అనంగపురం అనే రాజ్యాన్ని అశోకవర్మ అనే రాజు పరిపాలించేవాడు. రాజు చాలా మంచివాడు- కానీ ఎంతకీ ఆ రాజుకి పిల్లలు కలగలేదు. మంత్రుల సలహా మేరకు మరో పెళ్ళి చేసుకున్నాడు- ఆమెకీ పిల్లలు కలగలేదు. అప్పుడు ఆ రాజు ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అట్లా ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నప్పటికీ అతనికి పిల్లలు పుట్టలేదు! దాంతో అశోకవర్మ చాలా దిగులు చెందసాగాడు.
ఆ సయమంలో అతని అంతరంగిక మిత్రుడు వీరసేనుడు రాజుతో "ప్రభూ! రామాపురంలో కృష్ణయ్య అనే పండితుడు ఉన్నాడట. రకరకాల సమస్యలకు ఆయన సమాధానం చెప్పగలడని విన్నాను. మీ అనుజ్ఞ అయితే, మనం ఓసారి ఆయన్ని కలిసి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం" అన్నాడు.
రాజుగారు సరేనన్నారు. వీరసేనుడిని వెంటబెట్టుకొని రామాపురం వెళ్ళారు.
చూడగా కృష్ణయ్య చాలా పేదరికంలో ఉన్నట్లున్నాడు- ఆయన ఇల్లు శిథిలావస్థలో ఉన్నది. "ఈయనేనా కృష్ణయ్య..?" అనిపించేట్లుగా ఉన్నాయి ఆ పరిసరాలు. రాజుగారు ఒక్క క్షణంపాటు సందేహించారు. ఆ తర్వాత తేరుకొని, తను తెచ్చిన బహుమతులను ఆయనకు అర్పించి, తన బాధ చెప్పుకున్నారు.
కృష్ణయ్య రాజుగారి బహుమతులను పట్టించుకోకుండా ఆయనకేసి తేరిపార చూసి, "ప్రభూ! మీ జాతకం ఉంటే ఇప్పించండి" అన్నాడు. రాజుగారు తన జాతక పత్రాలను ఆయనకు చూపించారు. కృష్ణయ్య కొంతసేపు ఆ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించి "రాజా! మీరు మరో పెళ్ళి చేసుకోండి. తొమ్మిదో భార్యకు సంతానం కలుగుతుంది. అయితే ఒక్కమాట- ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు. మీ వంశంలోని వారందరికీ ఈ సమస్య ఉంటుందని గమనించండి" అన్నాడు.
"మీరంటున్నదేమిటో అర్థం కాలేదు మహానుభావా! వివిరంగా చెప్పండి" అన్నాడు రాజు.
"మీ వంశంలోని వారందరికీ తొమ్మిది పెళ్ళిళ్ళు జరిగితే గాని బిడ్డలు కలుగరని జాతకం చెబుతోంది" అన్నాడు కృష్ణయ్య. రాజుగారికి దిగులు వేసింది. "ఈ సమస్య తనకే కాదు- తన వంశంలో అందరికీ" అని తెలిసాక ఆలోచించారు- "నిజమే- తన తండ్రికి, తాతకు కూడా తొమ్మిది మంది భార్యలు.."
"దీనికి విరుగుడు ఏమీ లేదా, స్వామీ?!" అడిగాడు కృష్ణయ్యను.
"రాజా! దిగులు చెందకండి. నేను ప్రస్తుతం కాశీ యాత్రకు బయలుదేరుతున్నాను. తిరిగి వచ్చేందుకు కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఆ తర్వాత మీ ప్రశ్నకు సమాధానం అందించగల్గుతాను. అప్పటివరకూ మీ బహుమతులతో నాకేమీ పని లేదు. వాటిని మీరు తిరిగి తీసుకుని వెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. మీ వివాహపు ఏర్పాట్లు చేసుకోండి. త్వరలో‌ ఆ భగవంతుని దయవల్ల మీకు పుత్ర సంతానం లభిస్తుంది" అన్నాడు కృష్ణయ్య, వాళ్ళకు వీడ్కోలు చెబుతూ.
రాజు తొమ్మిదో వివాహం చేసుకున్నాడు. కృష్ణయ్య చెప్పినట్లుగానే కొన్నాళ్లకి వాళ్లకి ఒక కుమారుడు కలిగాడు. అతనికి సమీరవర్మ అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. సమీరవర్మకూడా తండ్రిలాగే ఎంతో బుద్ధిమంతుడు మరియు సాహసవంతుడు.
రోజులు గడుస్తున్నాయి. సమీరవర్మ యుక్తవయస్కుడు అయ్యాడు. రాజు అశోకవర్మకు హఠాత్తుగా ఆరోగ్యం పాడై, మంచాన పడ్డాడు. అప్పుడు అతనికి కృష్ణయ్య గుర్తుకు వచ్చాడు. "ఆయన బహుశ: కాశీ నుండి తిరిగి వచ్చి ఉండాలి.." వెంటనే రాజుగారు ఆయన్ని సకల మర్యాదలతో తోడ్కొనిరమ్మని వీరసేనుడిని పంపాడు.
అయితే కృష్ణయ్య ఇల్లు తాళం వేసి ఉన్నది. ఇంకా శిధిలమై ఉన్నది. "ఈయన ఇంకా కాశీనుండి తిరిగి రాలేదేమో.." అనుకున్న వీరసేనుడికి ద్వారబంధానికి తగిలించిన పత్రం ఒకటి దొరికింది.
అందులో‌ ఇలా ఉన్నది: "ప్రభూ! ఇది మీకు అందేనాటికి నేను ఇక్కడ ఉండను. కుమారుడు మార్పు కోరుకుంటే వివాహానికి ముందు ఒంటరిగా వెళ్ళి ఉత్తరదిక్కున ఉన్న అడవిలో పది ఊడల మర్రి చెట్టు మొదట్లో త్రవ్వమని చెప్పండి -విధేయుడు, కృష్ణయ్య"
పత్రం చదువుకొని రాజుగారు తల ఊపారు. రోజురోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది. ఇంక ఎక్కువ రోజులు బ్రతకనని తెలుసుకున్న రాజు తన కొడుకు సమీరవర్మని పిలిచి తను రాసి ఉంచిన పత్రాన్ని అందించాడు- "బాబూ! నేను చనిపోతున్నాను. మన వంశానికి ఒక శాపం ఉంది" అంటూ కృష్ణయ్య చెప్పిన వివరాలన్నీ కుమారునికి చెప్పి "రాజ్యాన్ని రామరాజ్యంగా పరిపాలించు. రాముని అడుగుజాడల్లో నడుపు. నీకు 'పెళ్ళి చేసుకోవాలి' అనిపించినప్పుడు, ముందుగా ఈ పత్రాన్ని తెరిచి, దానిలో రాసి ఉన్న ప్రకారం చెయ్యి" అని అశోకవర్మ కన్ను మూశాడు.
అశోకవర్మ చనిపోయిన వెంటనే మంత్రులు సమీరవర్మకు పట్టాభిషేకం జరిపించారు. ఏడాది తర్వాత అతనికి వివాహం చేయాలని సంకల్పించారు. వివిధ దేశాల రాకుమార్తెల చిత్రపటాలను తెచ్చి చూపారు. అందరూ‌ అందంగానే అనిపించారు సమీరవర్మకు. అయితే ఆ వెంటనే తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి-
తండ్రి ఇచ్చిన పత్రాన్ని తెరిచి చూశాడు. "నాయనా! మన వంశానికి ఉన్న శాపం ప్రకారం వంశాంకురం కావాలంటే నువ్వు తొమ్మిది పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. అలాకాక, రాముడిలా ఏకపత్నీ వ్రతుడిగా ఉండాలనుకుంటే ముందు నువ్వొక్కడివే రాజ్యానికి ఉత్తర దిక్కుగా ఉన్న అడవికి వెళ్ళు- అక్కడ పది ఊడలు దిగిన మర్రి చెట్టు మొదట్లో తవ్వు" అని ఉంది అందులో. "భార్య కోసం చెట్టు క్రింద తవ్వడం ఎందుకు?" అనుకున్నాడు సమీరవర్మ.
కానీ తండ్రి మంచితనం గుర్తొచ్చి, అడవికి ప్రయాణమయ్యాడు. మర్రిచెట్టుని చేరి, దాని మొదలు దగ్గర తవ్వాడు. ఆరడుగులు త్రవ్వాక అతనికి అక్కడ ఒక పెద్ద చెక్క పెట్టె కనిపించింది. చాలా బరువుగా ఉన్నదది. ఒక్కడే దాన్ని పైకి లాగటం చాలా కష్టం అయింది. "లోపల ఏమున్నది- ఏ బంగారమో, వెండో, ఏ నిధో ఉందా? అయినా నిధికీ నా పెళ్ళికీ ఏం సంబంధం?" అనుకుంటూ ఆ పెట్టె మూతను తెరిచి చూశాడు సమీరవర్మ. లోపల అందమైన ఎనిమిది బంగారు విగ్రహాలు ఉన్నాయి. ఆశ్చర్యంగా ఎనిమిది విగ్రహాలూ ఎనిమిది వేర్వేరు యువతులవి! సమీరవర్మ వాటిని అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తుండగా ఎనిమిదో విగ్రహం ప్రక్కన పడిఉన్న చీటీ ఒకటి అతని దృష్టిని ఆకర్షించింది. దాన్ని తీసి చదివాడు- "ఎనిమిది ముఖాలూ బాగా చూశావుగా? ఇప్పుడు ఒంటరిగానే రామాపురం పోయి కృష్ణయ్య ఇంటి మధ్యలో తవ్వి అద్దాన్ని తీసుకో" అని ఉంది.
సమీరవర్మ విగ్రహాలని కోటకి చేర్చి తర్వాత రోజు ఉదయాన్నే రామాపురానికి ప్రయాణమయ్యాడు. కృష్ణయ్య ఇంటికి చేరాడు. ఆసరికి కృష్ణయ్య ఇల్లు పూర్తిగా పాడుబడి, అక్కడక్కడా కూలిపోయి ఉన్నది.
సమీర వర్మ జాగ్రత్తగా ఇంటి లోపలికి వెళ్ళి, చీటీలో ఉన్న గుర్తుల ప్రకారం ఇంటి మధ్యలో తవ్వాడు- అక్కడో దంతపు పెట్టె బయట పడింది! ఆ పెట్టెలో ఒక గుండ్రని అద్దం, దాని ప్రక్కనే ఓ చీటీ కనిపించింది.. ఆత్రంగా ఆ చీటీని తెరిచి చదివాడు సమీరవర్మ: "ఈ అద్దంలోగుండా చూసినపుడు ఏ స్త్రీ ముఖమైతే నవ్వుతూ కనిపిస్తుందో ఆమెని నీ భార్యగా స్వీకరించు" అని రాసి ఉంది.
సమీరవర్మ కోటకి చేరి విషయాన్ని మంత్రులకి తెలియజేశాడు. "రాజ-కుమారుడిని వివాహమాడదలచిన వారంతా ఫలానా తేదీన అనంగపురానికి విచ్చేయాలొహో!" అంటూ దేశదేశాలలోనూ దండోరా వేయించారు మంత్రులు. రాకుమారుడి గొప్పతనం గురించి విన్న తల్లితండ్రులు అనేకమంది ఆశతో తమ కుమార్తెలను వెంటబెట్టుకొని ఒక రోజు ముందుగానే అనంగపురానికి విచ్చేశారు. సమీరవర్మ వారివారి తాహతుకు తగినట్లుగా వారందరికీ విడిది ఏర్పాటు చేయించాడు.
మరుసటి రోజున తనకు కృష్ణయ్య ఇంట్లో దొరికిన అద్దాన్ని తన గది ముందు వేళ్ళాడకట్టాడు సమీరవర్మ. "రాకుమారుడిని పెళ్ళాడ వచ్చిన యువతులందరూ ఆ అద్దంలో చూసి ముఖం సరిచేసుకొని లోపలకి వెళ్ళాలి" అని అద్దం ముందు నిలబడ్డ దాసీలు ఒక్కొక్క యువతికీ చెప్పసాగారు. వచ్చిన వాళ్ళంతా అద్దంలో ముఖం చూసుకొని లోపలకి వెళ్ళసాగారు. తెర చాటున నిలబడిన సమీరవర్మ అద్దంలో ఒక్కొక్కరి ముఖాన్నీ చూడసాగాడు. మధ్యాహ్నమయ్యింది; అయినా అంత వరకూ ఒక్క యువతి ముఖం కూడా నవ్వుతూ కనపడలేదు అద్దంలో..

మెల్లగా సాయంత్రం అయ్యింది. చూసిచూసి విసుగు పుట్టిన సమీరవర్మ చల్లగాలి కోసం మిద్దెమీదికి వచ్చాడు. సరిగ్గా అదే సమయానికి లోనికి అడుగు పెడుతున్నది, మాళవదేశపు రాజకుమారి. ఆమెను చూడగానే సమీరవర్మకి చాలా సంతోషం కలిగింది- "కనీసం ఈమె ముఖమన్నా నవ్వుతూ కనపడితే బాగుండు" అనుకున్నాడు. వేగంగా క్రిందికి దిగవచ్చి, తెర చాటున నిలబడి చూడసాగాడు.
మాళవ రాకుమారి మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. మొదట తెర వైపు చూసింది. రాకుమారుడు తెర వెనుక నిలబడి చూస్తున్నట్లుగా అనుమానం వచ్చిందా-మెకు. ఒక్కసారిగా ఆమెను సిగ్గు కమ్మేసింది. అలా అలవోకగా అద్దంలోకి చూస్తూ సిగ్గుతో చిరునవ్వు నవ్విందామె. నవ్వుతూ కనపడిన ఆమె ముఖం అద్దంలో కనబడగానే సమీరవర్మ తెర చాటు నుండి వెలుపలకి వచ్చాడు- మంత్రులు తెచ్చిఉంచిన పూలదండను మెడలో వేసి, ఆమెను తన భార్యగా స్వీకరించాడు.
త్వరలోనే వాళ్ళకి ఒక కుమారుడు కలిగాడు. మాళవ రాకుమారే సమీరుడి మొదటి భార్య, తొమ్మిదో భార్య కూడాను! వాళ్ల వంశాన్ని ఇప్పుడిక ఏ శాపమూ వేధించదు!