ఒక రోజు రాత్రి 7గంటలప్పుడు అమ్మ నన్ను గ్రుడ్లు తెమ్మని బయటికి పంపింది.






నేను గ్రుడ్లు కొనుక్కొని వెనక్కి వస్తుంటే ఒక ఇంటి ముందు నోటు ఒకటి పడి కనిపించింది. చూడగా అది ఐదువందల రూపాయలు!





నేను ఆ నోటును పట్టుకొని అటూ ఇటూ చూశాను. అక్కడికి దగ్గర్లోనే అడుక్కునే అవ్వ ఒకతె కూర్చొని ఉండింది. నేను ఆమె దగ్గరికెళ్ళి "అవ్వా! నీ డబ్బులు ఏమైనా పోయాయా?" అని అడిగాను. "లేదు తల్లీ! నా దుడ్లు నాదగ్గరే ఉన్నై" అన్నదా అవ్వ. "సరేలే అవ్వా! నాకు ఇక్కడ ఓ నోటు దొరికింది. ఎవరైనా దానికోసం వెతుక్కుంటూ వస్తే మా ఇంటికి రమ్మని చెప్పు" అని ఆ అవ్వకు మా అడ్రస్ ఇచ్చాను నేను.





ఇంటికి వచ్చాక అమ్మకు విషయం అంతా చెప్పాను. "ఒక వారం రోజులు చూద్దాం; అయినా దానికోసం ఎవ్వరూ రాకపోతే తీసుకెళ్ళి అనాధాశ్రమంలో ఇచ్చేద్దాం" అన్నది అమ్మ.







రెండు రోజులు గడిచాక చాకలి ఆమె ఒకామె మా యింటికి వచ్చింది: "అమ్మా! ఆ డబ్బు నాదేనమ్మా" అంటూ. "ఎన్ని రూపాయలు?" అడిగాను నేను. "ఐదు వందల నోటమ్మా! అవ్వ కూర్చుని ఉంటుందే, ఆ తెల్ల మేడలోనేనమ్మా, నేను పని చేసేది! నెలంతా బట్టలు పిండుతాను కదా, అందుకని మొన్న సాయంత్రం ఆ ఇంటి వాళ్ళు ఐదు వందలిచ్చారు. ఇంటికెళ్ళి చూస్తే లేనే లేదు; ఎక్కడ పోగొట్టుకున్నానో తెలీదు! చాలా బాధ పడ్డానమ్మా! చివరికి ఇవాళ్ళ అవ్వనడిగితే చెప్పింది-" అన్నది చాకలామె.





"సరేలే! ఈ నోటు నీదే! తీసుకెళ్ళు!" అన్నాను నేను, అమ్మనడిగి నోటు తెచ్చిస్తూ.







ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది. "వేరే పిల్లలకు ఎవరికి దొరికినా నాకు తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు- నువ్వు చాలా మంచిదానివమ్మా! నా డబ్బును నాకు ఇచ్చావు. ఇంద- ఇది తీసుకొని నీకు నచ్చిందేదైనా కొనుక్కో" అంటూ తన దగ్గరున్న డబ్బుల్లోంచి యాభై రూపాయలు ఎంచి నాకు ఇవ్వబోయిందామె.





నాకు చాలా సంతోషంగాను, తృప్తిగాను అనిపించింది. అమ్మకేసి చూస్తే "వద్దు-తీసుకోకు" అన్నట్లు తల అడ్డంగా ఊపింది. నేనన్నాను "నీ డబ్బులు నీకు దొరికినాయి- అంతే చాలు. నాకేమీ అక్కర్లేదు" అని. చాకలామె వెళ్ళాక, నేను చాలా సంతోషంగా ఉండటం చూసి అమ్మ అన్నది: "చూశావా! నీతిగా నిజాయితీగా ఉండటం వల్ల ఎంత సంతోషం కలుగుతుందో?" అని.