చాలా కాలం క్రితం గద్వాల్ అని ఓ ఊరు ఉండేది. గద్వాల్ ప్రక్కనే ఒక దట్టమైన అడవి. ఆ అడవి పేరే దయ్యాల అడవి! రోజూ రాత్రి ఎనిమిది దాటగానే అడవిలో అంతటా దయ్యాలు నిండుకునేవి. కనబడ్డవాళ్లనల్లా భయపెట్టేవి.
దాంతో రాను రాను ఊళ్ళో జనాలు రాత్రిపూట బయటికి రావాలంటేనే భయపడటం మొదలు పెట్టారు. కొత్తవాళ్ళెవరైనా వస్తే ఊళ్ళోవాళ్ళకు మహా ఇబ్బందిగా ఉండేది. వాళ్లకు ఈ దయ్యాల సంగతి చెప్పనూలేక, చెప్పకుండా ఉండనూ లేక యమయాతన పడేవాళ్ళు. కొందరు గ్రామవాసులు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఉన్న ఊరు వదలలేక కొందరు, డబ్బులు లేక కొందరు మటుకు అక్కడే ఉండిపోయారు. రాను రాను బయటి వాళ్ళందరికీ ఆ ఊరి సమస్య తెలిసిపోయింది. దాంతో కొత్తవాళ్ళెవరూ ఆ గ్రామానికి రాకుండా తప్పుకు తిరగసాగారు.
ఇలా కొన్నాళ్ళు గడిచాక, ఈ బాధను తట్టుకోలేక ఊళ్ళో ఉన్నవాళ్ళంతా కలిసి మాట్లాడుకున్నారు. "ఏం చెయ్యాలి, దీనికి పరిష్కారం ఏంటి? ఎవరైనా మంచి భూత వైద్యులు వీటిని మట్టు పెట్టగలరా?" అన్నాడు ఊరి పెద్ద.
"ఒకటి రెండు దయ్యాలనైతే భూతవైద్యులు ఏ సీసాలోనో బందీ చెయ్యగలరేమో గానీ, ఇన్ని దయ్యాలను ఎవరైనా ఏం చేయగలరు?" పెదవి విరిచాడు ఊరి పూజారి.
పూజారి అలా అనటంతో చుట్టూ ఉన్నవాళ్ళంతా దిగాలు పడి మౌనంగా ఉండిపోయారు.
అంతలో పూజారి కొడుకు విశ్వేశు "నాకు తెలుసు- దయ్యాలు మనల్ని ఏమీ చెయ్యకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో- మనం వాటితో స్నేహం చెయ్యాలి!" అని అరిచాడు.
అంత విచారంలోనూ ఊళ్ళో జనాలంతా నవ్వారు. "దయ్యాలతో స్నేహం చెయ్యాలట!" అని.
అందరూ నవ్వటమైతే నవ్వారు గానీ, నిజంగా ఏం చేస్తే సమస్య దూరమౌతుందో ఎవ్వరికీ తెలీనే లేదు. ఒకరోజంతా ఆలోచించాక, 'ఎవరిదగ్గరా వేరే ఏ ఉపాయమూ లేదు' అని నిర్థారణ అయ్యాక, పూజారి అన్నాడు- "పిల్లలు భగవంతుడి రూపాలు అంటారు. వీడు చెప్పినట్లు చేసి చూద్దాం. వేరే మార్గం కూడా ఏదీ లేదు గద!" అని. అందరూ తల ఊపారు.
ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకల్లా ఊళ్ళో పెద్ద మనుషులు, పిల్లలు అందరూ బయటికి వచ్చి కూర్చున్నారు.
అంతలోనే దయ్యాలు వికవికమంటూ వచ్చాయి- "ఓయ్! మనుషులు! ఓయ్! మనుషులు!" అని అరుచుకుంటూ.
అయితే అవి త్వరలోనే విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాయి- వీళ్ళెవ్వరూ తమని చూసి భయపడటం లేదు!
అంతలో పిల్లలు కొందరు ముందుకొచ్చి, దయ్యాలకేసి చూస్తూ ఉత్సాహంగా "ఏయ్! దయ్యాలూ! మీరు మాతో స్నేహం చేస్తారా?" అని అడిగారు.
దయ్యాలు ఒకదాని ముఖం ఒకటి చూసుకున్నాయి. "మీరు మనుషులు; మేము దయ్యాలం- మరి స్నేహం ఎలా?" అడిగిందో ముసలి దయ్యం.
"దానిదేముంది, నేను రెండో తరగతి, వీడు ఏడో తరగతి. అయినా మేమిద్దరం స్నేహం చేస్తున్నాము కదా, అలాగే" చెప్పాడు సూర్యం.
దయ్యాలన్నీ తలలు ఊపుకున్నాయి. "బాగానే ఉంటుందేమో! మాకూ వేరే ఎవ్వరూ స్నేహితులు లేరు" అన్నాయి కొన్ని. కొంచెం సేపు గందరగోళంగా ఏమేమో చర్చించుకున్న తర్వాత ఒకే గొంతుతో "మేము మీతో స్నేహం చేయడానికి సిద్ధం" చెప్పాయవి.
"సరే, స్నేహం చేద్దామంటున్నారు; చేస్తాం. కానీ అసలు స్నేహం చేయటం అంటే ఏమిటి?” అడిగింది ఒక దయ్యం.
"ఏముంది, స్నేహం చేయటం అంటే ఒకరితో ఒకరు చాలా మంచిగా ఉండటం; వస్తువులు ఇచ్చి పుచ్చుకుంటుండటం, ఎదురయి-నప్పుడల్లా చిరునవ్వు నవ్వటం. 'బాగున్నావా'? అని పలకరించటం-" చెప్పింది కరుణ, ఉత్సాహంగా.
దయ్యాలన్నీ సంతోషంగా తలలు ఊపాయి.
"నేను చాలా మంచిగా ఉన్నానా? నీకేం బహుమతి ఇష్టం? ఇలాగేనా నవ్వేది? బాగున్నారా?" అని గందరగోళంగా మనుషులు, దయ్యాలూ అందరూ ఒకరినొకరు అడుగుతూ గడిపారు ఆరోజు. మనుషులు తమ దగ్గరున్న పళ్ళు, తాము చేసిన వంటకాలు దయ్యాలకు తెచ్చి పెట్టారు. దయ్యాలు తమ దగ్గరున్న బంగారమూ నగలూ తెచ్చి ఇచ్చాయి.
ఇట్లా కొంతకాలం గడిచేసరికి, గద్వాల్‌కు ఇక దయ్యాల బెడద పోయింది.
ఎందుకంటే మనుషులతో స్నేహం చేస్తూ చేస్తూ, పూర్తిగా మనుషుల అలవాట్లు నేర్చేసుకొని, మంచివైపోయాయవి. ఇక ఎవ్వరికీ దయ్యాల బెడద లేనే లేదు!