వైద్యుడు ఆ పిల్లవాడి గుల్లను కాల్చాలి. అంత చిన్న ఆ పిల్లవాడు అంత మంటని ఓర్చుకోవాలి.
కడ్డీని పిల్లవాడి కాలు మీద పెట్టడానికి ఆ వైద్యుడికి ధైర్యం చాలట్లేదు. చూసే వారికి కూడా భయంగా ఉంది- 'పాపం' అనిపిస్తున్నది.
పిల్లవాడు ఏడవటం లేదు. భయంతో వణికి పోవట్లేదు. చికాకు పడుతున్నాడు- ఆలస్యాన్ని భరించలేకపోతున్నాడు- "అయ్యా! నా స్నేహితులు నాకోసం ఎదురు చూస్తుంటారు. నేను వెళ్లి ఆడుకోవాలి. మీ పని తొందరగా కానిస్తే, నేను వెళతాను-" అని వైద్యుడినే తొందర పెడుతున్నాడు! 'వీడికి తెలీదు-కాల్చటం అంటే ఏదో తీపి తినిపించటం అనుకుంటున్నట్లున్నాడు' అనుకుంటున్నారు చుట్టూతా ఉన్న పెద్దవాళ్ళు వాడి మీద జాలిపడుతూ.
పిల్లవాడు ఎంత చెప్పినా వైద్యుడికి మటుకు ధైర్యం చాలలేదు. 'పసివాడు తట్టుకోలేడు' అన్న జాలి అతని హృదయాన్ని మెత్తబరుస్తున్నది.
ఆ పిల్లవాడు కొంత సేపు చూసాడు. తర్వాత చటాలున నిప్పుల్లోంచి ఆ కాలుతున్న కడ్డీని తీసి తానే స్వయంగా తన కాలి గుల్లమీద పెట్టుకున్నాడు. అందరూ భయంతో కళ్ళు మూసుకున్నారు. గుల్ల పగిలి రక్తం, చీము లొడ-లొడా కారాయి! అందరూ బాధగా కళ్ళుమూసుకొని ఉంటే, ఆ పిల్లవాడు మటుకు 'నా గుల్ల పగిలింది' అంటూ పల్లటీలు కొట్టాడు. గుమిగూడిన వాళ్లనందరినీ నెట్టుకొని రివ్వున ఆటకు పరుగుపెట్టాడు!
ఇంతకీ ఆ ధైర్యశాలి బాలుడు మరెవరో కాదు- ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, మన తొలి హోంశాఖామాత్యుడు, ఉక్కుమనిషి గా పేరొందిన 'సర్దార్ వల్లభభాయ్ పటేల్'. ఆనాటి వరకూ అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉన్న మన దేశాన్ని రాచరికం చేతుల్లోంచి తప్పించి సువిశాల, ప్రజాస్వామ్య భారత దేశాన్ని నిర్మించటం వెనుక ఈ ఉక్కుమనిషి తెగువ ఎంతకైనా ఉన్నది!