తనవాళ్లంటూ లేని వెంకటికి వారసత్వంగా రెండెకరాల పొలం మటుకు వచ్చింది. అయినా దాన్ని సాగు చేసేందుకు అతని దగ్గర డబ్బుండేది కాదు. ఆ కొద్దిపాటి డబ్బుకోసం అతను, అతని భార్య అంజలీ నానా తంటాలూ పడేవాళ్ళు. భార్యాభర్తలిద్దరూ కూలికి పోయి, ఆ కూలిడబ్బుల్లో కొంత వెనకేసుకొని వాటితో పొలం సాగు చేసుకునేందుకు ప్రయత్నించారు.
ఎంత చేసినా పల్లెలో ఎదుగూ బొదుగూ ఉండేది కాదు. అంతలో ఓసారి కరువు వచ్చి, పొలంలో వేసిన పంటంతా దెబ్బతిన్నది. ఆ దెబ్బతో వెంకటి,అంజలి ఎవరెవరి దగ్గరో అప్పులు చేసి, వడ్డీలమీద వడ్డీలు కట్టి, ఉన్నదంతా పోగొట్టుకున్నారు.
"పట్నం వెళ్ళిపోదాం వెంకటీ, ఇక్కడ ఇక మనకు జరగదు" అంది అంజలి ఓ రోజున.
"నాకూ అదే అనిపిస్తోంది అంజలీ, కానీ పట్నంలో మనకు ఈ వాతావరణం ఉండదు- గాలి బాగుండదు; నీళ్ళు బాగుండవు- అంతా కాలుష్యం. మన బ్రతుకు తీరు పూర్తిగా మారిపోతుందని చూస్తున్నాను" అన్నాడు వెంకటి.
"ఇప్పుడు మన బ్రతుకు సుఖంగా ఏమున్నది గనక? పట్నం‌ పోయి చూద్దాం, అక్కడా జరగక పోతే మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం" అంది అంజలి.

అట్లా పట్నానికి వచ్చిన వెంకటి-అంజలి రకరకాల పనులు చేశారు. ఇంటి పనులకు కూలీలుగా పోయారు; ఇళ్ళ కాపలా పనులు, పాత్రలు కడిగే పనులు చేశారు; మెల్లగా పొదుపు చేసుకున్నారు- చిన్న కిరాణా దుకాణం ఒకటి తెరుచుకున్నారు. కాలం కలిసి వచ్చింది. దుకాణం విస్తరించింది. బాగా డబ్బు వచ్చింది. వెంకటి కాస్తా వెంకటేశ్వర్లు అయ్యాడు. చాలామందికి సాయం చేశాడు. 'గొప్పవాడు' అని పేరు తెచ్చుకున్నాడు. అంతలోనే వాళ్ళకు సాయి పుట్టాడు. భార్యా భర్తలిద్దరూ మురిసిపోయారు. వాడిని ఓ గొప్ప బడిలో చదివించారు. కష్టం తెలీకుండా పెంచారు.
సొంత ఊరంటే ఇష్టం ఉన్న వెంకటి క్రమంగా కలవారిపల్లిలో ఓ ఇరవై ఎకరాల భూమి కొన్నాడు. తమ ఇంటికి కావలసిన బియ్యం, పప్పులు అన్నీ అక్కడే కృత్రిమ ఎరువులు లేకుండా పండించుకునే ఏర్పాట్లు చేసుకున్నాడు.
సాయి పదో తరగతి దాటేసరికి, వాళ్లమ్మ అంజలి ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆమెకు మంచి పరిసరాలు, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించటం అవసరం. "సంపాదించింది చాలు. మనం ఈ పనులన్నీ కట్టిపెట్టి ఇక పల్లెకు వెళ్ళిపోదాం" అనుకున్నారు భార్యాభర్తలిద్దరూ.
అయితే సాయికి అది ఏ మాత్రం ఇష్టం కాలేదు. వాడు ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాడు. "మీరు వెళ్తే వెళ్ళండి. నేను మాత్రం పట్నంలోనే ఉంటాను" అని మొండికేశాడు. నిజంగా కూడా వాడివన్నీ‌ పట్నం పోకడలే. తల్లిదండ్రులు పల్లెనుండి వచ్చినా, వీడు ఏనాడూ పల్లె ముఖమే చూసి ఎరుగడు కదా?! పట్నంలో ఉన్న వసతులు, సౌకర్యాలకు అలవాటు పడిన సాయి అవి లేకుండా ఉండే జీవితాన్నే ఊహించుకోలేకపోయాడు.
చివరికి వెంకటేశ్వర్లు-అంజలి వాడు అక్కడే ఉండి చదువుకునేందుకు ఏర్పాట్లు చేసి, వాడిని పట్నంలోనే వదిలి, తాము మాత్రం పల్లెకు తిరిగి వచ్చారు.

ఇప్పుడు వాళ్ళు కలవారిపల్లెలోనే అన్ని వసతులతోటీ ఒక ఇల్లు కట్టుకున్నారు; దగ్గరుండి పంటలు పండించుకుంటున్నారు; కాలుష్యం లేని గాలిని పీలుస్తున్నారు; నిజంగా మంచి నీళ్ళను త్రాగుతున్నారు; ఊళ్ళో జనాలకు ఉపయోగపడే రకరకాల కార్యక్రమాలు చేపట్టారు- అంతా బాగుంది- అంజలి ఆరోగ్యం కూడా మెరుగైంది- కానీ, సాయి మటుకు పల్లెకు రాలేదంటే రాలేదు! అమ్మానాన్నలకు తనకంటే ఎక్కువ ఇష్టమైన ఆ పల్లె అంటే ఎందుకనో, సాయికి చెప్పలేని అయిష్టం ఏర్పడింది! చివరికి వాడికి సెలవలు ఇచ్చినా, తల్లిదండ్రులు కొత్త ఇంట్లో చేరినా, వాడు మాత్రం రాలేదు- పట్నంలోనే ఉండిపోయాడు!
సాయి చదివే కాలేజీకి ఒక రివాజు ఉన్నది. 'తమ విద్యార్థులకు నిజమైన భారతదేశాన్ని చూపించాలి' అని వాళ్ళ విశ్వాసం. అందులో భాగంగా వాళ్ళు ప్రతి ఏడాదీ తమ పిల్లల్ని ఏదో ఒక పల్లెను సందర్శించేందుకు తీసుకెళ్తారు. ముందుగా ఆ ఊరిలో ఉన్న పెద్దమనుషులెవరినైనా సంప్రతించి, అక్కడ రెండు మూడు రోజులపాటు ఉండేందుకు వసతి చూసుకొని, పిల్లలందరినీ బస్సులో అక్కడికి తీసుకెళ్తారు. అధ్యాపకులు అక్కడ వారికి పల్లె జీవితంలోని రకరకాల అంశాలను చూపిస్తూ వివరిస్తారు. ఈసారి కూడా అలా పిల్లలనందరినీ వెంటబెట్టుకొని, వాళ్ళు పల్లెకు బయలుదేరారు. "పిల్లలూ! ప్రతి అంశాన్నీ జాగ్రత్తగా గమనించండి. గమనించిన అంశాలను నోట్ చేసుకోండి. వెనక్కి రాగానే 'పల్లె జీవితం' గురించి మీరు రాసిన వ్యాసాలను సమర్పించాల్సి ఉంటుంది. సరేనా?" చెప్పారు అధ్యాపకులు, బస్సులో.
గమ్యం దగ్గరవుతున్నకొద్దీ వాతావరణం మారసాగింది. ఇరుకైన రోడ్లు, ఆగిపోయిన వాహనాల స్థానే పచ్చని పొలాలు, ఎత్తైన కొండలు కనిపించసాగాయి. "మనం వెళ్తున్న పల్లె మరో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే అక్కడికి చేరేముందు మనం 'కోన'లో ఆగి, అక్కడున్న గుడిని సందర్శించి పోదాం" చెప్పారు అధ్యాపకులవారు.
కోనలో దిగిన పిల్లలంతా అనందం పట్టలేకపోయారు- ఉత్సాహంతో గంతులు వేశారు. పెద్ద పెద్ద వృక్షాలు, పెద్ద మెట్లబావిలో మెరుస్తున్న స్వచ్ఛమైన నీళ్ళు, ప్రక్కనే ప్రవహిస్తున్న వాగు, శుభ్రంగా ఊడ్చి ముగ్గులు పెట్టిన పరిసరాలు- ఆ ప్రశాంత వాతావరణం మొత్తం ఆనాడు పిల్లల కోలాహలంతో కళకళలాడింది.

సాయి, మిత్రులు అందరూ అక్కడ ఎగిరి, దూకి, స్నానాలు చేసి, గుడిలో దేవుడిని దర్శించుకొని, భోజనాల వేళకు కొండల నడుమన ఉన్న ఆ పల్లెకు బయలుదేరారు.
పల్లెలో ఓ పెద్ద పొలంలో ఉన్న రేకుల షెడ్డులో వాళ్లందరికీ భోజనం, వసతి ఏర్పాట్లు చేసి ఉన్నై. అద్భుతమైన భోజనం వాళ్ళకోసం ఎదురుచూస్తూ ఉండింది.
ఆరోజంతా పంటపొలాల గురించీ, మొక్కల గురించీ రకరకాల విషయాలు తెలుసుకున్నారు వాళ్ళు. పొలాల్లో నీళ్ళు పారించటం గురించీ, బిందు-తుంపర సేద్యాల గురించీ, ట్రాక్టర్లు-కోతల యంత్రాల గురించీ ఇలా తమకు తెలీని ఎన్నెన్నో సంగతులు తెలుసుకున్నారు.
"ఈ పొలం యజమానిగారు గొప్ప ప్రకృతి ప్రేమి. ఇవాళ్ళ రాత్రి మనందరికీ వాళ్ల ఇంట్లోనే, భోజనం" అని వాళ్లందరినీ పల్లెలోకి తీసుకెళ్ళారు అధ్యాపకులవారు. అందరూ ఉత్సాహంగా ఆ యింట్లో అడుగు పెట్టారు. పెద్దవాకిలి, అందమైన లోగిలి, వాకిలికి ముందు ఓ చక్కని పెద్ద పందిరి, పందిరికి అల్లుకొని ఉన్న తీగలు, తీరుగా పూసిన పూల నుండి వెలువడే సువాసన, మరోవైపున వంటకాల ఘుమఘుమ- అందరితో బాటు సాయి కూడా మైమరచిపోయాడు.
చూడగా ఆ యిల్లు వేరెవరిదో కాదు- సాయి వాళ్లదే! ఇంట్లో అడుగు పెట్టగానే వాళ్ల అమ్మా నాన్నలు పరుగున వచ్చి వాడిని దగ్గరికి తీసుకున్నారు!
"ఇంతసేపూ మాకెవ్వరికీ ఈ సంగతి చెప్పనే లేదు కదరా! నువ్వెంత అదృష్టవంతుడివిరా, మీ ఇల్లు ఎంత బాగుందిరా! మీ అమ్మానాన్నలెంత మంచివాళ్ళురా!" ఇలా తోటి విద్యార్థులందరూ తనని పొగడ్తల వర్షంలో ముంచెత్తితే, దాన్ని తను ఇంతకాలమూ చూడనైనా చూడనందుకూ, కోపం చేసుకున్నందుకూ సాయికి ఎక్కడలేని సిగ్గు వేసింది.
అటు తర్వాత వాడికి తమ ఇల్లన్నా, పల్లె అన్నా ఎక్కడ లేని ఇష్టం కలిగిందని వేరే చెప్పనక్కర్లేదుగా?!